Jagan Govt vs TDP. Chalo Atmakur Protest. Representational Image with Party logos.

Amaravati, Sep 19: ఆంధ్రప్రదేశ్‌ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు (AP MPTC, ZPTC Election Results 2021) కొనసాగుతోంది. పరిషత్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ (YSRCP) హవా కొనసాగుతోంది. పలు నియోజకవర్గాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఆధీక్యంలో ఉంది. చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో చంద్రబాబుకు (Chandra babu) షాక్‌ తగిలింది. నారావారిపల్లి ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. టీడీపీ ఎంపీటీసీ (TDP MPTC) అభ్యర్థి గంగాధరం పరాజయం పొందారు. 1,347 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రాజయ్య గెలుపొందారు. టీడీపీకి అభ్యర్థికి కేవలం 307 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.

చిత్తూరు జిల్లా కుప్పం మండలం టీ సడుమూరు ఎంపీటీసీ స్థానాన్ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అశ్విని(23).. 1073 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక చిత్తూరు జిల్లాలో 65 జడ్పీటీసీలకుగానూ ఇప్పటికి 29 స్థానాలను .. 841కి ఎంపీటీసీ స్థానాలకుగానూ.. 416 స్థానాలను కైవసం చేసుకుని వైఎస్సార్‌సీపీ ఆధిక్యంలో దూసుకుపోతోంది.

విశాఖపట్నం జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫ్యాను గాలి వీస్తోంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 39 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆదివారం వెలువడుతున్న ఫలితాల్లో ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో వైఎప్సార్‌సీపీ ఒక స్థానం గెలుచుకోగా ప్రతిపక్షాలు ఒక్కటీ దక్కలేదు. ఇక 651 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఏకంగా 83 స్థానాలు గెలుచుకోగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ 2, బీజేపీ 1, ఇతరులు ఒక స్థానంలో గెలిచారు.

పోస్టల్‌ బ్యాలెట్‌లో వైసీపీ ఆధిక్యం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌

కృష్ణా జిల్లాలో ఫ్యాను హవా కొనసాగుతోంది. 46 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా వైఎస్సార్‌సీపీ రెండు స్థానాల్లో విజయం సాధించింది. ప్రతిపక్ష పార్టీలు ఇంకా బోణీ కొట్టలేదు. 723 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎ‍న్నికల్లో ఇప్పటి వరకు అందిన ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ 211 స్థానాల్లో గెలుపు సాధించి అగ్రభాగాన నిలవగా టీడీపీ 10 స్థానాలు దక్కించుకుంది.

విజయనగరం జిల్లాలో 34 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం 3 చోట్ల వైఎస్సార్‌సీపీ గెలుపు సాధించింది. 549 ఎంపీటీసీ స్థానాలకు జరుగుతున్న లెక్కింపులో ఇప్పటికే 80 స్థానాలు వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. ఇతరులు రెండు చోట్ల విజయం సాధించగా టీడీపీ, బీజేపీలు బోణి కొట్టలేదు.

తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1086 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ 75 స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పటి వరకు అందిన ఫలితాల్లో కేవలం టీడీపీ ఒకే స్థానాన్ని దక్కించుకుంది. టీడీపీ కంటే మెరుగ్గా బీజేపీ 2 స్థానాల్లో, ఇతరులు ఒక స్థానంలో గెలిచారు. 61 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా ఇంకా ఫలితాలు వెల్లడికాలేదు.

అనంతపురంలో స్థానిక సంస్థల ఎ‍న్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 804 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌ సీపీ 214 చోట్ల విజయం సాధించగా టీడీపీ కేవలం 03 స్థానాల్లోనే గెలిచింది. బీజేపీ ఖాతా తెరవలేదు. 63 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా వైఎస్సార్‌ సీపీ 35, బీజేపీ, ఇతరులు ఇంకా ఖాతా తెరవలేదు .

కడప జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు తిరుగులేని విజయం సాధిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 50 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా కడపటి వార్తలు అందే సరికి 38 స్థానాలు వైసీపీ ఖాతాలో చేరాయి.858 ఎంపీటీసీ స్థానాలకు పోటీ నిర్వహించగా 431 చోట్ల వైఎస్సార్‌సీపీ విజయం సాధించగా టీడీపీ 9, బీజేపీ 2 ఇతరులు 2 చోట్ల గెలుపు సాధించారు.

గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఈ నియోజకవర్గంలో మొత్తం అయిదు జెడ్పీటీసీ స్థానాలను, 71 ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. మాచర్ల మండలంలో మొత్తం 14 ఎంపీటీసీలకు గాను 14 స్థానాలను కైవసం చేసుకుని తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. దుర్గి మండలంలో మొత్తం 14 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ గెలుపొందగా, వెల్దుర్తి మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది.

ప్రకాశం జిల్లాలో మొత్తం 55 జడ్పీటీసీ స్థానాలు ఉండగా 21 చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపు సాధించారు. 742 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా వైఎస్సార్‌సీపీ 378 స్థానాలు గెలుచుకోగా టీడీపీ కేవలం 27 స్థానాలకే పరిమితమైంది. ఇతరులు 5 చోట్ల గెలుపొందగా బీజేపీ ఇంకా ఖాతా తెరవలేదు.

నెల్లూరు జిల్లాలో 46 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా ఇప్పటి వరకు అందిన ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ 13 స్థానాలు కైవసం చేసుకుంది. 554 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపులో ఇప్పటి వరకు వైఎస​ఆర్‌సీపీ ఖాతాలో 226 ఎంపీటీసీ స్థానాలు చేరగా టీడీపీ కేవలం 5 స్థానాలే దక్కించుకోగలిగింది. బీజేపీ 2, ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో 48 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా ఇప్పటి వరకు అందిన ఫలితాలు వైఎస్సార్‌సీపీ 2 స్థానాల్లో గెలుపు సాధించగా మిగిలిన పార్టీలు ఖాతా తెరవలేదు. 863 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా వైఎస్సార్‌సీపీ 63 స్థానాలు, టీడీపీ 3 స్థానాలు, బీజేపీ 1, ఇతరులు 4 స్థానాల్లో గెలుపు సాధించారు.

కర్నూలు జిల్లా వ్యాప్తంగా 53 జడ్పీటీసీలకు ఎన్నికలు జరగగా 21 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. 796 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఇప్పటికే వైఎస్సార్‌సీపీ ఖాతాలో 608 స్థానాలు చేరాయి. ఇక ప్రతిపక్ష టీడీపీ 81 చోట్ల విజయం సాధింగా బీజేపీ కేవలం 4 స్థానాలకే పరిమితమైంది. ఇతరులు 10 చోట్ల విజయం సాధించారు.