AP Global Investors Summit 2023: ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023 రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం, మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో సమ్మిట్, మార్చి నెలాఖరు 28, 29వ తేదీల్లో జీ20 సదస్సు
సచివాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జీఐఎస్ వెబ్‌సైట్‌ను ప్రారంభించి బ్రోచర్‌ను ఆవిష్కరించారు.
Vizag, Jan 5: విశాఖపట్నంలో మార్చి 3, 4 తేదీల్లో నిర్వహించనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023 (జీఐఎస్) (AP Global Investors Summit 2023) రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. సచివాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జీఐఎస్ వెబ్‌సైట్‌ను ప్రారంభించి బ్రోచర్‌ను ఆవిష్కరించారు.
ఐటీ మంత్రి మాట్లాడుతూ.. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమిట్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. అలాగే సదస్సు నిర్వహణకు సంబంధించి సీఎస్ అధ్యక్షతన అధికారులతో ఓ కమిటీ, మంత్రుల బృందంతో మరో కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. మంత్రుల బృందం సమావేశంలో భాగంగా ఏయే రంగాల నుంచి సదస్సుకు ఎవరెవర్ని ఆహ్వానించాలనే దానిపై అధికారులతో చర్చించినట్లు తెలిపారు.
విశాఖ నడిబొడ్డున ఉండే ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో సదస్సును నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఈ సదస్సు నిర్వహణకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉండే ఇన్వెస్టర్లు సులువుగా రిజిస్ట్రేషన్ చేసేందుకు వెబ్ సైట్ ను తీసుకొచ్చామని చెప్పారు. అలాగే మార్చి నెలాఖరు 28, 29వ తేదీల్లో విశాఖలోనే జీ20 సదస్సు జరగనుందన్నారు.
ఈ క్రమంలోనే అన్ని ఏర్పాట్లు చూసుకునేందుకు అధికారులతో జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత సంతతి డాక్టర్ల హెల్త్ సమ్మిట్ కూడా విశాఖలో ఈనెల 6వ తేదీ నుంచి మూడ్రోజుల పాటు జరగనుందని మంత్రి తెలిపారు. అలాగే ఈ నెల 21న ఐటీ కాన్ఫరెన్స్, ఫిబ్రవరి 16, 17వ తేదీల్లో గ్లోబల్ టెక్ సమిట్ కూడా విశాఖలో జరగబోతున్నట్లు పేర్కొన్నారు.
ఏపీలో పరిశ్రమలు నడిపేందుకు ఉన్న అనుకూలతలను, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సహకాలను వివరించి పెట్టుబడులను ఆకర్షించేందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రోడ్ షోలను నిర్వహించబోతున్నట్లు మంత్రి అమర్నాథ్ వివరించారు. దీనికి సంబంధించి మంత్రుల సూచనలతో కొన్ని దేశాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. అలాగే దేశంలో ఢిల్లీ లాంటి కొన్ని నగరాల్లో రంగాల వారీగా రోడ్ షో లు నిర్వహించబోతున్నట్లు వివరించారు.
అగ్రికల్చర్ పుడ్ ప్రాసెసింగ్, ఏరోస్పెస్, డిఫెన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వెహికల్స్, టెక్స్ టైల్స్, ఇండస్ట్రియల్ లాజిస్టిక్స్ ఇన్ ఫ్రాస్టక్చర్, పెట్రోలియం అండ్ పెట్రోలియం కెమికల్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీ, టూరిజం, ఎంఎస్ఎంఈ, స్టార్టప్స్ వంటి 12 రకాల రంగాలకు సంబంధించిన కంపెనీలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పారిశ్రామిక వేత్తలను, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఈ సదస్సుకు ఆహ్వానించబోతున్నామన్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి, మంత్రుల స్థాయిలో రంగాల వారీగా ఆహ్వానాలు పంపబోతున్నట్లు వివరించారు.