Polavaram Project Cost Row: పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.20,744 కోట్లు ఖర్చు, వార్షిక నివేదికలో పేర్కొన్న కేంద్ర జలశక్తి శాఖ,ఇప్పటిదాకా రూ.13,226.04 కోట్లు విడుదల చేసిన కేంద్రం
డిసెంబర్ 15, 2022 వరకూ పోలవరం ప్రాజెక్టుకు రూ.20,744 కోట్లు ఖర్చయిందని వార్షిక నివేదికలో జలశక్తి శాఖ (Ministry of Jal Shakti ) పేర్కొంది
Amaravati, Jan 4: ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై ఇప్పటివరకు అయిన ఖర్చు (Polavaram Project Cost Row) వివరాలను కేంద్ర జలశక్తి వెల్లడించింది. డిసెంబర్ 15, 2022 వరకూ పోలవరం ప్రాజెక్టుకు రూ.20,744 కోట్లు ఖర్చయిందని వార్షిక నివేదికలో జలశక్తి శాఖ (Ministry of Jal Shakti ) పేర్కొంది. ప్రాజెక్టు పనుల నిమిత్తం ఇప్పటి వరకూ రూ.13,226.04 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొంది.
2017–18 ధరల ప్రకారం ప్రాజెక్టుకు ఆమోదించిన అంచనా వ్యయం రూ.47,725.74 కోట్లు అని స్పష్టం చేసింది. కేంద్రం తరఫున ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు నీటి పారుదల విభాగాన్ని అమలు చేస్తోందని పేర్కొంది. 2,454 మీటర్ల ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్, 1,128.4 మీటర్ల పొడవైన స్పిల్ వేతో తూర్పు, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో 2.91 లక్షల హెక్టార్లకు సాగు నీరు అందించడంతోపాటు పలు ఇతర ప్రయోజనాల కోసం ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపింది. 2022లో వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్ విభాగంలో భారతదేశం గెలుచుకున్న నాలుగు అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజీ ఒకటని తెలిపింది.