Andhra Pradesh: ఏపీలో 51 ప్రాజెక్టులకు ముందడుగు, కీలక ప్రాజెక్టులపై కేంద్రమంత్రి గడ్కరీతో సీఎం జగన్‌ చర్చలు, సీఎం జగన్‌ గొప్ప ఆశయం ఉన్న నాయకుడని ప్రశంసించిన కేంద్ర మంత్రి

కేంద్ర మంత్రి గౌరవార్ధం ఆయనకు సీఎం (AP CM YS Jagan) విందు ఇచ్చారు.

AP CM YS Jagan and Union minister Nitin Gadkari(Photo-Twitter)

Amaravati, Feb 17: ఏపీలో పూర్తయిన పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనల తర్వాత కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ నేరుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నివాసానికి చేరుకున్నారు. కేంద్ర మంత్రి గౌరవార్ధం ఆయనకు సీఎం (AP CM YS Jagan) విందు ఇచ్చారు. భోజనం తర్వాత రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, ప్రతిపాదనలపై నితిన్‌ గడ్కరీతో (Union minister Nitin Gadkari) సీఎం చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహాదారుల శాఖకు చెందిన అధికారులు, రాష్ట్రానికి చెందిన కీలక అధికారులు హాజరయ్యారు.

రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని గొప్పస్థాయికి తీసుకెళ్లగలిగే విశాఖపట్నం-భీమిలి-భోగాపురం (బీచ్‌ కారిడార్‌) రోడ్డుపై విస్తృత చర్చజరిగింది. రాష్ట్రాభివృద్ధిలో ఈ రోడ్డు కీలక పాత్ర పోషిస్తుందని, టూరిజం రంగం బాగుపడ్డమే కాకుండా చాలామందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ముఖ్యమంత్రి.. కేంద్రమంత్రికి వివరించారు. విశాఖ నగరం నుంచి త్వరలో నిర్మాణం కానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి త్వరగా చేరుకోవాలన్నా ఈ రహదారి అత్యంత కీలకమని సీఎం వివరించారు. ఈ ప్రాజెక్టుపై సానుకూలత వ్యక్తం చేసిన కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ప్రఖ్యాత అంతర్జాతీయ కన్సల్టెన్సీతో ప్రతిపాదనలు తయారు చేయించాలని సూచించారు. దీనిపై వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని సీఎం వైఎస్‌ జగన్, గడ్కరీతో అన్నారు.

ఏపీలో అత్యంత దిగువకు పడిపోయిన కేసులు, గత 24 గంటల్లో 528 మందికి కరోనా, అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 101 కొత్త కేసులు నమోదు

విజయవాడలో ట్రాఫిక్‌ కష్టాలను తగ్గించడానికి ఇప్పుడు నిర్మాణం అవుతున్న పశ్చిమ బైపాస్‌తో పాటు తూర్పున మరో బైపాస్‌ నిర్మాణం కూడా చేయాలని ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తిపై కేంద్రమంత్రి అంగీకారం తెలిపారు. ఈ ప్రాజెక్టును మంజూరు చేస్తున్నట్టుగా వెల్లడించారు. కృష్ణానదిపై బ్రిడ్జితోపాటు 40కి.మీ మేర బైపాస్‌ రానుంది. అలాగే రాష్ట్ర రహదారులపై 33 ఆర్వోబీల నిర్మాణంపై కూడా సీఎం.. కేంద్ర మంత్రితో చర్చించారు. వీటన్నింటికీ ఆమోదం తెలుపుతున్నట్టు కేంద్రమంత్రి వివరించారు. తమ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినందుకు సీఎం జగన్‌.. కేంద్రమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో ఆర్‌అండ్‌బీ మంత్రి ఎం.శంకరనారాయణ, ముఖ్యమంత్రి కార్యదర్శులతో పాటు రాష్ట్ర, రవాణా, ఆర్‌ అండ్‌ బీ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఎం.ఒ.ఆర్‌.టి.హెచ్‌. ఆర్వో ఎస్‌.కె.సింగ్, ఎన్‌ఏఐ అధికారులు మహబిర్‌ సింగ్, ఆర్‌.కె.సింగ్‌ హాజరయ్యారు.

ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ పూర్తి ప్రసంగం

అంతకు ముందు ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ (inaugurates Benz Circle second flyover ) కార్యక్రమంలో కేంద్రం సహకారంతో రాష్ట్రంలో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో 1380 కిలోమీటర్ల పొడవు గల 51 జాతీయ రహదారి ప్రాజెక్టులకు గురువారం శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పర్యటనకు వచ్చిన నితిన్‌ గడ్కరీకి ధన్యవాదాలు. మీ దార్శనికత, ముందుచూపు ఈ దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం, అభివృద్ధిలో స్పష్టంగా కనిపిస్తోంది. అందులో ఆంధ్రప్రదేశ్‌ కూడా చోటు దక్కించుకుంది. నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ టోల్‌ కలెక్షన్‌ ప్రోగ్రాంలో భాగంగా ఏర్పాటు చేసిన ఫాస్ట్‌ ట్రాక్స్‌ కార్యక్రమం మీరు చేస్తున్న అభివృద్ధి కిరీటంలో మరో కలికితురాయిలా చేరింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో మీరు రోడ్డు, రవాణా, జాతీయ రహదారులశాఖలను అత్యంత నేర్పరితనంతో, వేగవంతంగా అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు పాకిన హిజాబ్ వివాదం, విజయవాడలోని ఆంధ్ర లయోల కాలేజ్‌లో హిజాబ్ ధరించిన విద్యార్థినిలను అడ్డుకున్న కాలేజీ యాజమాన్యం

మీ హయాంలో రహదారుల నిర్మాణం 2014లో రోజుకు 12 కిలోమీటర్ల స్ధాయి నుంచి ప్రస్తుతం మన మాట్లాడుకుంటున్నట్టు 37 కిలోమీటర్ల స్ధాయికి చేరుకుంది. మా రాష్ట్రంలో మీ సమర్ధవంతమైన పనుల వల్ల జాతీయరహదారుల పొడవు 2014లో ఉన్న 4193 కిలోమీటర్ల నుంచి 95 శాతం గ్రోత్‌ రేటుతో నేడు 8163 కిలోమీటర్లకు చేరింది. ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోదీ గారికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు.

కేంద్ర రోడ్డు, రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ రాష్ట్ర పర్యటనలో భాగంగా మొత్తం 51 ప్రాజెక్టులకు సంబంధించి ముందడుగులు పడుతున్నాయి. ఇందులో రూ.10,400 కోట్ల వ్యయంతో నిర్మించిన 741 కిలోమీటర్ల పొడవైన 30 రహదారుల పనులకు శంకుస్ధాపనతో పాటు, ఇప్పటికే రూ.11,157 కోట్ల వ్యయంతో పూర్తి చేసిన మరో 21 రహదారులను ఇవాళ ప్రారంభిస్తుండటం చాలా సంతోషంగా ఉందన్నారు. విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద రద్దీను దృష్టిలో ఉంచుకుని మరో ఫ్లైఓవర్‌ నిర్మించాలని 2019 ఆగష్టులో నేను విజ్ఞప్తి చేశాను. ఆ మేరకు మంత్రి గడ్కరీ వెంటనే మంజూరు చేసి, 2020లోనే నిర్ణయం తీసుకుని,ఆ పై నిర్మాణ పనులు కూడా వేగవంతం చేసి.. ఆ ఫ్లైఓవర్‌ను కూడా గౌరవ కేంద్రమంత్రి ప్రారంభిస్తుండటం చాలా సంతోషమన్నారు.

ప్రతి మండల కేంద్రం నుంచి కూడా జిల్లా కేంద్రం వరకు రెండు లైన్ల రోడ్లుగా మారుస్తూ... దాదాపుగా రూ.6,400 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. పూర్తిగా రోడ్లన్నీ కూడా రిపేర్లు, మెయింటైనెన్స్‌ చేయడం కోసం మాత్రమే మరో రూ.2300 ఖర్చు చేస్తున్నాం. పెండింగ్‌లో ఉన్న ప్రతి రోడ్డు పూర్తి చేసేందుకు మరో రూ.1700 కోట్లు ఖర్చుతో కలిపి రూ.10,600 కోట్లకు సంబంధించిన రహదారి పనులకు శ్రీకారం చుట్టాం. ఇందులో కొన్ని పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ఇక రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తరపున మీరు చేసిన మంచి పనులన్నింటికీ కూడా ఎటువంటి సంకోచం లేకుండా, ఎటువంటి రాజకీయాలు లేకుండా ప్రజల మందుర మీకు మా సంతోషాన్ని, కృతజ్ఞతలూ తెలియజేస్తున్నాను. ఇవాళ మరికొన్ని రోడ్ల నిర్మాణం కూడా ఈ రాష్ట్రానికి అత్యంత అవసరమని విజ్ఞప్తి చేస్తూ.. మీ ఆమోదం కోసం కొన్ని ప్రతిపాదనలను మీ ముందు ఉంచుతున్నాను.

మరికొన్ని ప్రతిపాదనలు

విశాఖతీరంలో విశాఖపట్నం పోర్టు నుంచి భీమిలి– భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు రహదారి నిర్మాణం. రుషికొండ, భీమిలి కొండలను, సముద్ర తీరాన్ని తాకుతూ పర్యాటక రంగానికే వన్నె తెచ్చే విధంగా .. భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు కనెక్ట్‌ చేసే విధంగా నేషనల్‌ హైవే 60ను కలుపూతూ 6 లేన్ల రహదారి చాలా అవసరం అని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే విజయవాడ తూర్పున బైపాస్‌... కృష్ణానదిపై వంతెన సహా దాదాపు 40 కిలోమీటర్ల రహదారి నిర్మాణం అవసరం. నగరంలో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్‌ దృష్ట్యా ఈ బైపాస్‌ చాలా అవసరం అవుతుంది. మీరు వెస్ట్రన్‌ బైపాస్‌కు శాంక్షన్‌ ఇచ్చారు, ఈస్ట్రన్‌ బైపాస్‌కు కూడా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రధాన జాతీయ రహదారులు నగరం గుండా వెళ్తుండడంతో నగరంలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతాయి. వీటన్నింటికీ కూడా ఈ రెండు బైపాస్‌లు పరిష్కారమార్గాలవుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.

జాతీయ రహదారులుగా..

అలాగే వైఎస్సార్‌ కడప జిల్లా భాకరాపేట నుంచి బద్వేలు, పోరుమామిళ్ల మీదుగా ప్రకాశం జిల్లా బెస్తవారిపేట రహదారి, పుంగనూరు నుంచి పులిచెర్ల మీదుగా చిన్నగొట్టికల్లు రహదారి, సబ్బవరం నుంచి చోడవరం, నర్సీపట్నం మీదుగా తుని రహదారి, విశాఖపట్నం నుంచి నర్సీపట్నం, చింతపల్లి, చింతూరు మీదుగా భద్రాచలం వరకు ఉన్న రహదారి.. వీటన్నింటినీ కూడా జాతీయ రహదారులగా గుర్తించి అభివృద్ది చేయాలని మనసారా కోరుతున్నాను. నిండుమనస్సుతో మీరు చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే తెలుగువారైన మన కిషన్‌ రెడ్డి గారు కూడా.. మన రాష్ట్ర అభివృద్ది కొరకు నాలుగడుగులు ఎప్పుడూ ముందుకు వేస్తూనే ఉన్నారు. ఆయన కూడా మరింత చొరవ చూపాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను.

ఈ ప్రతిపాదనలన్నింటినీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర రోడ్డు, రవాణా, జాతీయరహదారుల శాఖకు పంపించాం. గడ్కరీ దయచేసి వీటన్నింటినీ పరిశీలించి, పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను. మరోవైపు జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇటీవలే రాష్ట్ర రహదారులపై ఆర్‌ఓబీల నిర్మాణాలకు సంబంధించి కేంద్రం అడిగిన 20 ప్రతిపాదనలు సిద్ధం చేశాం. దీనికి సంబంధించి కూడా త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కోరుతున్నాం. వీటన్నింటితో పాటు మంచి చేస్తున్న మంచి వారికి ఎప్పుడూ మంచి జరగాలని ఆశిస్తూ.. కోరుకుంటూ దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు కూడా మనందరి ప్రభుత్వానికి కూడా ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానని సీఎం జగన్‌ తన ప్రసంగం ముగించారు.

ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నితిన్‌ గడ్కరీ పూర్తి ప్రసంగం

నితిన్‌ గడ్కరీ మాట్లాడుతూ.. డైనమిక్‌ సీఎం జగన్‌ నేతృత్వంలో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందని ముఖ‍్యమంత్రిపై ప్రశంసలు కురిపించారు. ప్రజలకు మంచి చేయాలన్న గట్టి ఆశయం ఉన్న నాయకుడు ఉంటే ఏదైనా సాధించగలరని సీఎం జగన్‌ను ఉద్దేశించి అన్నారు. ఏపీ చరిత్రలో ఇది సువర్ణాధ్యాయంగా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఏపీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం సంతోషకరంగా ఉందన్నారు. ఏపీ సీఎం జగన్‌ కోరిన ఈస్ట్రన్‌ రింగు రోడ్డుకు ఇ‍ప్పుడే ఆమోదం తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. అలాగే.. 20 ఆర్‌ఓబీలకు బదులుగా 30 ఆర్‌ఓబీలను మంజూరు చేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు.

విశాఖతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం నుంచి సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. ఏపీలో రూ. 3 లక్షల కోట్ల విలువైన రోడ్లను నిర్మించనున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆరు గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేలను కేంద్రం నిర్మిస్తోందని వెల్లడించారు. భారత ఆర్థికాభివృద్ధిలో ఏపీ పాత్ర కీలకంగా ఉంటుందని భావిస్తున్నట్టు గడ్కరీ తెలిపారు. రహదారుల నిర్మాణానికి నిధుల కొరత లేదన్నారు. గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ ప్రెస్‌ హైవేల నిర్మాణం జరగాల్సి ఉందన్నారు. రహదారుల అభివృద్ధితోనే దేశాభివృద్ధి అని వాజ్‌పేయి అన్నారని గుర్తు చేశారు. వాజ్‌పేయి హయంలోనే స‍్వర్ణ చతుర్భుబి నిర్మాణం ప్రారంభమైనట్టు తెలిపారు.

2024 వరకు రాయపూర్‌-విశాఖ గ్రీన్‌ఫీల్డ్‌ హైవేను పూర్తి చేస్తామని ఆయన హామీనిచ్చారు. 2025 నాటికి రూ.15వేల కోట‍్లతో నాగ్‌పూర్‌-విజయవాడ హైవే పూర్తి చేయనున్నట్టు చెప్పారు. అభివృద్ధిలో ఓడరేవులు, రహదారుల కనెక్టివిటీ ఎంతో కీలకమని అన్నారు. మూడేళ్లలో రూ. 5వేల కోట్లతో చిత్తూరు-తంజావూరు గ్రీన్‌ఫీల్డ్‌ హైవే, రూ. 6వేల కోట్లతో హైదరాబాద్‌​-విశాఖ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే, రూ. 17వేల కోట్లతో ఏపీ మీదుగా బెంగళూరు-చైన్నై హైవేల నిర్మాణాలను పూర్తి చేయనున్నట్టు గడ్కరీ తెలిపారు.

ఈ హైవే వల్ల కర్ణాటక, ఏపీ, తమిళనాడు రాష్ట్రాలకు ప్రయోజనం ఉంటుందని సూచించారు. కొత్త హైవేలు పూర్తి అయితే స్పీడ్‌ లిమిట్‌ను సవరించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. రోడ్లు బాగుంటే రవాణా వ్యయం భారీగా తగ్గుతుందన్నారు. చైనాతో పోలిస్తే భారత్‌లో రవాణా వ్యయం చాలా ఎక్కువగా ఉందన్నారు. కేంద్రం నిర్వహిస్తున్న గ్రామ సడక్‌ యోజన ఇ‍ప్పుడు అత్యంత కీలకమన్నారు.

ఏపీలో వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు కీలకమైనవి, వ్యవసాయ రంగంలో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందని కితాబిచ్చారు. రైతులు, వ్యవసాయ అభివృద్ధి కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధమన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తయిన తర్వాత తాను వ్యక్తిగతంగా ఏపీకి వస్తానని మంత్రి తెలిపారు. తాను జలవనరుల మంత్రి కానప్పటికీ పోలవరం ప్రాజెక్టును చూస్తానని అన్నారు. జలాలు సముద్రంలో కలవకముందే నదులను అనుసంధానించుకుందామని గడ్కరీ సూచించారు. అలాగే.. పరిశ్రమలతోనే ఉపాధి కల్పన సాధ్యమన్నారు.

ఇథనాల్‌ ఉత్పత్తికి ఏపీ కేంద్రం కావాలని నితిన్‌ గడ్కరీ ఆకాంక్షించారు. దేశం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు ఇది పరిష్కారం అవుతుందని తెలిపారు. త‍్వరలో డీజిల్‌ లారీలకు బదులుగా ఎలక్ట‍్రిక్‌ లారీలు, డీజిల్‌ స్థానంలో సిఎన్‌జీ, ఎల్‌పిజి రవాణా వాహనాలు వస్తాయని సూచించారు. పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం తగ్గి.. గ్రీన్‌ హైడ్రోజన్‌ వాడకం పెరిగితే పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు.