Andhra Pradesh: కర్నూలులో హైడల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌, ప్రపంచంలోనే తొలి ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు, శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం జగన్

అనంతరం సీఎం జగన్‌ మాట్లాడుతూ.. కర్నూలులో హైడల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ (integrated renewable energy storage project ) ఏర్పాటు చేయడం సంతోషం.

YS Jagan Mohan Reddy lays foundation stone for integrated renewable energy storage project in Kurnool

Amaravati, May 17: ప్రపంచంలోనే తొలి ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) మంగళశారం శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం జగన్‌ మాట్లాడుతూ.. కర్నూలులో హైడల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ (integrated renewable energy storage project ) ఏర్పాటు చేయడం సంతోషం. ప్రపంచంలోనే తొలి హైడల్‌ పవర్‌ ప్లాంట్‌కు కర్నూలు వేదికవడం గర్వకారణమని సీఎం జగన్‌ అన్నారు'ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు కోసం గ్రీన్‌కో ఎనర్జీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.15 వేల కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది.

ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని నిరుద్యోగులకు భారీగా ఉపాధి, ఉద్యోగావకాశాలు రానున్నాయి. హైడల్‌ పవర్‌ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో 15 వేల ఉద్యోగాలొస్తాయి. ఐదేళ్ల పాటు నిర్మాణ పనులు కొనసాగుతాయి. తరువాత ప్రత్యక్షంగా 3 వేల మందికి.. పరోక్షంగా మరో 5 వేల మంది ఉపాధి పొందుతారు' అని సీఎం జగన్‌ అన్నారు. మొత్తం 5,410 మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి నేషనల్‌ గ్రిడ్‌కు అనుసంధానించి ఓరక్వల్లు పీజీసీఐఎల్‌/సీటీయూ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ద్వారా దేశంలోని డిస్కామ్‌లు, పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే, నేపథ్యాలు ఇవే, బీసీ నేత ఆర్. కృష్ణయ్య ఏపీ నుంచి రాజ్యసభకు ఎంపిక, విజయసాయి రెడ్డికి మరో అవకాశం..

ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని రాబోయే 5 ఏళ్లలో పూర్తి చేసి విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభిస్తారు. రూ.15 వేల కోట్ల పెట్టుబడితో స్థాపించే ఈ పవర్‌ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసుకుంటే 23 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల లభిస్తాయి. అంతేకాక స్థానికంగా ఉన్న పరిశ్రమలు, హోటళ్లలో విద్యుత్‌ కోతలకు చెక్‌ పెట్టవచ్చు. గ్రీన్‌కో ఎనర్జీస్‌ లిమిటెడ్‌ ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యధికంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 4,766.28 ఎకరాల భూమిని కేటాయించింది. ఇప్పటికే 2,800 ఎకరాలను కంపెనీకి అప్పగించింది. ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులో భాగంగా సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి 3000 మెగావాట్లు, విండ్‌ 550 మెగావాట్లు, హైడల్‌ పవర్‌ 1860 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఓర్వకల్లు మండలం గుమ్మితం తాండాలో పవర్‌ ప్రాజెక్ట్‌ త్రీడీ మోడల్‌ నమూనాను ప్రారంభించారు. ఒకే యూనిట్‌ నుంచి సోలార్, విండ్, హైడల్‌ పవర్లను ఉత్పత్తి చేయడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా 5,230 మెగావాట్ల ఉత్పత్తి చేస్తారు. ప్రైవేటుతో పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలోనూ 33,240 మెగావాట్ల భారీ సామర్థ్యంతో పంప్డ్‌ స్టోరేజ్‌ హైడ్రో పవర్‌ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. వివిధ జిల్లాల్లో అందుబాటులో ఉండే నీటి వనరులను ఉపయోగించుకుని పంప్డ్‌ హైడ్రో స్టోరేజీ, సౌర, పవన విద్యుత్‌ల కలయికగా ఈ అధునాతన ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తోంది.

రాష్ట్రంలో మొత్తం 29 చోట్ల వీటిని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా.. మొదటి దశలో గండికోట, చిత్రావతి, సోమశిల, ఓక్, కురుకుట్టి, కర్రివలస, యర్రవరంలో శ్రీకారం చుడుతోంది. మొత్తం ఏడుచోట్ల 6,600 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించే ఈ ప్రాజెక్టుల డీటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీపీఆర్‌) తయారవుతోంది. ఇక పిన్నాపురంలో స్థాపిస్తున్న ఈ ప్రాజెక్టు కారణంగా, వాతావరణంలో ఏటా కార్బన్‌ డయా క్సైడ్‌ 15 మిలియన్‌ టన్నులు తగ్గుతుందని కంపెనీ అంచనా. 50 లక్షల పెట్రోల్, డీజిల్‌ కార్ల బదులుగా ఎలక్ట్రిక్‌ కార్లను ఉపయోగిస్తే, లేదా 25 లక్షల హెక్టార్ల భూమిలో అడవిని పెంచితే వాతావరణంలో ఎంత కార్బన్‌ డయాౖక్సైడ్‌ తగ్గుతుందో ఈ ప్రాజెక్టు ద్వారా అంత తగ్గుతుందని కంపెనీ చెబుతోంది.