Andhra Pradesh: అందరి ముందు ఫ్యాంట్ విప్పి తనిఖీ, అవమానభారం తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్య, చీరాల ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో విషాద ఘటన, కళాశాల ఎదుట ఆందోళన చేపట్టిన విద్యార్థులు
పరీక్షకు స్లిప్పులు తెచ్చాడని పాలిటెక్నిక్ విద్యార్థిని అందరి ముందు తనిఖీల పేరుతో ఫ్యాంట్ విప్పి అవమానించడంతో తీవ్ర మనస్తాపం చెంది ఓ విద్యార్థి రైలు కిందపడి బలవన్మరణానికి (Polytechnic student commits suicide) పాల్పడ్డాడు.
Amravati, April 21: చీరాల్లోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో విషాద ఘటన చోటు చేసుకుంది. పరీక్షకు స్లిప్పులు తెచ్చాడని పాలిటెక్నిక్ విద్యార్థిని అందరి ముందు తనిఖీల పేరుతో ఫ్యాంట్ విప్పి అవమానించడంతో తీవ్ర మనస్తాపం చెంది ఓ విద్యార్థి రైలు కిందపడి బలవన్మరణానికి (Polytechnic student commits suicide) పాల్పడ్డాడు.
చీరాల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేటపాలెం మండలం లక్ష్మీపురానికి చెందిన కమల నాగరాజు, ఇందిర దంపతుల రెండో కుమారుడు ఎలీషా (19) బైపాస్ రోడ్డులోని యలమంచిలి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న పాలిటెక్నిక్ కళాశాలలో ఈఈఈ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
సోమవారం నుంచి కళాశాలలో పరీక్షలు జరుగుతుండగా... స్లిప్పులు తెచ్చి పరీక్ష రాస్తున్నాడని స్క్వాడ్ అధికారులు పరీక్ష కేంద్రం వద్దే ఆ విద్యార్థి ప్యాంట్ విప్పించి తనిఖీ (squad officers unzip pants for slips at exam center) చేశారు. అంతేగాక పరీక్ష రాయకుండా డీబార్ చేస్తున్నట్లు ప్రకటించడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఎలీషా సాయంత్రం బేరుపేట సమీపంలో రైలు కింద బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.
విద్యార్థి మృతితో విద్యార్థులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. విద్యార్థి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న టూటౌన్ సీఐ పాపారావు, ఎస్‌ఐలు ఆందోళన చేస్తున్న విద్యార్థులతో పాటు కళాశాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. సాయంత్రానికి ఎలీషా మృతదేహంతో కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని కోరుతూ కళాశాల ఎదుట బైఠాయించారు.
అన్యాయంగా తమ బిడ్డను పొట్టన పెట్టుకున్నారని, తమకు న్యాయం చేయాలని, తమ బిడ్డ చావుకు కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న చీరాల డీఎస్పీ పి.శ్రీకాంత్ తన సిబ్బందితో కళాశాల వద్దకు చేరుకుని సంఘటన జరగిన తీరు తెలుసుకున్నారు. కళాశాల యాజమాన్యం, అధ్యాపకుల తీరుతో ఎలీషా ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎట్టకేలకు మధ్యవర్తుల హామీతో మృతుడి బంధువులు, విద్యార్థులు ఆందోళన విరమించారు.