AP Panchayat Elections 2021: టీడీపీ నేత పట్టాభిపై దాడి, అక్కడ అసలేం జరిగింది? కొడాలి నాని హస్తం ఉందంటున్న టీడీపీ నేతలు, తీవ్రంగా ఖండించిన కొడాలి నాని, ఎంతమందిని చంపుతారంటూ చంద్రబాబు ఫైర్, ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి తన ఇంటి నుంచి కార్యాలయానికి బయల్దేరగానే రాడ్లతో ఆయన కారును దుండగులు ధ్వంసం చేశారు. దీంతో కారులో ఉన్న పట్టాభికి కూడా గాయాలయ్యాయి.
Amaravati, Feb 2: టీడీపీ నేత పట్టాభి రామ్‌పై విజయవాడలో దాదాపు 10 మంది దుండగులు దాడికి పాల్పడ్డారు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి తన ఇంటి నుంచి కార్యాలయానికి బయల్దేరగానే రాడ్లతో ఆయన కారును దుండగులు ధ్వంసం చేశారు. దీంతో కారులో ఉన్న పట్టాభికి (Kommareddy Pattabhi Ram) కూడా గాయాలయ్యాయి. దుండగులు రాడ్‌లతో దాడి చేశారని (TDP leader Pattabhi Ram attacked) పట్టాభి తెలిపారు. అలాగే, తన డ్రైవర్‌ను కూడా వారు గాయపరిచారని తెలిపారు. దాడులు చేసినప్పటికీ, భయపడనని, ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటానని చెప్పారు.
తనపై జరిగిన దాడి పట్ల డీజీపీ వచ్చి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 6 నెలల క్రితం కూడా తన కారుపై దాడి జరిగిందని, అయినప్పటికీ ఆ దాడిపై ఇప్పటికీ చర్యలు లేవని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలను బయటపెడుతున్నందుకే తనపై దాడులు చేస్తున్నారని పట్టాభి అంటున్నారు. ఏపీలో శాంతిభద్రలు ఎలా దిగజారిపోయాయో ప్రజలు ఆలోచించుకోవాలని ఆయన చెప్పారు. వైసీపీ నేతలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.
తనపై దాడిపై పట్టాభి ఏమంటున్నారు: ఇదిలా ఉంటే జడ్జిలు కూడా నివాసం ఉంటున్న హై సెక్యూరిటీ జోన్ లో ఆయన కారును చుట్టుముట్టిన కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. కారు అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. ఆయన సెల్ ఫోన్ కూడా ధ్వంసమయింది. ప్రస్తుతం ఆయన తన నివాసంలోనే ఉన్నారు. డీజీపీ లేదా పోలీస్ కమిషనర్ వచ్చి, తనకు సమాధానం చెప్పేంత వరకు తాను ఇక్కడ నుంచి కదలనని ఆయన చెప్పారు.
Here's Update
ప్రభుత్వంలో జరుగుతున్న కుంభకోణాలను బయటపెడుతున్నందునే తనను టార్గెట్ చేశారని తెలిపారు. గత 10 రోజులుగా తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పారు. ఈ విషయాన్ని మీడియా ముఖంగా తెలిపినా, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. హైకోర్టు జడ్జిలు, ప్రముఖులు ఉండే ప్రాంతంలో తనపై దాడి జరిగిందని... రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో ఈ ఘటన తెలియజేస్తోందని అన్నారు.
అధికార పార్టీకి పోలీస్ వ్యవస్థ లొంగిపోయి పని చేస్తోందని పట్టాభి ఆరోపించారు. ఈ దాడి వెనుక మంత్రి కొడాలి నాని హస్తం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంట్లో కొడాలి నానితో పాటు మరికొందరు సమావేశమై చర్చించారని చెప్పారు. రౌడీయిజం చేస్తూ వైసీపీ నేతలు జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఒక పథకం ప్రకారమే తనపై హత్యాయత్నం జరిగిందని అన్నారు. ఇలాంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి జగన్ కు చెపుతున్నానని అన్నారు.
పట్టాభి ఇంటికి చంద్రబాబు: ఈ ఘటన గురించి తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. విజయవాడలోని గురునానక్ నగర్‌లో ఉన్న పట్టాభి ఇంటికి చేరుకున్నారు. పట్టాభిని పరామర్శించి, ఆయనకు తగిలిన గాయాలను పరిశీలించారు. తనపై జరిగిన దాడి గురించి చంద్రబాబుకు పట్టాభి వివరించి చెప్పారు. ఆ సమయంలో పట్టాభి మంచంపైనే పడుకుని ఉన్నారు. పట్టాభి ఇంటికి దేవినేని ఉమా మహేశ్వరరావు, బోండా ఉమా మహేశ్వరరావుతో పాటు పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పరామర్శించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి, ఓ మంత్రి, ఇంకొంత మంది రౌడీలు రెచ్చిపోతున్నాను. వైసీపీ నేతలు గూండాలుగా తయారైపోయారు. వారికి కళ్లు నెత్తికెక్కి ఏమైనా చేయగలమని భావిస్తున్నారు. కొంత మంది కలిసి ఓ పథకం కూడా వేశారు. పట్టాభిపై దాడికి ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలి' అని చంద్రబాబు నాయుడు అన్నారు. 'ప్రభుత్వ అవినీతిని పట్టాభి ప్రశ్నిస్తున్నారు అందుకే ఆయనపై దాడులకు పాల్పడ్డారు. వైసీపీ నేతలు బరి తెగించి దాడులు చేస్తున్నారు. పట్టాభిని చంపాలనే దాడి చేశారు. ఇంతకు ముందు కూడా పట్టాభిపై దాడి జరిగింది. ఈ కాలనీలో ప్రతి ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి' అని చంద్రబాబు నాయుడు అన్నారు. దీన్ని బట్టి ఆ ప్రాంతంలో దాడులు అధికంగా జరుగుతున్నాయని తెలుసుకోవచ్చు
దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఓ వైపు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారు. ఇక్కడ పట్టాభిపై దాడి చేశారు. ప్రజాస్వామ్యంపై దాడి అంటే ఇది ప్రజలపై దాడి. ప్రజల కోసం పోరాడుతోన్న వారిపై దాడులు చేస్తారా? ఎంత మందిని చంపుతారు? చంపేస్తారా అందర్నీ? చంపండి చూస్తాం. ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండండి' అని చంద్రబాబు నాయుడు చెప్పారు. మీ బూతు మంత్రులకు చెప్పుకో జగన్.. ఇటువంటివి జరిగితే చూస్తూ ఊరుకోబోము. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా ఇటువంటి దాడులు జరిగాయా? మా నేతలు ఎవరైనా తప్పుగా మాట్లాడితేనే నేను వారిని కంట్రోల్ చేసేవాడిని. గతంలో టీడీపీ నేతలపై దాడులు జరిగితే డీజీపీ సరైన రీతిలో స్పందిస్తే ఇప్పుడు మళ్లీ దాడి జరిగేవి కాదు' అని చంద్రబాబు నాయుడు చెప్పారు.
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు: ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు దాడి దృశ్యాలను గుర్తించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. కారులో ఉన్న పట్టాభిపై నాలుగు వైపుల నుంచి దుండగులు దాడి చేశారని వారు గుర్తించినట్లు తెలిసింది. అనంతరం బైకులపై వారంతా అక్కడి నుంచి పారిపోయారని వారు తెలుసుకున్నారు. కాగా, పట్టాభిపై దాడి జరిగినట్టు తమకు ఉదయం 11 గంటలకు సమాచారం అందిందని పోలీసులు మీడియాకు తెలిపారు. దీంతో వెంటనే పట్టాభి ఇంటికి వచ్చామని చెప్పారు. పట్టాభి టీడీపీ కార్యాలయానికి వెళ్తుండగా ఈ దాడి జరిగిందన్నారు. దాదాపు 15 మంది దాడిలో పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
టీడీపీ నేత బోడె ప్రసాద్ : ఈ దాడిపై టీడీపీ నేత బోడె ప్రసాద్ మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. పది రోజుల క్రితం మంత్రి కొడాలి నాని విజయవాడలోని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంట్లో కొక్కిలిగడ్డ జాన్, పండు సహా మరో పది మందితో మీటింగ్ పెట్టాడని... పట్టాభిపై దాడి చేయాలని ఆ సమావేశంలో ప్లాన్ వేశారని చెప్పారు. ఈ విషయాన్ని ఆ మీటింగ్ లో పాల్గొన్న ఒక వ్యక్తి తనకు సమాచారమిచ్చాడని, వెంటనే పట్టాభిని తాను అప్రమత్తం చేశానని, హత్య చేసే అవకాశం కూడా ఉందని చెప్పానని తెలిపారు. ఇదే సమయంలో కొడాలి నానికి బోడె ప్రసాద్ సవాల్ విసిరారు. ఆడతనంతో వచ్చి దాడి చేయడం కాదని, దమ్ముంటే పది మంది ఉన్నప్పుడు వచ్చి దాడి చేయాలని అన్నారు. ఈ దాడికి కొడాలి నానే కారణమని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను హింస ద్వారా ప్రజలను భయపెట్టి అడ్డుకోవాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారని విమర్శించారు.
సీఎం జగన్ నివాస ముట్టడికి టీడీపీ ప్రయత్నం: విజయవాడలో దుండగుల దాడిలో ధ్వంసమైన కారుతో సహా టీడీపీ నేతలు సీఎం జగన్ నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. తనపై జరిగిన దాడి పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేసిన పట్టాభి, ఇతర టీడీపీ నేతలు సీఎంను కలిసి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, వారిని పట్టాభి నివాసం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. వారు సీఎం నివాసం వెపు వెళ్లకుండా నిలువరించే ప్రయత్నం చేశారు. దాంతో టీడీపీ నేతలకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. అక్కడ టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉండడంతో, పోలీసు బలగాలను కూడా భారీగా మోహరించారు. పట్టాభిరామ్ నివాసానికి వచ్చినవారిలో బుద్ధా వెంకన్న, బోండా ఉమ, బోడే ప్రసాద్, గద్దె రామ్మోహన్ తదితరులున్నారు.
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి : ఈ ఘటనపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి మండిపడ్డారు. టీడీపీ నేత పట్టాభిపై గూండాల దాడి గర్హనీయమని అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న భయానక పరిస్థితికి, దిగజారిన శాంతిభద్రతలకు ఈ దాడి నిదర్శనమని చెప్పారు. ఈ దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికలు జరుగుతున్న ఈ సమయంలో విపక్ష నేతలకు పోలీసులు తగిన భద్రతను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వంపై కూడా సుజనా చౌదరి విమర్శలు గుప్పించారు. ప్రత్యేక ప్యాకేజీలో ఏపీకి ప్రకటించిన రూ. 20 వేల కోట్లను తీసుకురావడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు.
మంత్రి కొడాలి నాని: ఇదిలా ఉంటే తనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మంత్రి కొడాలి నాని దానికి దీటుగా బదులిచ్చే ప్రయత్నం చేశారు. చంద్రబాబునాయుడు బతుకే అబద్ధాల బతుకు అని విమర్శించారు. శవరాజకీయాలకు చంద్రబాబు దిట్ట అని పేర్కొన్నారు. నాడు ఎన్టీఆర్ పై మల్లెల పద్మనాభంతో దాడి చేయించి దాన్ని తన రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడేలా వ్యూహం పన్నిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు.
తన పిల్లలను తానే ఆరగించే పాము లాంటి వాడు చంద్రబాబు అని, టీడీపీలో క్రియాశీలకంగా ఉన్నవాళ్లు ఈ విషయం గుర్తెరగాలని కొడాలి నాని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని ప్రజల్ని నమ్మించేందుకు చంద్రబాబే ఇలాంటి దాడులు చేయిస్తుంటాడని అన్నారు. దాడి చేసిన వెంటనే గంటలోనే బాధితుల వద్ద కూర్చుని మొసలి కన్నీరు కార్చుతుంటాడని విమర్శించారు. ఇది కేవలం పబ్లిసిటీ కోసం చేసిన ఎత్తుగడ అని, చంద్రబాబు, పట్టాభి కలిసి ఆడిన డ్రామా అని ఆరోపించారు.