IPL Auction 2025 Live

PRC Row: కరోనా లేకపోతే రాష్ట్ర రెవెన్యూ రూ.98 వేల కోట్లు ఉండేది, పీఆర్సీ ఆలస్యం అవుతుందనే ఐఆర్‌ ఇచ్చామని తెలిపిన ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌ సమీర్‌ శర్మ, సమ్మెకు సిద్దమవుతున్న ఉద్యోగ సంఘాలు

ఆందోళన బాట పట్టడానికి సిద్ధమవుతున్నారు. దీనిపై సమీర్ శర్మ స్పందించారు. కరోనావైరస్‌ మహమ్మారి వల్ల ప్రభుత్వ ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందని ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌ సమీర్‌ శర్మ (AP Chief Secretary Dr Sameer Sharma) తెలిపారు.

AP CS Sameer Sharma (Photo-Video Grab)

Amaravati, Jan 19: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ అంశం కాక రేపుతోంది, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన బాట పట్టడానికి సిద్ధమవుతున్నారు. దీనిపై సమీర్ శర్మ స్పందించారు. కరోనావైరస్‌ మహమ్మారి వల్ల ప్రభుత్వ ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందని ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌ సమీర్‌ శర్మ (AP Chief Secretary Dr Sameer Sharma) తెలిపారు.

ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా థర్డ్‌వేవ్‌ వల్ల మరింత నష్టం జరిగే పరిస్థితి కనిపిస్తోందని పేర్కొన్నారు. ఏపీలోనే ఉద్యోగుల జీతాల బడ్జెట్‌ ఎక్కువగా ఉందని.. ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు, సంక్షేమ పథకాలు బ్యాలెన్స్‌ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కరోనా కష్ట​కాలంలో కూడా ఉద్యోగులకు ఐఆర్‌ ఇచ్చామని వివరించారు.

కరోనా లేకపోతే రాష్ట్ర రెవెన్యూ రూ.98 వేల కోట్లు ఉండేదని సమీర్‌ శర్మ చెప్పారు. పీఆర్సీ (PRC) ఆలస్యం అవుతుందనే ఐఆర్‌ ఇచ్చామన్నారు. కరోనా కారణంగా రాష్ట్ర రెవెన్యూ రూ.62 వేల కోట్లే ఉందని.. కరోనా సంక్షోభంతో రాష్ట్ర ఆదాయం పడిపోయిందన్నారు. కొత్త పీఆర్సీతో (New PRC) ఎవరి జీతాలు తగ్గవని స్పష్టం చేశారు. ఉద్యోగులందరినీ ప్రభుత్వం సమానంగానే చూస్తుందని.. ఐఏఎస్‌లకు (IAS) ఎక్కువ జీతాలు వస్తున్నాయనడం అవాస్తవమని తెలిపారు.

ఏపీలో గత 24 గంటల్లో 10,057 మందికి కరోనా, విశాఖ జిల్లాలో 1,827 కేసులు, చిత్తూరు జిల్లాలో 1,822 కేసులు నమోదు

ఫైనాన్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రావత్‌ మాట్లాడుతూ.. 27 శాతం ఐఆర్‌ గతంలో ఎవరూ ఇవ్వలేదేని తెలిపారు. అందరికీ న్యాయం చేయడానికి సీఎం వైఎస్‌ జగన్‌ ప్రయత్నించారని పేర్కొన్నారు. విభజన కారణంగా ఏపీ ఆర్థికంగా దిగజారిపోయిందని.. సేవా రంగం నుంచి వచ్చే పన్నుల ఆదాయం తగ్గిపోయిందని తెలిపారు. ఏపీలో వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉందని.. వ్యవసాయం నుంచి పన్నుల ఆదాయం ఉండదని తెలిపారు.

విభజనే వల్ల హైదరాబాద్‌ను కోల్పోయామని దాంతో పాటే పన్నుల ఆదాయం కూడా నష్టపోయామని పేర్కొన్నారు. ఏపీకి జనాభా ఎక్కువ.. పన్నుల ఆదాయం తక్కువ అన్నారు. ఇంకా రూ. 33,490 కోట్ల అప్పుల విభజన జరగాల్సి ఉందని.. కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా తగ్గిపోయిందని వెల్లడించారు. ఐఆర్‌ రూపంలో రూ. 17,918 కోట్లు ఇచ్చామని వివరించారు. అంగన్‌వాడీ, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందితో పాటు ఆశా వర్కర్లకు కూడా గౌరవ వేతనాలు పెంచామని తెలిపారు. మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా వేతనాలు పెంచామని చెప్పారు. కాంట్రాక్ట్‌ వర్కర్లకు మినిమం టైమ్‌ స్కేల్‌ అమలు చేస్తున్నామని రావత్‌ తెలిపారు.

ఇక ఉద్యోగ సంఘాల నేతలు ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ను సీఎస్ పక్కదోవ పట్టిస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.సూర్యనారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఐఏఎస్ అధికారుల సంఘం ఖండించింది. సీఎస్ పై సూర్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఐఏఎస్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ చీఫ్ సెక్రటరీనే పరిపాలన అధిపతి అని ఆయన అన్నారు. అందరు ఉద్యోగులు, అన్ని ఉద్యోగ సంఘాల పట్ల సీఎస్ బాధ్యతగా వ్యవహరిస్తారని చెప్పారు. ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టించారనే ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ఇవి బాధ్యతారాహిత్యమైన ఆరోపణలని... భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకూడదని ఆశిస్తున్నట్టు చెప్పారు. వృత్తిపరంగా ఉన్నతాధికారులందరూ నిష్పక్షపాతంగానే వ్యవహరిస్తారనే విషయాన్ని ఉద్యోగులు తెలుసుకోవాలని సూచించారు.

ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ, రెండో రోజు ముఖ్యమంత్రి జగన్ తో మాట్లాడే అవకాశమే తమకు రాలేదని చెప్పారు. పీఆర్సీపై సీఎం ఒక ప్రకటన చేసి వెళ్లిపోయారని అన్నారు. ప్రభుత్వంతో తమకు ఎలాంటి ఒప్పందం లేదని, తాము ఎక్కడా సంతకాలు పెట్టలేదని చెప్పారు. పీఆర్సీ వల్ల ఉద్యోగుల జీతాలు పెరగాలే కానీ, తగ్గవని అన్నారు. తమను ఇంత మోసం చేస్తారా? అని అసంతృప్తిని వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వ స్కేల్ తో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధమని ప్రశ్నించారు. ప్రజల సంక్షేమం పేరుతో ఉద్యోగులను సంక్షోభంలోకి నెడతారా? అని అసహనం వ్యక్తం చేశారు. పీఆర్సీ ఇవ్వాల్సినప్పుడల్లా ప్రభుత్వాలు ఆదాయం లేవనే చెపుతాయని... రాష్ట్ర విభజన వల్ల ఆర్థికలోటు ఉన్నా గత ప్రభుత్వం 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చిన మాట నిజం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆదాయం భారీగా పెరిగిందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్వయంగా చెప్పారని... మరి, ఆయన అబద్ధాలు చెప్పారని అనుకోవాలా? అని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఇంతకుముందు విజయసాయిరెడ్డి రెడ్డి చేసిన ట్వీట్ ను చూపించారు. ఇకపై మాటలు, చర్చలు ఉండవని... ఈనెల 21 సమ్మె నోటీసు ఇస్తామని స్పష్టం చేశారు.

సీఎస్ సమీర్‌శర్మ లెక్కలన్నీ తప్పులతడక అని ఎపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస్‌ అన్నారు. సీఎస్ మమ్మల్ని మోసం చేశారని ఆరోపించారు. పీఆర్సీతో జీతం పెరుగుతుందని అబద్ధం చెబుతున్నారని విమర్శించారు. కొత్త పీఆర్సీని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. 3 జీవోలను బేషరతుగా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగుల అంగీకారం లేకుండా ప్రభుత్వమే ఎలా నిర్ణయం తీసుకుంటుందని ప్రశ్నించారు. జీవోలు రద్దు చేసేవరకు ప్రభుత్వంతో చర్చలకు వెళ్లమని స్పష్టం చేశారు. డీఏలు ఇచ్చి జీతంలో కోత విధించడం మోసపూరితమన్నారు. కేంద్ర పే స్కేల్‌ను అమలు చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు.

తాం దాచుకున్న డబ్బును ఎక్కడికి మళ్లించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఫిట్‌మెంట్ అంటే జీతాలు పెరగాలి.. తగ్గకూడదన్నారు. పీఆర్సీ సమయంలోనే డీఏ ఎందుకు ఇస్తున్నారు? అని బండి శ్రీనివాస్‌ ప్రశ్నించారు. డీఏలను చూపించి జీతం పెరిగినట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పీఆర్సీతో జీతం పెరుగుతుందని అసత్యాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తతం చేశారు. పీఆర్సీ వద్దు, 27 శాతం ఐఆర్ ఇస్తేచాలన్నారు.



సంబంధిత వార్తలు