Accident in Prakasam: ప్రకాశంలో ఘోర ప్రమాదం.. సాగర్ కాలువలోకి దూసుకుపోయిన పెళ్లి బస్సు.. ఏడుగురు మృతి.. 15 మందికి తీవ్ర గాయాలు.. అతివేగమే ప్రమాదానికి కారణమని వెల్లడి
సోమవారం అర్ధరాత్రి పెళ్లి వారితో వెళుతున్న ఓ బస్సు సాగర్ కాలువలోకి దూసుకుపోయింది. పొదిలి నుంచి కాకినాడకు వెళ్తుండగా దర్శికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు.
Prakasam, July 11: ప్రకాశం జిల్లాలో (Prakasam District) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సోమవారం అర్ధరాత్రి పెళ్లి వారితో వెళుతున్న ఓ బస్సు సాగర్ కాలువలోకి (Sagar Canal) దూసుకుపోయింది. పొదిలి నుంచి కాకినాడకు (Kakinada) వెళ్తుండగా దర్శికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. మృతుల్లో ఏడేళ్ల చిన్నారి కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు. చిన్నారి మృతదేహం బస్సు కింద చిక్కుకుపోయినట్టు గుర్తించారు.
అతివేగమే కారణమా?
అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. కాలువ సమీపంలో స్పీడుగా వెళుతున్న బస్సు అదుపుతప్పి సైడ్ వాల్ కు ఢీకొట్టి చివరకు కాలువలోకి దూసుకుపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. వివాహం జరిగిన అనంతరం ఇతర కార్యక్రమాల కోసం వారు వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగినట్టు సమాచారం.