AP Unlock 5.0 Guidelines: అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, అక్టోబర్ 15 నుంచి అమల్లోకి.., మాస్క్ లేకుంటే నో ఎంట్రీ
స్కూళ్లు, వ్యాపార కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు చర్యలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న మార్గదర్శకాలను (AP Unlock 5.0 Guidelines) ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులిచ్చారు.
Amaravati,Oct 10: కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలను (Unlock 5.0 Guidelines) ప్రకటించింది. స్కూళ్లు, వ్యాపార కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు చర్యలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న మార్గదర్శకాలను (AP Unlock 5.0 Guidelines) ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులిచ్చారు.
జనసమ్మర్థం ఉన్న ప్రాంతాలు, స్కూళ్లు, కాలేజీలు, మాల్స్, షాపులు, ఆఫీసులు, వాణిజ్య సముదాయాల్లో విధిగా మాస్క్‌లు ధరించాలని, లేకుంటే లోనికి అనుమతించొద్దని ఆదేశాలిచ్చారు. ఇలాంటి చోట్ల విధిగా భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని, శానిటైజేషన్ జరగాలని సూచించారు. ఈ నిబంధనలు అమలయ్యేలా వైద్యారోగ్యశాఖ అధికారులు, కలెక్టర్లు తదితరులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాలు
ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించేలా చర్యలు తీసుకోవాలి. మాస్కే కవచం అన్న నినాదంతో సర్కారు చేపట్టిన ప్రచారం ఇంటింటికీ చేరాలి.
ఎక్కడైతే వైరస్ వ్యాప్తి చెందే ప్రాంతాలున్నాయో అక్కడ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో పాటు ప్రజలకు అవగాహన పెంచాలి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కోవిడ్ జాగ్రత్తలతో కూడిన పోస్టర్లుండాలి.
కరోనా లక్షణాలుంటే స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకునేలా జనాన్ని చైతన్యపర్చాలి.
కోవిడ్ సోకిన వారి పట్ల వివక్ష లేకుండా చూడాలి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేలా చూడాలి.
ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో గ్రామాలు, పట్టణాల్లో యోగా, మెడిటేషన్ క్లాసులు నిర్వహించాలి. రద్దీ ప్రాంతాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి.
హ్యాండ్ శానిటైజర్స్ వాడేలా విద్యార్థులను ప్రోత్సహించాలి. ప్రతి పీరియడ్‌కు ఒకసారి శానిటైజేషన్ జరగాలి. విద్యార్థుల మధ్య భౌతికదూరం ఉండేలా చర్యలు తీసుకోవాలి.
వీటిపై సినిమా హాళ్లలో టెలి ఫిల్మ్‌లు ప్రదర్శించేలా చర్యలు తీసుకోవడంతో పాటు అన్ని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో కరోనా నియంత్రణపై ప్రకటనలివ్వాలి.
షాపుల్లో ఇచ్చే బిల్లులపైనా భౌతికదూరం, శానిటైజేషన్, మాస్క్ ధారణపై సమాచారం ఉండాలి.
పండుగ వేళ మార్గదర్శకాలు
అక్టోబర్ మొదలు, వచ్చే ఏడాది జనవరి వరకు దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి వంటి పెద్ద పండుగలన్నీ వరుసగా రానున్న నేపథ్యంలో పండుగ రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో కరోనా నియంత్రణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటూ పంచాయతీరాజ్ శాఖ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీచేసింది. అవేంటంటే..
బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు మాస్క్ ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించడం, చేతులను శానిటైజ్ చేసుకోవడం వంటి వాటిపై గ్రామ సభల ద్వారా, స్థానిక ప్రసార మాధ్యమాల ద్వారా విస్త్రతంగా ప్రచారం చేయాలి.
బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించని వారికి ఆయా గ్రామ పంచాయతీలే స్థానిక పరిస్థితులకనుగుణంగా పెనాల్టీలు విధించి, వసూలు చేయాలి.
పండుగలప్పుడు ఒకే చోట 50 మందికి మించి గుమికూడకుండా చర్యలు చేపట్టాలి. వలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది స్థానిక వైద్య సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ కరోనా లక్షణాలున్న వారిని గుర్తించి పరీక్షలు చేయించాలి.
ప్రతి గ్రామంలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటు కరోనా ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేకంగా శానిటైజేషన్ చేయడం వంటివి నిత్యం చేపట్టాలి.