Amaravati, Oct 10: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను (AP Local Body Elections Row) ఎప్పుడు నిర్వహిస్తారో తెలియచేయాలని హైకోర్టు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC)ని ఆదేశించింది. ఇందులో భాగంగా ఎస్‌ఈసీకి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ న్యాయవాది తాండవ యోగేష్, మరికొందరు గతేడాది హైకోర్టులో (Andhra Pradesh High Court) ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యాలు శుక్రవారం మరోసారి సీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా ధర్మాసనం (Andhra Pradesh High Court) స్పందిస్తూ.. పలు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలే నిర్వహిస్తున్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వ న్యాయవాది సుమన్ వాదనలు వినిపిస్తూ.. కరోనా కారణంగా ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదన్నారు.
ఈ విషయం రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెప్పాల్సి ఉందంటూ.. ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాదిని ధర్మాసనం వివరణ కోరింది. అయితే ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో లేకపోవడంతో ఎన్నికల కమిషన్‌కు నోటీసులు జారీ చేసింది.తదుపరి విచారణను నవంబర్ 2కి వాయిదా వేసింది.