AP PGECET Results 2021: ఏపీ పీజీసెట్‌ ఫలితాలు విడుదల, పీజీ సెట్‌లో 87.62 శాతం మంది అర్హత, అనంతపురంలో కాలేజీ ఘటనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

ఈ కార్యక్రమానికి ఉన్నత విద్యామండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి, వైస్‌ చైర్మన్‌ రామ్మోహనరావు, యోగివేమన యూనివర్శిటీ వీసీ సూర్యకళావతి హాజరయ్యారు.

AP Education Minister Adimulapu Suresh (Photo-ANI)

ఏపీ పీజీసెట్‌ ఫలితాలను విద్యాశాఖమంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ మంగళవారం విడుదల (AP PGECET Results 2021) చేశారు. ఈ కార్యక్రమానికి ఉన్నత విద్యామండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి, వైస్‌ చైర్మన్‌ రామ్మోహనరావు, యోగివేమన యూనివర్శిటీ వీసీ సూర్యకళావతి హాజరయ్యారు. తొలిసారి అన్ని యూనివర్శిటీలలో ప్రవేశానికి ఉన్నత విద్యామండలి ఒకే పీజీ సెట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్‌ (adimulapu suresh) మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలో పీజీ ప్రవేశాలకి ఒకే సెట్ మొదటిసారిగా నిర్వహించాం.

ఆన్‌లైన్ లో నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలని రెండు వారాలలో ప్రకటించాము. పీజీ ప్రవేశాలకి 39,856 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రవేశ పరీక్షకి 35,573 మంది హాజరుకాగా 24,164 మంది అర్హత సాధించారు. పీజీ సెట్‌లో 87.62 శాతం మంది అర్హత సాధించారు. గతంలో అన్ని యూనివర్సిటీలకి ఒకే ప్రవేశ పరీక్ష ఉండకపోవడం వల్ల విద్యార్ధులకి అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ ప్రవేశ పరీక్ష వల్ల అర్హత సాధించిన విద్యార్ధులు తమకు ఇష్ణమైన కోర్సులలో నచ్చిన యూనివర్సిటీలో చేరవచ్చని మంత్రి తెలిపారు.

నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో ముగిసిన ఏపీ సీఎం జగన్ భేటీ, జల సమస్యల పరిష్కారానికి జాయింట్‌ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం

అనంతపురంలో కాలేజీ ఘటనపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మండిపడ్డారు. విద్యార్థుల ధర్నాలో కొందరు దుండుగులు చొరబడ్డారన్నారు.  పోలీసులపై రాళ్లు రువ్వి విద్యార్థిని గాయపర్చారన్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారని వివరించారు. కొన్ని రాజకీయ పార్టీలు వీటిపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. అవాస్తవ ప్రచారానికి కొన్ని మీడియా సంస్థలు మద్దతు పలుకుతున్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యార్థుల తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. విద్యార్థినిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసులు లాఠీచార్జ్‌ చేయలేదంటూ బాధిత విద్యార్థినే చెబుతోందని మంత్రి అన్నారు. దుండగులు వేసిన రాళ్ల దాడిలోనే విద్యార్థిని గాయపడిందన్నారు. రాష్ట్రంలో ఎయిడెడ్‌ విద్యాసంస్థల పనితీరుపై కమిటీ వేశామని.. కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆదిమూలపు పేర్కొన్నారు.