Andhra Pradesh: ఉద్యమ బాట పట్టిన ఏపీ ఉద్యోగులు, పీఆర్సీ అమలు సహా 71 డిమాండ్లు పరిష్కరించే వరకు ఉద్యమిస్తామని వెల్లడి, నిరసనలకు దూరంగా ఉంటామని తెలిపిన ఏపీ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ ఫోరం, ఏపీ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్

గత కొన్నాళ్లుగా ప్రధాన కార్యదర్శికి తమ సమస్యలను విన్నవించినా పట్టించుకోకపోవడంతో గత్యతంతరం లేని పరిస్థితిలో ఉద్యమానికి దిగాల్సి వచ్చిందని ఏపీ ఉద్యోగులు జేఏసీ (AP employees JAC), ఏపీ జేఏసీ అమరావతి వెల్లడించాయి.

AP-Employees JAC (Photo-File Pic)

Amaravati, Dec 7: తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. గత కొన్నాళ్లుగా ప్రధాన కార్యదర్శికి తమ సమస్యలను విన్నవించినా పట్టించుకోకపోవడంతో గత్యతంతరం లేని పరిస్థితిలో ఉద్యమానికి దిగాల్సి వచ్చిందని ఏపీ ఉద్యోగులు జేఏసీ (AP employees JAC), ఏపీ జేఏసీ అమరావతి వెల్లడించాయి. హక్కులను సాధించడం కోసం ఉద్యమబాట పట్టడం ఒక్కటే తమకు మిగిలిందని వారంటున్నారు.

ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇవాళ నల్ల బ్యాడ్జీలు ధరించి ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. నేటి నుంచి 3 రోజుల పాటు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇవాల్టి నుంచి 21 వరకు దశలవారీగా ఉద్యమాన్ని చేపట్టాలని ఏపీ ఉద్యోగుల జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నాయకులు స్పష్టం చేశారు. ప్రభుత్వం వేతన సవరణ ప్రకటించే వరకు ఉద్యమం ఆగదని విశాఖలో ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

జీఎస్టీ నష్టపరిహారం కింద ఏపీకి రూ. 543 కోట్లు ఇచ్చాం, రాజ్యసభలో వెల్లడించిన ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి

పీఆర్సీ (PRC ) అమలు సహా 71 డిమాండ్లు పరిష్కరించే వరకు ఉద్యమిస్తామని వెల్లడించారు. ప్రభుత్వానికి కావాల్సినంత సమయం ఇచ్చామని.. ఇప్పటికీ వచ్చేనెల 6 వరకు సమయమిచ్చామని కర్నూలులో ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సానుకూల స్పందన లేకపోవడంతో ఉద్యమానికి పిలుపునిచ్చామని ఆయన చెప్పారు. ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చిన ఆందోళనలో ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొంటారని ఆర్టీసీలో ప్రధాన కార్మిక సంఘం ఎంప్లాయిస్ యూనియన్ తెలిపింది.

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగర పాలక పంపుల చెరువు, ఆర్టీసీ డిపో వద్ద ఏలూరు కార్పొరేషన్ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు నిరసనలో పాల్గొన్నారు. ఇలాఉండగా, ఉద్యోగ సంఘాల నిరసనల్లో పాల్గొనడం లేదని ఏపీ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ ఫోరం ప్రకంటించింది. అలాగే, నిరసనలకు దూరంగా ఉంటున్నట్లు ఏపీ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ తెలిపింది. పీఆర్సీపై సీఎం జగన్ ప్రకటన చేసినందున నిరసనల్లో పాల్గొనటం లేదని వెల్లడించింది. దీనిపై కొందరు విబేధించడంతో ఒక వర్గం నిరసనల్లో పాల్గొంటున్నది.