AP Budget Session 2022: ఐదుగురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్, ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా, సాధారణ మరణాలపై తప్పుడు ప్రచారం జరుగుతోందని సీఎం జగన్ ఆగ్రహం
తిరిగి రేపు (మంగళవారం) ప్రారంభం కానున్నాయి.నేటి సమావేశాల్లో(Andhra Pradesh Assembly ) ఏపీ అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యులను సస్పెన్షన్ చేశారు. బుచ్చయ్యచౌదరి, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, బాల వీరాంజనేయులను సెస్పెన్షన్ చేశారు.
Amaravati,Mar14: ఏపీ శాసన సభ, శాసన మండలి సమావేశాలు(AP Budget Session 2022) వాయిదా పడ్డాయి. తిరిగి రేపు (మంగళవారం) ప్రారంభం కానున్నాయి.నేటి సమావేశాల్లో(Andhra Pradesh Assembly ) ఏపీ అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యులను సస్పెన్షన్ చేశారు. బుచ్చయ్యచౌదరి, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, బాల వీరాంజనేయులను సెస్పెన్షన్ చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్ సమావేశాల చివరి వరకూ వీరిపై సస్పెన్షన్ విధించారు. టీడీపీ సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో టీడీపీ సభ్యులు హుందాగా వ్యవహరించాలన్నారు.
సాధారణ మరణాలపై తప్పుడు ప్రచారం జరుగుతోందని సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(CM YS Jagan) ఆగ్రహం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ చేస్తోన్న అసత్య ప్రచారంపై ఆయన అసెంబ్లీలో స్పందిస్తూ.. నేచురల్ డెత్స్‌పై టీడీపీ (TDP) రాజకీయం చేస్తోందన్నారు. సహజ మరణాలను కూడా వక్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు. కల్తీ మద్యం మరణాలు గతంలోనే అనేక సార్లు జరిగాయి. కల్తీ మద్యాన్ని తమ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తోందని.. రాష్ట్రంలో బెల్ట్ షాపులను సమూలంగా నిర్మూలించామన్నారు. ‘‘లాభాపేక్షతో గత ప్రభుత్వం మద్యం అమ్మకాలు జరిపింది.
బడి, గుడి సమీపంలో కూడా యథేచ్ఛగా మద్యం అమ్మారు.’’ అని సీఎం ధ్వజమెత్తారు. సహజ మరణాలు దేశవ్యాప్తంగా జరుగుతుంటాయి. దేశంలో ఎక్కడైనా 90 శాతం సహజ మరణాలే ఉంటాయి. అన్ని మరణాలు ఒకే చోట జరిగినవి కాదు. సాధారణ మరణాలపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని’’ సీఎం మండిపడ్డారు. తమ హయాంలో 43 వేల బెల్టు షాపులను ఎత్తివేశాం. మద్యపానం నియంత్రించాలన్నదే తమ లక్ష్యమని సీఎం అన్నారు.
చంద్రబాబు అయిదేళ్ల పాలనలో 40 వేలకు పైగా బెల్ట్‌షాపులు తెరిచారని ఎమ్మెల్యే ఆర్‌కే రోజా మండిపడ్డారు. మద్యం సిండికేట్లతో కుమ్మకై చంద్రబాబు నాయుడు ఆడవాళ్ల పసుపు కుంకుమలతో, జీవితాలతో చెలగాటమాడారని ధ్వజమెత్తారు. అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఎత్తేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, తరువాత ఆ హామీని తుంగలో తొక్కారని విమర్శించారు. చంద్రబాబు చేసిన మోసాలను ప్రతి మహిళా గుర్తుపెట్టుకుందన్నారు. అందుకే టీడీపీ ప్రభుత్వాన్ని మహిళలు ఛీ కొట్టి తరిమికొట్టారని మండిపడ్డారు.
గత ప్రభుత్వంలో మద్యం పాలసీ ఎలా ఉందని ప్రశ్నించిన రోజా చంద్రబాబు అయిదేళ్లలో 75 వేల కోట్ల మద్యాన్ని ఏరులై పారించారని మండిపడ్డారు. మద్యం బార్ లైసెన్స్‌ల అనుమతి ప్రతి ఏడాది రెన్యూవల్ చేయాలి. అలాంటిది 2017లోనే 2022 వరకు అనుమతులు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారని దుయ్యబట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇంటింటికి మినరల్ వాటర్ ఇచ్చారో లేదో కానీ ఇంటింటికి మద్యం బాటిళ్లు అందే పథకం మాత్రం పెట్టారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు 2014 నుంచి అయిదు సంవత్సరాల సమయంలో 6 వేల పాఠశాలలను మూసివేశారని గుర్తుచేశారు.
అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబుపై పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు ఎన్టీఆర్ మద్య నిషేధం అమలు చేస్తే, దానికి తూట్లు పొడిచి చంద్రబాబు తన పాలనలో ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు పెంచారని అన్నారు. ఎక్కడ పడితే అక్కడ బెల్ట్‌షాప్‌లు ఏర్పాటు చేయించి, మద్యం అమ్మకాలు పెంచి, అంతులేని అవినీతికి పాల్పడ్డాడని విమర్శించారు. ఈరోజు కూడా ఎల్లో మీడియా, ఈనాడు జంగారెడ్డిగూడెం ఘటనను తప్పు పట్టిస్తూ, ప్రజల్లో అపోహలు కల్పించే విధంగా కథనం రాసిందని మండిపడ్డారు. రామోజీరావు ఆ స్థాయికి దిగజారాడని ఆరోపించారు. చంద్రబాబు శవ రాజకీయం చేస్తున్నారు. ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలన్నారు.