Andhra Pradesh Rains: ఈ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరుతాం, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు
ఒక్క రాత్రి ధైర్యంగా ఉండాలని ముంపు ప్రాంతాల ప్రజలకు హామీ ఇచ్చానని సీఎం చంద్రబాబు తెలిపారు
Vjy, Sep 2: వరద పరిస్థితిపై సోమవారం ఉదయం విజయవాడ కలెక్టరేట్‌లో అధికారులతో సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.జలను కాపాడే విషయంలో ప్రయత్నాలు ఎక్కడా ఆగకూడదని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఒక్క రాత్రి ధైర్యంగా ఉండాలని ముంపు ప్రాంతాల ప్రజలకు హామీ ఇచ్చానని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆ హామీ నిలబెట్టుకునే దిశగా యంత్రాంగం పనిచేయాలన్నారు.
ఎంతమందిని రక్షించగలిగామన్నదే మన లక్ష్యం కావాలన్నారు. బోట్లు కూడా కొట్టుకుపోయే సవాళ్లు మన ముందున్నాయన్నారు. బోట్లలో వచ్చిన వారిని తరలించేందుకు బస్సులు సిద్ధంగా ఉంచాలన్నారు.. అవసరమైతే వృద్ధులు, రోగులు ఇబ్బంది పడకుండా హోటళ్లలోనే ఉంచాలని ఆదేశించారు. బాధితుల కోసం కల్యాణ మండపాలు, ఇతర కేంద్రాలు సిద్ధం చేయాలన్నారు. మొత్తం 47 కేంద్రాలు గుర్తించామని సీఎంకు అధికారులు వివరించారు. వరద ప్రవాహంలో కొట్టుకొచ్చిన కారుపై మహిళ మృతదేహం.. వెళ్లేందుకు ఎవరూ ధైర్యం చేయకపోవడంతో కొన్ని గంటలపాటు అలాగే.. విజయవాడలో హృదయవిదారక ఘటన.. గుండెల్ని మెలిపెట్టే వీడియో మీరూ చూడండి!!
నగరంలోని వరద ప్రభావిత (vijayawada rain flood) ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు (Chandrababu) క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఉదయం అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం.. ఆ తర్వాత సింగ్‌నగర్ ప్రాంతానికి వెళ్లారు. బోటులో వెళ్లి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. అనంతరం కలెక్టరేట్‌కు వచ్చి మరోమారు సమీక్ష నిర్వహించి చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత మరోసారి కృష్ణలంక, జక్కంపూడి తదితర ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. బాధితులతో మాట్లాడి ప్రభుత్వం తరఫున చేపట్టిన పునరావాస కార్యక్రమాలు, ఆహార పంపిణీపై ఆరా తీశారు.
విజయవాడ సింగ్‌నగర్ ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. జోరు వర్షంలో బోటు ఎక్కి సింగ్ నగర్ లోపలికి వెళ్లారు. దాదాపు వంతెనకు ఆనుకుని ప్రవహిస్తున్న వరద నీటిని సీఎం పరిశీలించారు. బాధితులకు ఉదయమే ఆహారం అందిందా? లేదా? అని చంద్రబాబు ఆరా తీశారు. ఆహారం, రక్షిత మంచి నీరు అందాయని బాధితులు ఆయనకు తెలిపారు.
హెలికాప్టర్ల ద్వారా వరద బాధితులకు ఆహారం, నీళ్లు, పాలు అందజేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో వరద పరిస్థితులపై మరోసారి ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. మూడుపూటలా బాధితులకు ఆహారం అందించాలన్నారు. చిన్నారులు, గర్భిణులను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. బోట్లు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో మ్యాపింగ్ చేయాలన్నారు. ఒకే ప్రాంతంలో కాకుండా మారుమూల ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. మధ్యాహ్నం కొంత మేరకు వరద ప్రవాహం తగ్గుతుందని అంచనా వేశారు. లంక గ్రామాల్లో సమస్యలపై అధికారులను అప్రమత్తం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అందరికీ సాయం అందుతుందని చంద్రబాబు తెలిపారు.
ఈ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని రేపు కేంద్రాన్ని కోరతామని వెల్లడించారు. తద్వారా రాష్ట్రాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. 1998 తర్వాత మళ్లీ ఆ స్థాయిలో భారీ వర్షాలు కురిశాయని తెలిపారు. వరద నీరు ఇంకా పెరిగే అవకాశం ఉందని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన నష్ట నివారణ చర్యలు చేపట్టామని చంద్రబాబు వెల్లడించారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి భారీగా నీరు వస్తోందని వివరించారు. మున్నేరు, బుడమేరు నుంచి కూడా భారీగా నీరు వస్తోందని చెప్పారు. బుడమేరు నుంచి కొల్లేరుకు వెళ్లాల్సిన నీళ్లు విజయవాడకు వచ్చాయని వెల్లడించారు. బుడమేరు నిర్వహణను వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాటు పట్టించుకోకపోవడమే దీనికి కారణం అని చంద్రబాబు మండిపడ్డారు.
వరద బాధితులు సుమారు 2.76 లక్షల మంది ఉన్నారని స్పష్టం చేశారు. ఇవాళ సింగ్ నగర్ లో వరద బాధితుల కష్టాలను స్వయంగా చూశానని తెలిపారు. వరద బాధితులకు ఆహారం, తాగునీరు, పాలు అందించాలని ఆదేశించానని పేర్కొన్నారు. రాష్ట్రానికి రేపు 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 40 పవర్ బోట్లు, 6 హెలికాప్టర్లు వస్తున్నాయని వెల్లడించారు. సహాయ చర్యల కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం మోహరించామని అన్నారు. సహాయ చర్యలను రాత్రిపూట కూడా పర్యవేక్షిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. కాగా, సమాచారం కోసం కమాండ్ కంట్రోల్ నెంబర్లు 112, 107 అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు.