విజయవాడ, మార్చి 13: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు వాయిదా పడనున్నాయి. నిజానికి విద్యాశాఖ తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే రెండో తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ దీనిని తొమ్మిదో తేదీకి మార్చనున్నట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ లో మే 2వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ.. జేఈఈ మెయిన్స్ పరీక్షల కారణంగా ఇటీవల ఇంటర్ పరీక్షల షెడ్యూల్ లో అధికారులు కొన్నిమార్పులు చేశారు. టెన్త్, ఇంటర్ పరీక్షలు దాదాపు ఒకే సమయంలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రశ్నా పత్రాలకు భద్రత కల్పించడంతో పాటు పరీక్ష కేంద్రాల ఎంపిక, ఇతర సమస్యల వల్ల పదో తరగతి పరీక్షలను మే 12నుంచి నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు కొత్త షెడ్యూల్ ను ప్రభుత్వ అనుమతి కోసం పంపారు.
ప్రభుత్వ అనుమతితో పదో తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ ను సోమవారం విడుదల చేసే అవకాశం ఉంది. ఇంటర్ పరీక్షలు మాత్రం ఇటీవల ప్రకటించిన షెడ్యూలు ప్రకారమే ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు జరుగుతాయి. ఇదిలా ఉండగా.. ఈ విద్యాసంవత్సరం పాఠశాలలు ఆలస్యంగా తెరచుకోవడంతో ఒంటిపూట బడులను కూడా వాయిదా వేసింది ప్రభుత్వం. ఒంటిపూట బడుల నిర్వహణ విషయంలో త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.