CM YS Jagan Mohan Reddy meet Odisha CM Naveen Patnaik (Photo-AP CMO/Twitter)

Amaravati, Nov 9: ఒడిశాతో దశాబ్దాలుగా నెలకొన్న జల, సరిహద్దు వివాదాలకు పరిష్కారం కోసం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ (CM YS Jagan meet Odisha CM Naveen Patnaik ) ముగిసింది. ఒడిశా సచివాలయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. ఈ భేటీలో మూడు అంశాలపై ఒడిశా సీఎంతో సీఎం వైఎస్‌ జగన్‌ (Andhra Pradesh CM YS Jagan Mohan Reddy) చర్చించారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి జాయింట్‌ కమిటీ వేయాలని నిర్ణయించారు.

ఇరు రాష్ట్రాల చీఫ్‌ సెక్రటరీలతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఒడిశా అభ్యంతరాలతో అనేక దశాబ్దాలుగా అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలపై ఈ భేటీలో చర్చించారు. వంశధార నదిపై నేరేడి బ్యారేజీ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం వైఎస్‌ జగన్‌.. ఈ భేటీలో నవీన్ పట్నాయక్‌తో (Odisha CM Naveen Patnaik) చర్చించారు. పోలవరం ప్రాజెక్ట్‌ ముంపు గ్రామాల సమస్యపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించారు.

బహుదానది నీటి విడుదలపై కూడా ముఖ్యమంత్రులు ఈ భేటీలో చర్చించారు. ఇంధన రంగంలో బలిమెల, ఎగువ సీలేరు కోసం ఎన్‌వోసీ, యూనివర్శిటీల్లో ఒడిశా, తెలుగు భాషాభివృద్ధికి కృషి.. తీవ్రవాదం, గంజాయి నియంత్రణకు రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని నిర్ణయించారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్‌, ఇరిగేషన్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ శ్యామలరావు, రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రెటరీ ఉషా రాణి భేటీలో పాల్గొన్నారు.

25 ఏళ్ల పాటు రైతులకు పగటిపూట 9 గంటల పాటు విద్యుత్‌, సెకీతో ఒప్పందానికి రెడీ అవుతున్న ఏపీ ప్రభుత్వం, ఉచిత విద్యుత్‌కు ఎలాంటి ఢోకా ఉండదని తెలిపిన ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి

రెండు రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేసే నేరడి బ్యారేజీ నిర్మాణానికి మార్గం సుగమం చేయడంతోపాటు జంఝావతి రిజర్వాయర్‌ ముంపు సమస్యపై ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో భువనేశ్వర్‌లో ప్రత్యేకంగా చర్చలు జరపినట్లు సమాచారం. అలాగే వంశధారపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం, జంఝావతిపై కాంక్రీట్‌ డ్యామ్, కొఠియా గ్రామాల అంశాలు ఇరువురి సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

జంఝావతిపై రబ్బర్‌ డ్యామ్‌ స్థానంలో శాశ్వతంగా కాంక్రీట్‌ డ్యామ్‌ నిర్మాణం అంశాన్ని కూడా సమావేశంలో సీఎం జగన్‌ ప్రస్తావించినట్లు సమాచారం. ప్రస్తుతం రబ్బర్‌ డ్యాం ఆధారంగా 24,640 ఎకరాలకుగానూ కేవలం ఐదు వేల ఎకరాలకు మాత్రమే సాగు నీరు ఇవ్వగలుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నిర్మించడం వల్ల ఒడిశాలో 4 గ్రామాలు పూర్తిగా, 6 గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురవుతాయన్నారు. ఒడిశాలో దాదాపు 1,174 ఎకరాల భూమి ముంపునకు గురి కానుండగా ఇందులో 875 ఎకరాలు ప్రభుత్వ భూమేనని చెప్పారు. సహాయ, పునరావాస కార్యక్రమాలకు సహకరించాలని ఒడిశా ముఖ్యమంత్రిని సీఎం జగన్‌ కోరినట్లుగా తెలుస్తోంది.

శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను తక్షణమే అప్పగించండి, రెండు తెలుగు రాష్ట్రాలకు లేఖలు రాసిన కృష్ణా బోర్డు చైర్మన్‌ మహేంద్రప్రతాప్‌సింగ్‌, వీటితో పాటు నీటిని వాడుకునే 15 ప్రాజెక్టులను తమకు అప్పగించాలని లేఖలో వెల్లడి

ఈ పర్యటనకు ముందు కొఠియా గ్రామాల్లో ఇటీవల పరిణామాలు, వివాదం వివరాలను అధికారులు తాజాగా సీఎం జగన్‌కు తెలియచేశారు. 21 గ్రామాలకుగానూ 16 గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటామని తీర్మానాలు చేసినట్లు విజయనగరం కలెక్టర్‌ సూర్యకుమారి వివరించారు. ఇటీవల ఆయా గ్రామాల్లో ఎన్నికలు కూడా నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు. కొఠియా గ్రామాల్లో దాదాపు 87 శాతానికి పైగా గిరిజనులేనని, వారికి సేవలు అందించే విషయంలో అవాంతరాలు లేకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో సీఎస్‌ డాక్టర్‌ సమీర్శర్మ, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, జలవనరులశాఖ ఈఎన్‌సీ సి. నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు

అంతకు ముందు శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఎమ్మెల్యే రెడ్డిశాంతి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులను సీఎం వైఎస్‌ జగన్‌ ఆశీర్వదించారు. భువనేశ్వర్ పర్యటనలో భాగంగా విశాఖ వచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌ను విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో పలువురు ప్రజా ప్రతినిధులు కలిశారు. మంత్రి అవంతి శ్రీనివాస్‌తో పాటు విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు వివిధ అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అరకు ఎమ్మెల్యే శెట్టి పాల్గుణ ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దులోని గ్రామాల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.