Day Time Curfew in AP: ఏపీలో మే 5 నుంచి డే కర్ప్యూ, రెండు వారాల పాటు కర్ఫ్యూ అమల్లోకి, ఉదయం 6 నుంచి 12 గంటల వరకే వ్యాపార కార్యకలాపాలు
రాష్ట్రంలో ఈ నెల 5 నుంచి పాక్షిక కర్ఫ్యూ (Daytime Curfew in AP) విధిస్తున్నట్లు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే దుకాణాలకు అనుమతి ఇచ్చింది.
Amaravati, May 3: కరోనా నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఈ నెల 5 నుంచి పాక్షిక కర్ఫ్యూ (Daytime Curfew in AP) విధిస్తున్నట్లు ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే దుకాణాలకు అనుమతి ఇచ్చింది. అత్యవసర సేవలకు కర్ఫ్యూ నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు 144 సెక్షన్ అమలు కానుంది. రెండు వారాల పాటు కర్ఫ్యూ (Daytime Curfew In Andhra Pradesh) కొనసాగనుంది.
సోమవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం రాష్ట్రంలో పగటి పూట కర్ఫ్యూ అమలు చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. కాగా రాష్ట్రంలో ఉదయం 6 నుంచి 12 గంటలవరకు యధావిధిగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని… మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని చెప్పారు. సామాన్య ప్రజలకు ఇబ్బందిలేకుండా.. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా కర్ఫ్యూ అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎంజగన్ అధికారులతో సమీక్షించారని ఆళ్లనాని చెప్పారు.
ఇదిలా ఉంటే ఏపీలో కరోనా నిర్ధారణ పరీక్షల్లో రికార్డు నమోదైంది. ఎనిమిది రోజుల కిందట రోజుకు 50 వేల వరకూ టెస్టులు చేస్తున్న పరిస్థితుల నుంచి తాజాగా ఆదివారం 1,14,299 టెస్టులు చేశారు. 2020 మార్చి నుంచి ఇప్పటివరకూ ఇవే అత్యధికం. రాష్ట్రంలో ఒకే రోజు 1,14,299 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. ఇందులో 23,920 మంది పాజిటివ్ కాగా, ఒకే రోజు 11,411 మంది రికవరీ అయ్యారు.
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 2,945 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రం మొత్తమ్మీద 83 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,66,02,873 నమూనాలను పరీక్షించారు. ఇందులో 11,45,022 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 9,93,708 మంది కోలుకోగా, 1,43,178 మంది చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య 8,136కు చేరింది.