
Bengaluru, May 3: దేశంలో ఆక్సిజన్ సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ అందక పలువురు మృతి చెందారు. తాజాగా కర్ణాటకలోని ప్రభుత్వ ఆస్పత్రిలో 24 మంది రోగులు ఆక్సిజన్ అందక (Oxygen Crisis in Karnataka) మరణించారు. చామరాజనగర్ జిల్లా హాస్పిటల్‌లో రోగులు ఆక్సిజన్ కొరత, ఇతర కారణాలతో మృత్యువాత ( 24 Patients Dead in Chamarajanagar District Hospital) పడ్డారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు జిల్లా ఇన్‌చార్జి మంత్రి సురేష్‌కుమార్ తెలిపారు.
ఈ మరణాలపై నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు. సంఘటనపై సీఎం యడ్డ్యూరప్ప విచారం వ్యక్తం చేశారు. అలాగే కలెక్టర్‌తో మాట్లాడారు. ఈ క్రమంలో మంగళవారం అత్యవసర కేబినెట్ సమాశానికి పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా.. ఆదివారం 37,733 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. ఇప్పటి వరకు 16లక్షల కేసులు రికార్డయ్యాయి. మరో 217 మంది చనిపోయాగా.. మొత్తం 16,011 మంది చనిపోయారని ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇదిలా ఉంటే భారత్‌లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. నిన్న కొత్తగా 3,68,147 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 3,00,732 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,99,25,604కు చేరింది.
గడచిన 24 గంటల సమయంలో 3,417 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,18,959కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,62,93,003 మంది కోలుకున్నారు. 34,13,642 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 15,71,98,207 మందికి వ్యాక్సిన్లు వేశారు.