AP Panchayat Elections 2021: ఏపీలో ముగిసిన తొలి దశ పోలింగ్, క్యూలైన్‌లో ఉన్నవారికి సాయంత్రం 4గంటల వరకు ఓటు హక్కు వినియోగించే అవకాశం, మొదలైన ఓట్ల లెక్కింపు
12 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్లలో తొలిదశ పోలింగ్ జరిగింది. కాగా సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఫలితాల వెల్లడి అనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక జరగనుంది.
Amaravati, Feb 9: ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 12 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్లలో తొలిదశ పోలింగ్ జరిగింది. కాగా సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఫలితాల వెల్లడి అనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక జరగనుంది. క్యూలైన్‌లో ఉన్నవారికి సాయంత్రం 4గంటల వరకు ఓటు హక్కు వినియోగించే అవకాశం కల్పించనున్నారు. కాగా మధ్యాహ్నం 12:30 గంటల వరకు 62 శాతం పోలింగ్ నమోదయ్యింది. మద్యాహ్నం 2.30 గంటల వరకు 75.55 శాతం పోలింగ్ నమోదైంది.
కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారి గిరిజా శంకర్ పర్యవేక్షిస్తున్నారు. సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. సుమారు 7 వేల కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో (AP Panchayat Elections 2021) తొలిసారిగా ‘నోటా’ను అందుబాటులోకి తెచ్చారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు జరగనుంది. కరోనా పాజిటివ్ బాధితులకు పీపీఈ కిట్లతో చివరిలో గంటసేపు అవకాశం కల్పించనున్నారు. విజయనగరం మినహా మిగిలిన 12 జిల్లాల పరిధిలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.
చిత్తూరు జిల్లా ఎస్ఆర్‌పురం మండలం కొత్తపల్లి సర్పంచ్ అభ్యర్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాలెట్ బాక్స్‌లో టీడీపీ మద్దతు దారుడు, సర్పంచ్ అభ్యర్ధి రమేష్ నీళ్లు పోయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలింగ్ నిలిచిపోయింది. ఇక గుంటూరు జిల్లా కాకుమాను మండలం గరికపాడులో గుండెనొప్పితో ఏజెంట్ నూర్ బాషా మృతి చెందాడు. గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయన మృతిచెందారు. వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలంలో ఓటర్లను టీడీపీ నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారు. మహిళలకు ముక్కుపుడకలు పంపిణీ చేస్తున్న టీడీపీ నేతలను పోలీసులు పట్టుకున్నారు. వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.