Sajjala Rama Krishna Reddy: ఏపీలో బీజేపీని చూస్తే జాలేస్తోంది, మళ్లీ సీఎం అవుతానన్న భ్రమలో చంద్రబాబు ఉన్నారు, సీఎం వైఎస్ జగన్ టార్గెట్‌గా రాజకీయాలు చేస్తున్నారని మండిపడిన వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
టీడీపీ అనుబంధ విభాగం మాదిరి బీజేపీ సభ జరిగిందని ఆయన ఎద్దేవా చేశారు.
Amaravati, Dec 29: టీడీపీ అధినేత చంద్రబాబు అజెండానే బీజేపీ నేతల అజెండా అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Rama Krishna Reddy) విమర్శించారు. టీడీపీ అనుబంధ విభాగం మాదిరి బీజేపీ సభ జరిగిందని ఆయన ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు అజెండా ప్రకారమే రాష్ట్రంలో బీజేపీ (BJP) నడుస్తోందన్నారు. ఎక్కడైనా జాతీయ పార్టీతో కలిసి ప్రాంతీయ పార్టీలు పనిచేస్తాయి.
ఏపీలో మాత్రం రివర్స్ జరుగుతోంది. ప్రాంతీయ పార్టీతో జాతీయ పార్టీ పని చేస్తోంది. ఏపీ బీజేపీని (AP BJP) చూస్తుంటే జాలితో పాటు బాధ కలుగుతోందన్నారు. మళ్లీ సీఎం అవుతానన్న భ్రమలో చంద్రబాబు ఉన్నారు. అందుకే ఇప్పటి నుంచే పొత్తు ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ దిగజారుడు రాజకీయం చేస్తోంది. సొంత అజెండాతో బీజేపీ ఎందుకు పనిచేయడం లేదు. తన పార్టీ ఎంపీలు బీజేపీలో చేరితే టీడీపీ ఎందుకు ప్రశ్నించదు అని సజ్జల ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్ టార్గెట్‌గా రాజకీయాలు చేస్తున్నారు. ఆధారాలు లేని ఆరోపణలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాటలు ఆయనవేననీ.. స్ట్రిప్ట్ మాత్రం టీడీపీ కార్యాలయంలో తయారవుతోందని ఆరోపించారు.టీడీపీ, బీజేపీలకు సొంత అజెండా ఉండటం లేదన్నారు. ఇంత దిగజారుడుతనం ఎందుకో అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు. ''రాజధాని అమరావతి స్కాములమయం అని గతంలో బీజేపీ నేతలు అన్నారు. ఇప్పుడే ఆ పార్టీ నేతలే అధికారం అప్పగిస్తే మూడేళ్లలో రాజధాని నిర్మిస్తామని చెబుతున్నారు.
కర్నూలులో హైకోర్టు ఉండాలంటారు. విశాఖ వద్దు ఆ రెండు ప్రాంతాలే కావాలని చెప్పొచ్చు కదా. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదని బీజేపీ వాళ్లే అంటారు.. ఈ విషయంలో వైసీపీ ఎంపీలు ఏం చేస్తున్నారనీ వాళ్లే ప్రశ్నిస్తారు. ఆయా పార్టీలతో చంద్రబాబు విజయవంతంగా తోలుబొమ్మలాట ఆడిస్తున్నారు'' అని సజ్జల ఎద్దేవా చేశారు.