Rain Alert for AP: ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్, వచ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం
దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, యానాంలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
Vjy, Dec 18: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరో రెండు రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అదికారులు తెలిపారు. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చేసిన హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమయింది.
అల్పపీడనం మరింత బలపడి తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశముందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, యానాంలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు వానలు కురుస్తాయని పేర్కొంది. ఉత్తరాంధ్రలో కూడా వర్షాలు పడతాయని తెలిపింది.
నేడు విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, నెల్లూరు, తిరుపతి జిల్లాలో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, కడప, అన్నమయ్య, చిత్తూరు, జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో నాలుగుజిల్లాల ప్రజలు నేడు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
బుధవారాలు, గురువారాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అతి భారీ వర్షాల కారణంగా ప్రజలు నదులు, కాల్వలు దాటే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. తీర ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు శనివారం వరకూ వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది.
ప్రస్తుతం ఈశాన్య రుతుపవనాలు బలంగా ఉండడంతో కోస్తా జిల్లాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. అందువల్ల వరి, పత్తి, పొగాకు రైతులు అప్రమత్తంగా ఉండాలని, కోతలు వాయిదా వేసుకోవాలని, పొలాల్లో ఉంచిన కుప్పలను సంరక్షించుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అల్పపీడనం నేపథ్యంలో ఈనెల 25వ తేదీ వరకూ దక్షిణ కోస్తా జిల్లాల్లోని మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.
మరోవైపు ఉత్తరకోస్తా, తెలంగాణకు ఆనుకుని ఉన్న కోస్తా జిల్లాల్లో చలితీవ్రత కొనసాగింది. బుధవారం చలి తీవ్రత స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.ఇక మన్యంలో చలి తీవ్రత కొనసాగుతోంది. మంగళవారం అరకులోయలో 5.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే జి.మాడుగులలో 6.5, జీకే వీధిలో 7.2, హుకుంపేట, చింతపల్లిల్లో 7.4, ముంచంగిపుట్టులో 9.7, పెదబయలులో 10.3, అనంతగిరిలో 10.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం ఉండడంతో ఏజెన్సీలో పొగమంచు కురవలేదు. అయినా, చలి తీవ్రత తగ్గలేదు.