Coronavirus in AP: ఏపీలో అత్యంత తక్కువగా కరోనా కేసులు నమోదు, తాజాగా 4,549 మందికి కోవిడ్, 10,114 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్, ప్రస్తుతం రాష్ట్రంలో 80,013 యాక్టివ్ కేసులు
తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 18,14,393 మంది వైరస్ బారినపడినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
Amaravati, June 14: ఏపీలో గడిచిన 24 గంటల్లో 87,756 నమూనాలను పరీక్షించగా..4,549 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 18,14,393 మంది వైరస్ బారినపడినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 59 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 11,999కి చేరింది.
తాజాగా 10,114 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 17,22,381 మంది బాధితులు కొలుకున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 80,013 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,05,38,738 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. గడిచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది, ప్రకాశంలో 8 మంది, పశ్చిమగోదావరిలో ఆరుగురు, కృష్ణ జిల్లాలో ఐదుగురు, అనంతపురం, తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు, గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం,విజయనగరం జిల్లాల్లో ముగ్గురు, కడప, నెల్లూరులో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
Here's ANI Update
తాజాగా ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ఏపీ ప్రభుత్వం భరోసానిచ్చింది. జూనియర్ డాక్టర్ల ఎక్స్‌గ్రేషియా డిమాండ్‌ను నెరవేర్చింది. కోవిడ్‌తో మరణించే వైద్యులు, సిబ్బందికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఏకే సింఘాల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
కోవిడ్ విధి నిర్వహణలో మృతి చెందిన వైద్యుని కుటుంబానికి రూ.25 లక్షలు.. స్టాఫ్ నర్సుకి రూ.20 లక్షలు, ఎఫ్‌ఎస్‌ఓ లేదా ఎమ్‌ఎస్‌ఓలకు రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా.. ఇతర వైద్య సిబ్బంది మృతి చెందితే రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం చెల్లించే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ పథకానికి అదనంగా ఈ ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు ఉత్తర్వులలో వెల్లడించింది. తక్షణమే ఎక్స్‌గ్రేషియా అందేలా కలెక్టర్లకు అధికారం ఇచ్చింది.
జిల్లా కలెక్టర్లు సంబంధిత డాక్యుమెంట్లు పరిశీలించి ఎక్స్‌గ్రేషియా ఇచ్చేలా ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ వలన మరణించారని ధ్రువీకరణ పొందిన వారందరికీ ఎక్స్‌గ్రేషియా వర్తించనుంది. ఇతర భీమా పరిహారాలు పొందినా సరే అన్నింటికీ అదనంగా ఇవ్వాలని నిర్ణయించింది.