AP Weather Forecast: ఏపీకి రెండు రోజుల పాటు భారీ వర్షాలు, విజయవాడ, విశాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఆదేశాలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడిన అల్పపీడనం తీవ్రత కొద్దిమేర తగ్గిందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Rainfall - Representational Image | Photo - PTI

వచ్చే రెండు రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురవనున్నట్లు అమరావతి వాతావరణశాఖ వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడిన అల్పపీడనం తీవ్రత కొద్దిమేర తగ్గిందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. అయితే కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న గంటలో విజయవాడ, విశాఖలో భారీవర్షం పడనున్నట్లు తెలిపింది.

కోస్తా జిల్లాలో భారీ వర్షాలు, మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళరాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక

మూడు గంటలపాటు ఏకధాటిగా వర్షం పడే అవకాశం ఉందని వెల్లడించింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని.. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో చెరువులు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దసరా రోజున కురిసిన వర్షంతో వివిధ ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. వర్షాల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.