AP Local Body Polls: 10,890 మంది సర్పంచ్ లు నేరుగా ఎన్నిక, పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని తెలిపిన ఎస్ఈసీ, పోలీసుల పని భేష్, ఇదే ఉత్సాహంతో మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపు
సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసిందన్నారు. ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు అందించిన సహకారంతో ఆంధ్రప్రదేశ్ లో నాలుగు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికలు విజయవంతం అయ్యాయని ఆయన (SEC Nimmagadda Ramesh Kumar) తెలిపారు.
Amaravati, Feb 22: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసిందన్నారు. ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు అందించిన సహకారంతో ఆంధ్రప్రదేశ్ లో నాలుగు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికలు విజయవంతం అయ్యాయని ఆయన (SEC Nimmagadda Ramesh Kumar) తెలిపారు.
90 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 50 వేల మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ పక్కనపెట్టి ఉద్యోగులు పనిచేశారని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ పూర్తిగా సహకరించారని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పనిచేశారని పేర్కొన్నారు. ప్రతి విడతలో 80 శాతం మంది ఓటింగ్‌లో పాల్గొన్నారని ఎస్‌ఈసీ వెల్లడించారు.
ఎన్నికలు (AP Local Body Polls) సజావుగా సాగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలను కూడా జరపాలని నిర్ణయించామని, ఉద్యోగులు అందుకు సిద్ధం కావాలని, సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, డీజీపీలు ఎప్పటికప్పుడు సరైన సూచనలు చేశారని కితాబిచ్చారు.
కోర్టు పరిధిలో ఒకటి, రెండు అంశాలు ఉన్నందున కొన్ని చోట్ల ఎన్నికలు ( AP Gram Panchayat Elections) జరపలేకపోయామని వెల్లడించిన నిమ్మగడ్డ, కేసులు పరిష్కారం కాగానే వాటికీ ఎన్నికలు జరుపుతామని స్పష్టం చేశారు. మునిసిపల్ ఎన్నికలకు మాత్రం ఎటువంటి అవరోధాలూ లేవని అన్నారు.
ఈ పంచాయతీ ఎన్నికల్లో 16 శాతం మాత్రమే ఏకగ్రీవం అయ్యాయని, మిగతా చోట్ల పోలింగ్ నిర్వహించి, ఫలితాలను వెల్లడించామని తెలిపారు. 50 శాతం మంది మహిళలు, బలహీన వర్గాలకు చెందిన వారు విజయం సాధించారని అన్నారు. 10,890 మంది సర్పంచ్ లు నేరుగా ఎన్నికయ్యారని నిమ్మగడ్డ పేర్కొన్నారు.
సాధారణ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలకు ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన వచ్చిందని, 80 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం శుభ పరిణామమని ఆయన అన్నారు. పట్టణ ప్రాంతాల్లోని ఓటర్ల నుంచి ఇదే విధమైన స్పందన వస్తుందని భావిస్తున్నట్టు నిమ్మగడ్డ పేర్కొన్నారు.
ఓటు వేయడం తమ సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు. మునిసిపల్ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ స్లిప్ ల పంపిణీని నేడో, రేపో ప్రారంభించనున్నామని, ప్రతి ఒక్కరికీ కనీసం రెండు, మూడు రోజుల ముందుగానే స్లిప్ లను అందిస్తామని హామీ ఇచ్చారు.
గతంలో ఉన్న పోలింగ్ కేంద్రాల్లోనే ఇప్పుడు కూడా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, అందరికీ తెలిసిన ప్రాంతాల్లోనే ఇవి ఉంటాయి కాబట్టి, పట్టణ ఓటర్లు తమ వంతు బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని నిమ్మగడ్డ కోరారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యఎప్పుడైనా వచ్చి ఓటేసి వెళ్లాలని అన్నారు.