Merugu Nagarjuna Slams Anitha: మా కార్యకర్తలను భయపెట్టాలని చూస్తే తీవ్ర పరిణామాలు తప్పవు, టీడీపీకి వైసీపీ మాజీ మంత్రి మేరుగు నాగార్జున వార్నింగ్
వైసీపీ నాయకులను భయపెట్టాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
Vjy, Sep 10: ఏపీలోని పల్నాడు జిల్లాల్లో అధికార కూటమి ప్రభుత్వం ఇష్టానురీతిన వ్యవహరిస్తున్నారని వైసీపీ నేత , మాజీ మంత్రి మేరుగు నాగార్జున(Merugu Nagarjuna) ఆరోపించారు. వైసీపీ నాయకులను భయపెట్టాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. మంగళవారం పల్నాడు జిల్లాలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు (Nambur Shanker Rao) పై టీడీపీ నాయకులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
అధికారం శాశ్వతం కాదు.. టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. ఇదే సమయంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు చేసి విధ్వంసాలు చేసి భయపెట్టాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కామెంట్స్ చేశారు.
జగన్‌మోహన్‌రెడ్డిపై దేశ ద్రోహం కేసు పెట్టాలి, హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు
మీడియాతో మాట్లాడుతూ..‘నంబూరు శంకర్రావుపై దాడి చేయడం హేయమైన చర్య. పల్నాడులో జరుగుతున్న దాడులపై హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలి. హోం మంత్రి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. పల్నాడులో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలపై జరుగుతున్న దాడులపైన మాత్రం ఆమె మాట్లాడటం లేదు.అధికారం శాశ్వతం కాదు అది గుర్తుపెట్టుకోండి. మా పార్టీ కార్యకర్తలు, నాయకులపైన దాడులు, విధ్వంసాలు చేసి భయపెడదాం అనుకుంటే కుదరదు. పోలీసుల సమక్షంలోనే దాడి జరగటం చాలా దారుణం.
మా కార్యకర్తలను కొడుతున్నారని శంకర్రావు ఎస్పీకి ఫోన్ చేశారు. పల్నాడు జిల్లా ఎస్పీ మీ కార్యకర్తలు ఎందుకు అంత మంది వచ్చారని అడుగుతున్నారు. తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు వందల మంది కర్రలు, రాళ్లు తీసుకుని రోడ్లపైకి వస్తే వాళ్లని ఎందుకు ప్రశ్నించడం లేదు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపైన దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి’ అని డిమాండ్ చేశారు.