Jagan on Tirupati Laddu Dispute: మన తిరుమలను మనమే తక్కువ చేసుకుంటున్నాం, లడ్డూ వ్యవహారంపై స్పందించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇంకా ఏమన్నారంటే..
లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో కొవ్వు ఉందనేది ఒక కట్టు కథ అని కొట్టిపారేశారు.
Vjy, Sep 20: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన తిరుమల లడ్డూ వ్యవహారంపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో కొవ్వు ఉందనేది ఒక కట్టు కథ అని కొట్టిపారేశారు. దశాబ్దాలుగా జరుగుతున్న పద్దతుల్లోనే తిరుమలలో లడ్డూ తయారీ జరుగుతోందని అన్నారు. దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకునే దుర్మార్గమైన మనస్తత్వం చంద్రబాబుది అని విమర్శించారు. భక్తుల మనోభావాలతో ఆడుకోవడం ధర్మమేనా? అని ఆయన ప్రశ్నించారు.
ప్రతి 6 నెలలకు ఒకసారి నెయ్యి సరఫరా కోసం టెండర్లు పిలుస్తారని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే నెయ్యి శాంపిల్స్ తీసుకున్నారని, జులై 23న రిపోర్ట్ వస్తే ఇప్పుడు చంద్రబాబు మాట్లాడడం విడ్డూరం అని మండిపడ్డారు.ఎప్పటిలాగా ఒకే విధానంలో లడ్డూ తయారీ సామగ్రి కొనుగోలు ప్రక్రియ జరుగుతోందని చెప్పారు. నెయ్యి నాణ్యత నిర్ధారణ పరీక్ష విధానాలను ఎవరూ మార్చలేదని, ఇంత దుర్మార్గమైన పని ఎవరైనా చేయగలరా అని అన్నారు. ఒక సీఎం ఇలా అబద్ధాలు ఆడటం ధర్మామేనా అని జగన్ మండిపడ్డారు.
జులై 17న ఎన్‌డీడీబీకి నెయ్యి శాంపిల్స్ పంపించారని, జులై 23న రిజెక్ట్ చేస్తే చంద్రబాబు ఇప్పటివరకు ఏం చేశారు?. ఎందుకు బయటకు చెప్పలేదని ప్రశ్నించారు. జరగనిది జరిగినట్టు చంద్రబాబు చెబుతున్నారని జగన్ పేర్కొన్నారు. నెయ్యి తీసుకొచ్చే ప్రతి ట్యాంకర్ సర్టిఫికెట్ తీసుకోవాలని, ప్రతి ట్యాంక్ శాంపిళ్లను మూడుసార్లు టెస్ట్ చేస్తారని వివరించారు.అబద్ధాలను ప్రచారం చేయడం ద్వారా తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. మన తిరుమలను మనమే తక్కువ చేసుకుంటున్నామని అన్నారు. లడ్డూ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీకి, సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తులకు లేఖ రాస్తానని అన్నారు.
చంద్రబాబు నాయుడు వంద రోజుల పాలన అంతా మోసమేనని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు వంద రోజుల పాలనలో సూపర్ సిక్స్ లేదు.. సెవెనూ లేదంటూ విమర్శించారు వైఎస్ జగన్. చంద్రబాబు పాలనలో వ్యవస్థలన్నీ తిరోగమనంలో ఉన్నాయన్నారు. గోరు ముద్దు గాలికి ఎగిరిపోయిందని, ఆరోగ్య శ్రీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయనే విషయాన్ని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటివరకూ వసతి దీవెన, విద్యా దీవెను కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. 108, 104 ఉద్యోగులకు ఇప్పటివరకూ జీతాలు ఇవ్వలేని పరిస్థితి దాపురించిందన్నారు. చంద్రబాబు సూపర్ సిక్స్ అంటూ ప్రజల జీవితాలతో ఆటలాడరని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.