New Delhi, May 3: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర సర్కారు తీసుకుంటున్న చర్యలు.. తీసుకోవాల్సిన చర్యలపై సుప్రీం కోర్టు ఎప్పటికప్పుడు విచారణ జరుపుతున్నది. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. వైరస్ మహమ్మారి కరోనా వ్యాప్తి కట్టడికై లాక్‌డౌన్ (Lockdown in India) విధించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు (Supreme Court to Centre, States) సూచించింది.
దీంతో పాటు పేషెంట్లకు ఆక్సిజన్ ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. కేంద్ర,రాష్ట్రాలు ఈ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలంటూ సుప్రీం కోర్టు పలు సూచనలు చేసింది. కోవిడ్ పేషెంట్లను ఆస్పత్రిలో చేర్చుకునే విషయమై వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు నిబంధనలు ఉన్నాయని, ఇలా కాకుండా దేశ వ్యాప్తంగా ఒకేరకమైన విధానం రూపొందించాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు రెండు వారాల గడువు విధిస్తున్నట్లు తెలిపింది.
కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నసమయంలో (curb second wave) సామూహిక సమావేశాలు, వేడుకలు అన్నింటిని కూడా బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకోవాలి. అలాగే దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఆక్సీజన్ నిల్వలు అధికంగా ఉండేల చర్యలు తీసుకోండి. కోవిడ్ కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి కనుక లాక్ డౌన్ పై కూడా ఆలోచిస్తే (Consider imposing lockdown) మంచిదని అత్యున్నత ధర్మాసనం సూచించింది. వైద్య సిబ్బందికి ఈ సమయంలో అన్ని వసతులు కల్పించాలి. అంతేకాదు వారి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలంటూ ఈ సందర్బంగా సుప్రీం కోర్టు సూచించింది.
సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో ప్రజా సంక్షేమం దృష్ట్యా త్వరితగతిన చర్యలు చేపట్టాలని సర్వోన్నత న్యాయస్థానం విజ్ఞప్తి చేసింది. అదే సమయంలో లాక్‌డౌన్ విధించినట్లయితే వలస కార్మికులు సహా ఇతర బడుగు జీవులు ఇబ్బందులు పడకుండా వారి కోసం తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. కాగా గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 3.68 లక్షల కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. 3 వేలకు పైగా కరోనా మరణాలు సంభవించాయి.