AP Budget Session 2021: రేపు అసెంబ్లీకి రానున్న పూర్తి స్థాయి బడ్జెట్, 2021–22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన, అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం
కరోనావైరస్ ఉధృతి నేపథ్యంలో శాసనసభ, శాసనమండలి బడ్జెట్ సమావేశాలను (AP Budget Session 2021) గురువారం ఒక్కరోజే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh government) నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
Amaravati, May 19: కరోనావైరస్ ఉధృతి నేపథ్యంలో శాసనసభ, శాసనమండలి బడ్జెట్ సమావేశాలను (AP Budget Session 2021) గురువారం ఒక్కరోజే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh government) నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కోవిడ్, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మార్చిలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించడానికి వీలు పడకపోవడంతో మూడు నెలలు (ఏప్రిల్ నుంచి జూన్) ఓటాన్ అకౌంట్‌కు ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే పూర్తి స్థాయి బడ్జెట్‌ను (AP Budget Session) ఉభయ సభల్లో ప్రవేశపెట్టాల్సి ఉండటంతో గురువారం సమావేశాలు నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా ఆ రోజు ఉదయం 9 గంటలకు ఉభయసభల సభ్యులనుద్దేశించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ రాజ్‌భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్నారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ఉభయ సభలు ఆమోదం తెలుపుతాయి. అనంతరం 2021–22 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీకి సమర్పిస్తారు. ఆ తర్వాత ద్రవ్య వినిమయ బిల్లుతోపాటు వివిధ శాఖల పద్దులు, ఆర్డినెన్స్‌ల స్థానే బిల్లులకు ఆమోదం తెలుపుతారు.
ఇదిలా ఉంటే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్టు (TDP to boycott budget session of AP Assembly) టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పారు. విశాఖలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మార్చిలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించి బడ్జెట్‌ను ఆమోదించడం ఆనవాయితీగా వస్తోందని, కేంద్రం కూడా ఇలాగే చేసిందని చెప్పారు. ఇప్పుడు కరోనా కేసులు ఎక్కువగా ఉన్న సమయంలో సమావేశాలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఒక రోజు సమావేశం నిర్వహించి అన్ని తూతూ మంత్రంగా చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు.
కరోనా నియంత్రణపై ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదన్నారు. బాధ్యత గల సీఎం అయితే అఖిలపక్ష సమావేశం నిర్వహించి కరోనా నియంత్రణపై చర్చించేవారని చెప్పారు. ప్రజలకు వ్యాక్సిన్ అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఆక్సిజన్ కొరత వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని, ప్రభుత్వం ఈ లెక్కలను తక్కువగా చూపిస్తోందన్నారు. కరోనాతో ప్రజలు ఆర్తనాదాలు చేస్తుంటే దహన సంస్కారాలకు రూ.15 వేలు ఇస్తారా అని ప్రశ్నించారు. త్వరలో జూమ్ ద్వారా మాక్ అసెంబ్లీ నిర్వహించి ప్రభుత్వ తప్పులను ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు.