Clash Between Hijras: ఉలిగమ్మ ఉత్సవంలో హిజ్రాల మధ్య గొడవ, పోలీస్ స్టేషన్‌కి చేరిన పంచాయితీ, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన పోలీసులు, అనంతపురంలో ఘటన
రాయలసీమ – బెంగళూరు హిజ్రాల మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదం (Clash Between Hijras) పెద్దది కావడంతో పోలీస్ స్టేషన్ వరకు చేరింది.
Anantapur, July 31: అనంతపురంలో రెండు రాష్ట్రాల హిజ్రాల మధ్య గ్యాంగ్ వార్ టెన్షన్ రేపుతోంది. రాయలసీమ – బెంగళూరు హిజ్రాల మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదం (Clash Between Hijras) పెద్దది కావడంతో పోలీస్ స్టేషన్ వరకు చేరింది. ఈ ఘర్షణ ఘటన వివరాల్లోకెళితే.. అనంతపురంలోని జయమణెమ్మ కళ్యాణమంటపంలో మన విజయం ట్రాన్స్‌జెండర్ అసోసియేషన్ మయూరి ఆధ్వర్యంలో ఈ నెల 28న హిజ్రాలు ఉలిగమ్మ ఉత్సవం నిర్వహించారు.
వైఎస్సార్ కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, బళ్లారి ప్రాంతాల నుంచి దాదాపు 500 మంది హిజ్రాలతో పాటు హైదరాబాద్, కర్ణాటక నుంచి 120 మంది హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హిజ్రాలు తెలంగాణ యూనియనతో ఇక నుంచి కలిసి ఉండమని వాదించారు. హైదరాబాద్‌కు చెందిన సునితా నాయక్ అలియాస్ అక్తార్‌భాను ఆధ్వర్యంలో నడిచే సంఘానికి ఇకపై డబ్బులు చెల్లించకూడదని కర్ణాటక, ఏపీకి చెందిన హిజ్రాలు నిర్ణయించగా, హైదరాబాద్ హిజ్రాలు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలోనే మాటామాట పెరగడంతో వాదన చేసుకున్నారు. ఉత్సవం అనంతరం తమ స్వస్థలాలకు వెళ్లేందుకు హైదరాబాద్, కర్ణాటకకు చెందిన ఆశా, వీనా, ఆర్థన, గీతమ్మ తదితరులు అర్ధరాత్రి వేళ అనంతపురం శివారులోని తపోవనం వద్దకు చేరుకున్నారు.
అక్కడ కొద్దిసేపు వాదులాట జరగ్గా... అనంతపురం హిజ్రా రుక్సానా అలియాస్ శర్మాస్‌పై వారంతా దాడి (Clash Between Hijras in Anantapur) చేశారు. దీనికి నిరసనగా గురువారం కలెక్టరేట్ ముందు పలువురు హిజ్రాలు ఆందోళన చేపట్టారు. బంగారం, డబ్బులు లాక్కున్నారని, దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వన్‌టౌన్ సీఐ ప్రతాప్ రెడ్డి, టూటౌన్ సీఐ జాకీర్ హుస్సేన్ హిజ్రాలతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఆధిపత్య పోరుతోనే సమస్య తలెత్తిందని, విచారణ చేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని టూటౌన్ సీఐ జాకీర్ హుస్సేన్ తెలిపారు.
ఇక మరొక కథకం ప్రకారం.. అనంతపురంలో జరిగిన వేడుకల్లో హిజ్రాలు పాల్గొన్న సమయంలో రాయలసీమ హిజ్రాల బ్యాచ్ మధ్య మంచి ఐఖ్యత ఉన్నట్లు బెంగళూరు హిజ్రాలు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే వారి మధ్య గొడవ (Bangalore Hijras Vs Rayalaseema Hijras) సృష్టించాలని పథకం పన్ని రాయలసీమ బ్యాచ్ లోని హిజ్రాను కిడ్నాప్ చేశారు. ఈ విషయం రాయలసీమ బ్యాచ్ కి తెలియడంతో ప్రతీకారంగా బెంగళూరు బ్యాచ్ హిజ్రాలలో ఒకరిని కిడ్నాప్ చేశారు. దీంతో రెండు బ్యాచ్ లమధ్య ఘర్షణ జరిగింది.
ఈ సమయంలోనే రాయలసీమ బ్యాచ్‌కు చెందిన ఒకరిపై అటాక్ చేసిన బెంగళూరు గ్యాంగ్ నగలు, డబ్బుతో ఉడాయించింది. దీంతో ప్రస్టేజ్‌గా తీసుకున్న రాయలసీమ బ్యాచ్ అనంతపురం కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు సిద్దమైంది. తమ వైపు వాళ్లను వదిలితే, మీ వైపు వాళ్లను వదులుతామంటూ ఇరు వర్గాలు పరస్పరం డీల్ కుదుర్చునేందుకు మంతనాలు జరుపుతున్నాయి. వీరి వివాదం పెద్దది కావడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఇరు వర్గాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.