Amaravati, Oct 10: ఏపీ ఎంసెట్–2020 ఫలితాలు శనివారం విడుదల (AP EAMCET Result 2020) అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ (Adimulapu Suresh) విడుదల చేశారు. ఇంజినీరింగ్‌లో 84.78 శాతం, అగ్రికల్చర్, మెడిసిన్ విభాగంలో 91.77 శాతం ఉత్తీర్ణత (AP EAMCET 2020 Results) సాధించినట్లు మంత్రి వెల్లడించారు. విద్యార్థుల మొబైల్ నంబర్లకు కూడా ర్యాంకుల వివరాలు వస్తాయని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. విద్యార్థులు ఎంసెట్ ఫలితాలను sche.ap.gov.inలో చూసుకోవచ్చు.
ఆన్‌లైన్ (సీబీటీ) విధానంలో జరిగిన ఈ పరీక్షలను హైదరాబాద్‌తో పాటు ఏపీలోని మొత్తం 47 నగరాల్లో 118 కేంద్రాల్లో నిర్వహించారు. గత నెల సెప్టెంబర్ 17వ తేదీ నుంచి 25 వరకు ఉదయం, మధ్యాహ్నం మొత్తం 14 సెషన్లలో పరీక్షలు జరిగాయి. 9 సెషన్లలో జరిగిన ఇంజనీరింగ్ విభాగానికి 1,85,946 మంది దరఖాస్తు చేయగా 1,56,899 మంది (84.38 శాతం) పరీక్ష రాశారు.
ఈనెల 23వ తేదీ నుంచి 25 వరకు అగ్రి, మెడికల్ విభాగం పరీక్షలు జరగ్గా మొత్తం 87,652 మందికి గాను 75,834 (86.52%) మంది హాజరయ్యారు. ఇంజనీరింగ్ విభాగంతో 1,33,066 మంది విద్యార్థులు, అగ్రికల్చర్, మెడిసిన్ విభాగంలో 69,616 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.