AP MPTC, ZPTC Election Results 2021: ఎదురులేని వైసీపీ..కనపడని టీడీపీ, 13 జిల్లాలో అధికార పార్టీ ఏకపక్ష విజయం, ఇంకా కొనసాగుతున్న కౌంటింగ్, సాయంత్రం ఆరు గంటల వరకు వచ్చిన ఫలితాలు ఇవే
ఓట్ల లెక్కింపు (AP MPTC, ZPTC Election Results 2021)కొనసాగుతుండగా అన్ని స్థానాల్లో అధికార పార్టీ విజయ దుంధుబి మోగించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మెజార్టీ స్థానాలు సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది.
Amaravati, Sep 19: జిల్లా పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. ఓట్ల లెక్కింపు (AP MPTC, ZPTC Election Results 2021)కొనసాగుతుండగా అన్ని స్థానాల్లో అధికార పార్టీ విజయ దుంధుబి మోగించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మెజార్టీ స్థానాలు సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది.
మొత్తంగా 660 స్థానాలకు గాను 126 స్థానాలు ఏకగ్రీవం కాగా.. 515 స్థానాలకు ఎన్నికలు (AP MPTC, ZPTC Election) జరిగాయి. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు మొత్తంగా 265 స్థానాల ఓట్ల లెక్కింపు ముగియగా.. వైసీపీ అత్యధికంగా 261 స్థానాలను కైవసం చేసుకుంది. టీడీపీ 3 స్థానాలు, సీపీఎం ఒక్క స్థానంలో గెలుపొందాయి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఫలితాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.
నెల్లూరు, చిత్తూరు, కర్నూలు విజయనగరం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఉన్న 34 జెడ్పీటీసీ స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. కడప జిల్లాలో 50 జెడ్పీటీసీ స్థానాలకు 46 వైఎస్సార్ సీపీ సొంతం చేసుకుంది. ప్రకాశం జిల్లాలోని 56 జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది.
గుంటూరు జిల్లా కర్లపాలెం-1 ఎంపీటీసీ స్థానానికి వైకాపా తరఫున దొంతిబోయిన ఝాన్సీలక్ష్మి పోటీ చేశారు. ఇవాళ జరిగిన లెక్కింపులో ఆమె 134 ఓట్ల ఆధిక్యంతో తెదేపా అభ్యర్థిపై గెలుపొందారు. అయితే ఆ గెలుపును ఆస్వాదించేందుకు ఝాన్సీలక్ష్మి ప్రాణాలతో లేరు. ఏప్రిల్ 8న ఎన్నికలు జరగ్గా.. జూన్‌లో ఆమె కరోనా బారినపడి మరణించారు. కర్లపాలెం ఎంపీపీ పదవి కూడా ఆమెకే దక్కుతుందని అంతా భావించారు.
ఇక జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కంపు నేపథ్యంలో బ్యాలెట్ బాక్స్‌లో వచ్చిన ఓ మందు బాబు విన్నపం అక్కడున్న వారిని ఆశ్చర్య పరిచింది. రకరకాల మద్యం బ్రాండ్లతో విసుగెత్తి పోతున్నామని, ఇప్పుడు సరఫరా చేసిన బ్రాండ్లను మార్చాలంటూ ఒక ఓటరు తన ఓటుతో పాటు చీటీ రాసి బ్యాలెట్ బాక్సులో వేశారు.
ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.
కృష్ణా జిల్లా: 46 జెడ్పీటీసీ స్థానాల్లో 23 వైఎస్సార్‌సీపీ సొంతం.
గుంటూరు: 54 జెడ్పీటీసీ స్థానాల్లో 27 వైఎస్సార్‌సీపీ విజయం
ప్రకాశం: 56 స్థానాల్లో 44 సొంతం చేసుకున్న వైఎస్సార్‌సీపీ (మొత్తం 742 ఎంపీటీసీ స్థానాలకు గాను 374 స్థానాలు ఏకగ్రీవం)
నెల్లూరు: జిల్లాలో ఉన్న 46 స్థానాలను వైఎస్సార్‌సీపీ సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. (మొత్తం ఎంపీటీసీ స్థానాలు-562, ఏకగ్రీవం-188)
విశాఖపట్టణం: 39 స్థానాల్లో 30 వైఎస్సార్‌సీపీ గెలుపు
విజయనగరం: 34 జెడ్పీటీసీ స్థానాల్లో 25 వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది.
శ్రీకాకుళం: 38 జెడ్పీటీసీ స్థానాల్లో 20 వైఎస్సార్‌సీపీ కైవసం
అనంతపురం: 63 స్థానాల్లో 35 సొంతం చేసుకున్న వైఎస్సార్‌సీపీ
చిత్తూరు: 65 జెడ్పీటీసీ స్థానాల్లో 43 వైఎస్సార్‌సీపీ విజయం
వైఎస్సార్ కడప: 50 స్థానాల్లో 44 గెలిచిన వైఎస్సార్‌సీపీ
కర్నూలు: జెడ్పీటీసీ ఎన్నికల్లో ఉన్న 53లో 51 స్థానాలను వైఎస్సార్‌సీపీ సొంతం చేసుకుంది.
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇంకా ఓట్ల లెక్కింపు సాగుతోంది.