Visakha, Sep 10: విజయవాడలో భారీ వరదల ముంపునకు కూటమి ప్రభుత్వమే కారణమంటూ వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. జగన్ రెండుసార్లు బయటకొచ్చి తమ ప్రభుత్వంపై బురద జల్లి వెళ్లారని విమర్శించారు. ప్రకాశం బ్యారేజీకి పూర్తిస్థాయిలో వరద చుట్టు ముడుతుంటే, దానిని కూడా డిస్ట్రబ్ చేయడానికి, విధ్వంసం చేయడానికి జగన్, వైసీపీ నేతలు ప్రయత్నించారని మండిపడ్డారు.సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు 11 సీట్లు ఇచ్చినప్పటికీ జగన్‌కు ఇంకా బుద్ధి రావడం లేదని వంగలపూడి అనిత విమర్శించారు. జగన్‌మోహన్‌రెడ్డిపై దేశ ద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. సమాజంలో తిరిగే అర్హత ఆయనకు లేదని విమర్శించారు.
లక్షలాది మంది జలసమాధి అయ్యేలా జగన్ పన్నిన కుట్ర బట్టబయలు, ఎక్స్ వేదికగా నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు
విశాఖపట్నంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడారు. ఏపీలో విధ్వంసం సృష్టించడానికి బోట్లను, వదిలిపెట్టారని ఇరిగేషన్ అధికారులే చెబుతున్నారని తెలిపారు. పిల్లర్లను ఢీకొట్టి ప్రమాదం జరిగితే, కొన్ని వేల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.ఉద్దండరాయపురంలోఉన్న బోట్లు ప్రకాశం బ్యారేజికి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. బోట్లు పోయాయని ఈరోజు వరకు ఎవరూ ఎందుకు ఫిర్యాదు చేయలేదని నిలదీశారు.