AP Assembly Session 2021: అసెంబ్లీలోకి ఎమ్మెల్యేలు మొబైల్స్ తీసుకురావడంపై నిషేధం, శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్ ప్రమాణ స్వీకారం, ఏపీ అసెంబ్లీ 7వ రోజు సమావేశాల హైలెట్స్ ఇవే..
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఏడవ రోజులో (AP Assembly Session 2021) భాగంగా విద్యారంగంపై స్వల్ప కాలిక చర్చ జరిగింది. 2019-20 కాగ్ రిపోర్ట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సభలో ప్రవేశపెట్టారు. 2021-22 వ్యయంపై అదనపు అంచనాలను ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టారు.
Amaravati, Nov 26: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఏడవ రోజులో (AP Assembly Session 2021) భాగంగా విద్యారంగంపై స్వల్ప కాలిక చర్చ జరిగింది. 2019-20 కాగ్ రిపోర్ట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సభలో ప్రవేశపెట్టారు. 2021-22 వ్యయంపై అదనపు అంచనాలను ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టారు. ఈ సమావేశాల్లో ఏపీ అసెంబ్లీలోకి మొబైల్ ఫోన్లను (Mobile Phones) తీసుకురావడంపై నిషేధం విధించారు. సభలోకి సభ్యులు సెల్‌ఫోన్లు తీసుకురావొద్దని స్పీకర్ ప్రకటించారు. ఏపీ శాసనమండలి నిరవధిక వాయిదా పడింది.
ఇక ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా గురువారం డిప్యూటీ చైర్మన్ పదవికి నామినేషన్ వేసిన ఆమెకు పోటీగా ఎవరూ లేకపోవడంతో శుక్రవారం ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. దీంతో శుక్రవారమే ఆమెచేత ప్రమాణస్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆమెను స్వయంగా కూర్చీ వద్దకు తీసుకెళ్లారు.
అనంతరం జకియా ఖాన్ మాట్లాడుతూ.. ఓ మైనార్టీ మహిళను డిప్యూటీ చైర్మన్‌ను చేసిన సీఎం జగన్‌కు (CM YS Jagan Mohan Reddy) ధన్యవాదాలు తెలిపారు. మహిళాభ్యున్నతికి జగన్ పాటుపడుతున్నారని , సాధారణ గృహిణిగా ఉన్న తనకు సముచిత స్థానాన్ని కల్పించినందుకు మైనార్టీలందరూ హర్షించారని ఆమె పేర్కొన్నారు. ఈమె భర్త ఎం. అప్జల్‌ఖాన్ వైఎస్సార్ జిల్లా రాయకోటికి చెందిన మార్కెట్ కమిటీ చైర్మన్‌గా, వైసీపీ నాయకుడిగా పనిచేస్తూ దివంగతుడయ్యారు. వీరికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. గత యేడాది ఆగస్టులో సీఎం జగన్ ఆమెను ఎమ్మె ల్సీగా నియమించారు.
అధ్యక్షా అని సంబోధించే స్థానంలో అక్కలాంటి వ్యక్తి జకియా ఖాన్ కూర్చోవడం చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి చట్టసభల్లో అడుగు పెట్టడం, అంతేగాక నేడు డిప్యూటీ చైర్‌పర్సన్‌గా ఉండటం గర్వంగా ఉందన్నారు. ఇది మైనార్టీ అక్కాచెల్లెలమ్మలకు శుభ సంకేతామన్నారు సీఎం జగన్. ఆడవాళ్లు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని, ఇందుకు ప్రభుత్వం తోడుగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఇటీవల కురిసిన వర్షాలకు మూడు జిల్లాలో తీవ్ర నష్టం సంభవించిందని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. గడిచిన వంద ఏళ్లలో కనీవినీ ఎరుగని వానలు కురిశాయన్నారు. వానలు రాయలసీమను ముంచెత్తడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు. నీళ్లు లేక అలమటించే రాయలసీమలో అనూహ్య వరదలు సంభవించాయన్నారు. పింఛ, అన్నమయ్య రిజర్వాయర్ల కట్టలు తెగిపోయాయని, చెయ్యేరు నది పరివాహక ప్రాంతం గ్రామాలు జలదిగ్భంధం అయ్యాయన్నారు. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు వానలు కురిశాయని, 3.2 క్యూసెక్కుల వర్షం చెయ్యేరు నుంచి విరుచుకుపడిందన్నారు. కొన్ని చోట్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగిందని, నష్టం వివరాలను ఎక్కడ దాచడం లేదని స్పష్టం చేశారు. సహాయం అందించడంలో ఎక్కడా వెనకడుగు వేయలేదని పేర్కొన్నారు.
సీఎం జగన్ వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి బాధితులను పరామర్శించకపోవడంపై విపక్షాలు విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాను ఎందుకు వరద ముంపు ప్రాంతాలకు వెళ్లలేదో సీఎం జగన్ అసెంబ్లీలో నేడు వివరించారు. వరద కారణంగా పలు జిల్లాలు దెబ్బతినడంతో నాకు కూడా అక్కడికి వెళ్లాలనిపించింది. ఇదే మాట అధికారులతో చెప్పాను. చంద్రబాబు ఇప్పటికే వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నాడు కదా... ఇక నాపై బురద చల్లి, బండలు వేస్తారు అని కూడా చెప్పాను. అయితే నేను వరద ప్రభావిత ప్రాంతాలకు వెళితే ఏం జరుగుతుందో సీనియర్ అధికారులు కళ్లకు కట్టినట్టు చెప్పారు.
ఇప్పుడు సహాయక, పునరావాస చర్యలే ముఖ్యమని వాళ్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లా యంత్రాంగాలన్నీ సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయని, సీఎం వస్తున్నాడంటే ఆ పనులన్నీ వదిలేసి సీఎం పర్యటన ఏర్పాట్లు చూసుకోవాల్సి ఉంటుందని విడమర్చి చెప్పారు.
ఇప్పటికే పునరావాస కార్యక్రమాలను మంత్రులు, ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు పర్యవేక్షిస్తున్నారని, ఈ సమయంలో ముఖ్యమంత్రి అక్కడికి వెళితే వారు వరద బాధితులకు అండగా ఉండే పనులు వదిలేస్తారని వివరించారు. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా అంతా సీఎం చుట్టూ ఉంటుందని, అప్పుడు వరద బాధితులను పట్టించుకునేవాళ్లే ఉండరని ఆ సీనియర్ అధికారులు చెప్పారు. ఇది నిజమే అనిపించింది. అందుకే వరద ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లలేదు" అని వివరణ ఇచ్చారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు అంశంపై ప్రభుత్వం చేపడుతున్న సహాయ సహకారాలను వివరిస్తూ ఇటీవల చంద్రబాబు వరద ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వంపై, తనపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. నేను గాల్లోనే వచ్చి గాల్లోనే పోతానని, ఎక్కడో ఓ చోట శాశ్వతంగా కనుమరుగు అవుతానని… తనను వ్యతిరేకించిన వైఎస్ కూడా కాలగర్భంలో కలిసి పోయాడని చంద్రబాబు అన్నారు. ఆయన సంస్కారానికి ఓ నమస్కారం అంటూ ఎద్దెవా చేశారు. ఏనాడైనా గతంలో చంద్రబాబు మానవత్వం చూపారా..? అని ప్రశించారు.
ఎవరూ ఊహించని విధంగా వరద ఉధృతికి ఏపీలో ప్రాజెక్టుల కట్టలు తెగిపోయాయి. అనూహ్యమైన వరద వల్ల ప్రాణ, ఆస్తినష్టాన్ని దాచి పెట్టలేదు.. వరద బాధితులను ఆదుకునే ప్రయత్నాలు చేశాం.. చెయ్యేరు దిగువ గ్రామాలు జల దిగ్బందంలో చిక్కుకున్నారు. నేను వెళ్తే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందనే నేనువెళ్లలేదు. గతంలో నెలల తరబడి అందని సహాయాన్ని వారం రోజుల్లో అందిస్తున్నామని వైఎస్ జగన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగంలో పెను మార్పులు తీసుకువచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా విద్యారంగంపై సీఎం జగన్ శుక్రవారం ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రతి విద్యార్ధి చదువుకునే అవకాశం కల్పించామని తెలిపారు. ఒకటో తరగతితో బీజం వేస్తే.. 20ఏళ్ల తర్వాత పోటీ పరీక్షలకు సిద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. 96 శాతం మంది తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం కోరుతున్నారని పేర్కొన్నారు
అంబేద్కర్ ఆశయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే రోజా అన్నారు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా పాలన సాగుతోందన్నారు. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పథకాలు అమలు చేస్తున్నారన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ అమలు చేశారన్నారు. డ్వాక్రా గ్రూపులను చంద్రబాబు నాశనం చేశారని ఎమ్మెల్యే రోజా అన్నారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)