DGP Gautam Sawang: పోలీసులు కులం, మతం ఆధారంగా పనిచేయరు, డ్యూటీలో 109 మంది పోలీసులు మరణించారు, ఆలయాల దాడులపై వాస్తవాలను వక్రీకరిస్తున్నారు, మీడియాతో ఏపీ డీజీపీ గౌతం సవాంగ్
Amaravati, Jan 13: ఏపీలో ఆలయాల దాడులపై డీజీపీ గౌతం సవాంగ్ (DGP Gautam Sawang) మీడియాతో మాట్లాడారు. ఆలయాలపై దాడులంటూ దుష్ప్రచారం జరుగుతోందని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని కావాలనే వాస్తవాలను వక్రీకరిస్తున్నారని ఆయన అన్నారు. గతేడాదిలో పోలీస్ శాఖకు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. కోవిడ్ సమయంలో పోలీసులు చాలా కష్టపడ్డారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పోలీసులు చొరవ తీసుకున్నారు. కరోనాతో 109 మంది పోలీసులు (Police Deaths) మరణించారు. పోలీసులు లాక్‌డౌన్, కరోనాను ఛాలెంజ్‌గా తీసుకుని పనిచేశారు. టెక్నాలజీ విభాగంలో ఏపీ పోలీస్ శాఖకు 100కుపైగా అవార్డులు వచ్చాయి. గతంతో పోలిస్తే నేరస్థుల అరెస్ట్, శిక్ష విషయంలో పోలీసులు (AP Police) సమర్థవంతంగా పనిచేస్తున్నారు.
నాయకులు రాజకీయ కారణాలతో పోలీసులపై ఆరోపణలు చేయడం సరికాదు. ఈ మధ్య కాలంలో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఆలయాలకు సంబంధించి మొత్తం 44 కేసులు నమోదయ్యాయి. ఆలయాలపై దాడులు (Andhra Pradesh temple attacks) జరిగితే పోలీసులు ఏం చేస్తున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారు. పోలీసులకు సంబంధించిన కులం, మతంపై ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులపై గతంలో ఎప్పుడూ ఇలాంటి ఆరోపణలు ఎవరూ చేయలేదు. పోలీసులు కులం, మతం ఆధారంగా పనిచేయరని డీజీపీ అన్నారు.
దేశ సమగ్రతను కాపాడటంలో పోలీసులు అంకితభావంతో పనిచేస్తున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన అంతర్వేది ఘటన దురదృష్టకరం. అంతర్వేది ఘటన తర్వాత రాష్ట్రంలో కొన్ని అవాంఛనీయ ఘటనలు జరిగాయి. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలోని 58, 871 హిందూ ఆలయాలను జియో ట్యాగింగ్ చేశాం. ఆలయాల భద్రతపై సమీక్షించాం. 13వేల ఆలయాల్లో 43వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. గడిచిన రెండు నెలల్లోనే 30వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించాం. హిందూ దేవాలయాల విషయంలో దేశంలో ఎక్కడాలేని విధంగా భద్రతా చర్యలు చేపట్టామని డీజీపీ అన్నారు.
మూడు నెలల కిందటే రామతీర్థం ఆలయంలో (Ramatheertham incident) భద్రత పెంచాలని సూచించాం. ప్రధాన ఆలయంలో అదనంగా 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాం. కొండపైన ఉన్న ఆలయంలో విద్యుత్ సరఫరా లేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు. మరో రెండు రోజుల్లో కొండపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారనగా ఈ ఘటన జరిగింది. సెప్టెంబర్ 5 నుంచి 180 కేసులు నమోదు, 347 మందిని అరెస్ట్ చేశాం. ఏడు అంతరాష్ట్ర గ్యాంగ్‌లను కూడా అరెస్ట్ చేశాం. రాష్ట్ర, జిల్లా స్థాయిలో మతసామరస్య కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. పోలీస్‌స్టేషన్ల పరిధిలో కూడా కమిటీలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు.