AP Three Capitals Row: మూడు రాజధానులపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు, అభివృద్ధి వికేంద్రీకరణకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది, చట్టాలు చేసే అధికారం శాసనవ్యవస్థకు ఉంటుందని తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి
ఏపీ అసెంబ్లీలో వికేంద్రికరణపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) మాట్లాడుతూ.. వ్యవస్థల పరిధిపై రాజ్యాంగం స్పష్టత ఇచ్చిందని తెలిపారు. రాజ్యాంగంలో ప్రతీ వ్యవస్థ స్వతంత్రమైనదేనని తెలిపారు. వ్యవస్థలు ఎవరి పరిధిలో వారు ఉంటే సమస్యలు రావని అన్నారు.
Amaravati, Mar 24: ఏపీ అసెంబ్లీలో వికేంద్రికరణపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) మాట్లాడుతూ.. వ్యవస్థల పరిధిపై రాజ్యాంగం స్పష్టత ఇచ్చిందని తెలిపారు. రాజ్యాంగం ప్రకారం చట్టం చేసే అధికారం శాసన వ్యవస్థకే ఉందని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.
పరిపాలన వికేంద్రీకరణపై శాసన వ్యవస్థకు ఎలాంటి అధికారం లేదని హైకోర్టు చెప్పింది. రాజధానిపై కేంద్రం నుంచి అనుమతులు తీసుకోవడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏదీ లేదని చెప్పింది కోర్టు. కానీ, కేంద్రం ఏమో రాజధానిపై నిర్ణయం తమదే అని ఎక్కడా చెప్పలేదు. పైగా రాష్ట్రానిదే తుది నిర్ణయమని అఫిడవిట్ కూడా ఫైల్ చేసింది. టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ఓ ప్రశ్నకు పార్లమెంట్‌లో సమాధానం ఇచ్చింది కేంద్రం. పైగా హైకోర్టు ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అనే వాదనను కూడా కేంద్రం కొట్టిపారేసింది.
అయినా నెలరోజుల్లో లక్ష కోట్ల రూపాయలతో రాజధాని కట్టేయాలని కోర్టులు ఎలా డిక్టేట్ చేస్తాయి? అన్ని వ్యవస్థలు వాటి పరిధిలో ఉండాలి. లేకుంటే సిస్టమ్ మొత్తం కుప్పకూలి పోతుంది. రాజధానిపై వాళ్లంతకు వాళ్లే ఊహించుకుని పెట్టుకున్నారు. అటు గుంటూరు కాదు.. ఇటు విజయవాడ కాదు.. తమకు బినామీలకు భూములున్న చోట రాజధాని పెట్టారు. గత ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకించారు కాబట్టే వైసీపీకి ప్రజలు ఘన విజయం కట్టబెట్టారు. వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని శివరామకృష్ణ కమిటీ కూడా తేల్చి చెప్పింది.
శాసన వ్యవస్థ ఓ చట్టాన్ని చేయాలా? వద్దా? అని కోర్టులు నిర్ణయించలేవు. రాజ్యాంగం ప్రకారం.. చట్టం చేసే అధికారం ఒక్క శాసన వ్యవస్థకే ఉంది. సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నా.. ఆచరణా సాధ్యం కానీ తీర్పు ఇచ్చింది హైకోర్టు. అభివృద్ధి వికేంద్రీకరణకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో మాటలన్నింటికి కట్టుబడి ఉన్నాం అని సీఎం జగన్ మరోమారు స్పష్టం చేశారు.
రాజ్యాంగంలో ప్రతీ వ్యవస్థ స్వతంత్రమైనదేనని తెలిపారు. వ్యవస్థలు ఎవరి పరిధిలో వారు ఉంటే సమస్యలు రావని అన్నారు. మిగిలిన వ్యవస్థలన్నీ సజావుగా సాగుతాయని తెలిపారు. శాసన వ్యవస్థ చట్టాలు చేయకూడదని కోర్టులు చెప్పలేవని తెలిపారు.
మాస్టర్ ప్లాన్ కాలపరిమితి 20 ఏళ్లు అని అప్పటి ప్రభుత్వం చెప్పింది. ప్రతీ ఐదేళ్లకొకసారి సమీక్షించాలని కూడా రాశారు. ఇది ఆచరణ సాధ్యం కాదని అందరికీ తెలుసు. లక్ష కోట్లు అనేది ఇరవై ఏళ్లకు 15 నుంచి 20 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది. ఈ ప్రాంతం మీద నాకు ప్రేమ ఉంది కాబట్టే ఇక్కడే ఇల్లు కట్టుకున్నా. ఇక్కడి నుంచి మాట్లాడుతున్నా. మాకు హైకోర్టుపై గౌరవం ఉంది. అలాగే రాష్ట్ర అసెంబ్లీ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది. ఇవాళ చర్చ జరగకపోతే చట్టాలు చేయాల్సింది శాసన సభా? లేదా కోర్టులా? అనేది క్వశ్చన్ మార్క్ అవుతుంది.
రాజధానే కాదు.. రాష్ట్ర సంక్షేమం కూడా మాకు ముఖ్యం. న్యాయ సలహాలు తీసుకుని ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చలు జరుపుతున్నాం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా పరిపాలన వికేంద్రీకరణను ఓ కొలిక్కి తెస్తాం. అందరికీ మంచి చేయడానికే మా ప్రభుత్వం ఉంది. రాజధానికి భూములు ఇచ్చిన వారికి న్యాయం చేస్తూ.. వికేంద్రీకరణ విషయంలో వెనకడుగు వేసేది లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు.
చట్టాలు చేసే అధికారం శాసనవ్యవస్థకు ఉంటుందని తెలిపారు. మంచి చట్టాలు చేస్తే ప్రజలు మరలా ఎన్నుకుంటారని తెలిపారు. మంచి చట్టాలు చేయకుంటే ప్రజలు ఇంటికి పంపిస్తారని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన విధానాలు నచ్చలేదు కాబట్టే ప్రజలు తమకు తీర్పు ఇచ్చారని తెలిపారు. ఇది ప్రజాస్వామ్య గొప్పతనమని తెలిపారు. శాసనసభ ఓ చట్టాన్ని చేయాలా వద్దా అని కోర్టులు నిర్ణయంచలేవన్నారు. ఆరు నెలల్లో రాజధానిని వేల కోట్లతో పూర్తి చేయాలని చెప్పడం.. సాధ్యం కాని టైం లైన్‌ను నిర్దేశించడం సరికాదన్నారు.
మొదటి తెలంగాణ ఉద్యమం అభివృద్ధి లేకపోవడం వల్ల వచ్చింది.. రెండోసారి తెలంగాణ ఉద్యమం అభివృద్ధి అంతా ఒకే దగ్గర ఉంటడం వల్ల వచ్చిందని చెప్పారు. వికేంద్రీకరణ వల్ల (Discussion three capitals) ఏపీ అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీనే చెప్పిందని తెలిపారు. ఇదే విషయాన్ని పరిగణలోకి తీసుకొని 3 రాజధానుల బిల్లు (AP Three Capitals Row) తీసుకొచ్చామని అన్నారు.
మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. ప్రాథమిక హక్కులపై రాజ్యాంగంలో స్పష్టత ఉందని తెలిపారు. రాజ్యాంగం ఆధారంగానే పరిపాలన సాగుతుందని అన్నారు. ఒకరి హక్కును మరొకరు లాక్కోకూడదని తెలిపారు. వెనకబడిన జిల్లాల్లో అసమానతలు ఉన్నాయని తెలిపారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు అన్ని రంగాల్లో వెనకబడ్డాయని అన్నారు. ప్రాంతాల మధ్య అసమానతలు తొలగించాలని రాజ్యాంగంలో ఉందని తెలిపారు. సమానత్వంపై దృష్టి పెట్టాలని ఎన్నో అనుభవాలు చెబుతున్నాయని తెలిపారు.
భారతదేశంలో 1.63లక్షల చదరపు కీలో మీటర్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 8వ స్థానంలో ఉందని తెలిపారు. అదే విధంగా స్థూల ఉత్పత్తిలో 2019-2020 ప్రకారం.. దాదాపు తొమ్మిదిన్నర కోట్లు ఉందని అన్నారు. 2014లో జరిగిన పునర్ వ్యవస్థీకరణ కారణంగా తలసరి ఆదాయం చాలా తగ్గిందని తెలిపారు. నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడినా.. వలస కూలీలు అంటే శ్రీకాకుళం, విజయనగరం నుంచి వస్తారని తెలిపారు. దాదాపు 20 లక్షలపైగా మంది ఇక్కడి నుంచి వలసపోతున్నారని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సమానత్వం అనేది ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేశారు. కుప్పం వాళ్లు సమారు 60 వేల మందికి పైగా వలసవెళ్లి బయట ప్రాంతాల్లో బతుకుతున్నారని తెలిపారు.
ఎటుంటి రాజధాని కట్టాలని తాము ప్రణాళిక వేశామంటే.. మొట్టమొదటి దశలోనే రోడ్లు, కాలువలకు లక్షా పదివేల కోట్లు కేటాయించాలనుకున్నామని తెలిపారు. గత ప్రభుత్వ పాలకులకు రాజధాని ప్లానింగ్ కోసమే ఐదేళ్లు పట్టిందని అన్నారు. ఏడేళ్లలో రాజధానికి కట్టడానికి వీలవుతుందా?అని ప్రశ్నించారు. అమరావతిలో అభివృద్ధి చేయబోమని ఎవరైనా చెప్పారా? అని అన్నారు. ప్రభుత్వం సభకు సమాధానం చెప్పాలి.. సభ ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. సీఆర్‌డీఏ చట్టాన్ని అసెంబ్లీ చేసిందని గుర్తు చేశారు. చంద్రబాబు నగరం కట్టాలనుకున్నారా.. రాజధాని కట్టాలనుకున్నారా? అని ప్రశ్నించారు. చట్టసభల్లో తీసుకున్న నిర్ణయాలను ఏవిధంగానైనా మార్చాలనే శక్తి కోర్టులకు ఉండటం సరికాదని ఓ తీర్పులో ఉన్నట్లు తెలిపారు. హైకోర్టు జాగ్రత్తగా, ఎక్కువగా స్క్రూటినీ చేయాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో హద్దుదాటి వెళ్లకూడదని టాటా సెల్యులార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీర్పు ఉన్నట్లు గుర్తుచేశారు.
ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను న్యాయవ్యవస్థల మంచి కోసమే మాట్లాడుతున్నానని అన్నారు. స్వీయనియంత్రణ ఏ వ్యవస్థకైనా తప్పనిసరి అని తెలిపారు. ప్రతీ వ్యవస్థకూ కొన్ని పరిధిలు ఉంటాయని అన్నారు. దేశానికి రాజ్యాంగమే సుప్రీమని అన్నారు. న్యాయ వ్యవస్థ అంటే తమకు ఎంతో గౌరవం ఉందని తెలిపారు. జడ్జిలు చేసే తప్పులపై విచారణ జరిపే అధికారం రాష్ట్రపతి ఆధ్వర్యంలోని వ్యవస్థకు ఉండాలని ప్రతిపాదించారు. యూపీఎస్‌సీ తరహాలోనే న్యామమూర్తుల ఎంపిక జరగాలని కేంద్రాన్ని కోరుతున్నానని తెలిపారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)