AP MCL Polls 2023: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు, ఓటు హక్కును వినియోగించుకున్న 172 మంది ఎమ్మెల్యేలు, బలం లేకున్నా అభ్యర్థులను నిలిపిన టీడీపీ
వెలగపూడిలోని తాత్కాలిక శాసనసభ ప్రాంగణంలో పోలింగ్ జరుగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటివరకు 172 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Amaravati, Mar 23: ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఉదయం 9 గంటలకు పోలింగ్ (AP MCL Polls 2023) ప్రారంభమైంది. వెలగపూడిలోని తాత్కాలిక శాసనసభ ప్రాంగణంలో పోలింగ్ జరుగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటివరకు 172 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరో ముగురు ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సి ఉంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.అనంతరం ఐదు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. తదుపరి ఫలితాలు ప్రకటిస్తారు.
రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరు ప్రసాదరాజు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.మంత్రులు బూడి ముత్యాల నాయుడు, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ విప్ కర్ణం ధర్మశ్రీ, ఎమ్మెల్యే కోన రఘుపతి తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 175. ఇందులో వైఎస్సార్‌సీపీకి 151 మంది సభ్యులు ఉండగా.. టీడీపీకి అధికారికంగా 23 మంది, జనసేనకు ఒకరు ఉన్నారు. అయితే కొన్నాళ్లుగా నలుగురు సభ్యులు టీడీపీకి దూరంగా ఉంటున్నారు. దీంతో టీడీపీకి 19 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. అలాగే జనసేనకు ఉన్న ఒక సభ్యుడు కూడా ఆ పార్టీకి దూరమయ్యారు. ఒక్కో ఎమ్మెల్సీ గెలుపొందడానికి 22 మంది సభ్యుల ఓట్లు అవసరం.
వైఎస్సార్‌సీపీకి స్పష్టమైన ఆధిక్యత ఉన్న నేపథ్యంలో ఏడు స్థానాలకు అభ్యర్థులను (MLA quota MLC seats) బరిలో దించింది. ఒక్క స్థానం గెలవడానికి కూడా టీడీపీకి బలం లేదు. అయినా సరే అభ్యర్థిని బరిలోకి దింపడం ఆసక్తిని రేపుతోంది. వైఎస్సార్‌సీపీలో పనితీరు ఆధారంగా కొంతమంది ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కే అవకాశం లేదని అంచనా. ఈ నేపథ్యంలో అలాంటి వారి మద్దతు కోసం టీడీపీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.