Amaravati, Mar14: ఐదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Budget Session 2022) ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలు చేపట్టారు.సభలో టీడీపీ సభ్యుల గందరగోళంతో స్పీకర్ సభను 5నిమిషాల పాటు వాయిదా వేశారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలపై సభలో టీడీపీ (TDP) ఆందోళనకు దిగింది. తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని పట్టుబట్టారు. సీఎం రాజీనామా చేయాలంటూ పోడియం వద్ద తెలుగు దేశం ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. కాగా టీడీపీ వైఖరిని వైసీపీ తప్పుపడుతోంది.
టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అభ్యంతరం తెలిపారు. సభను అడ్డుకోవడమే ప్రతిపక్షం పనిగా పెట్టుకుందని ఆయన మండిపడ్డారు. సభను (AP Assembly Budget Session LIVE DAY 5) సాగనీయకుండా ప్రతిరోజూ అడ్డుపడుతున్నారన్నారు. ప్రతి అంశాన్ని చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ స్పీకర్ చైర్ వైపు టీడీపీ ఎమ్మెల్యేలు దూసుకెళ్లారు. వారి తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు.టీడీపీ సభ్యుల గందరగోళంతో సభను స్పీకర్ తమ్మినేని వాయిదా వేశారు.
ఇక ప్రతిపక్ష టీడీపీ సభ్యుల ఆందోళనతో శాసన మండలిలో గందరగోళం నెలకొంది. టీడీపీ సభ్యులు అడుగడుగునా అడ్డు తగలడంతో చైర్మన్ మండలిని వాయిదా వేశారు. వాయిదా అనంతరం ఏపీ అసెంబ్లీ ప్రారంభమైంది. మద్యపాన నిషేధంపై మాట్లాడే హక్కు టీడీపీ సభ్యులకు లేదని మంత్రి కొడాలి నాని అన్నారు. మద్యపాన నిషేధానికి చంద్రబాబు తూట్లు పొడిచారని మండిపడ్డారు.