Cyclone Mandous: ఏపీని అల్లకల్లోలం చేసిన మాండౌస్ తుపాను.. నేడు కూడా వర్షాలు.. అధికారుల అలర్ట్.. ఇప్పటికే వేలాది ఎకరాల్లోని పంటలు వర్షంపాలు
ఈదురు గాలులకు తోడు భారీ వర్షం కురవడంతో దక్షిణ ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేల కూలాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. రహదారులపైకి నీళ్లు చేరడంతో చాలా చోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
Vijayawada, Dec 11: మాండౌస్ (Mandous) తుపాను (Cyclone) ధాటికి ఆంధ్రప్రదేశ్‌లోని (Andhrapradesh) పలు ప్రాంతాలు చిగురుటాకులా వణికిపోయాయి. ఈదురు గాలులకు తోడు భారీ వర్షం (Heavy Rain) కురవడంతో దక్షిణ ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు (Trees) నేల కూలాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. రహదారులపైకి నీళ్లు చేరడంతో చాలా చోట్ల వాహనాల రాకపోకలు (Traffic) నిలిచిపోయాయి. తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్ కడప, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. స్తంభాలు నేల కూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు జలాశయాలు నిండిపోవడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
శ్రీకాళహస్తి-తడ మార్గంలో సున్నపుకాల్వపై బస్సు ఇరుక్కుపోవడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను రక్షించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో హైదరాబాద్-రేణిగుంట-ఇండిగో విమానం రద్దయింది. తిరుమల ఘాట్ రోడ్డులో వృక్షాలు కూలడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిన్న మధ్యాహ్నం వరకు మెట్ల మార్గం వైపు నుంచి భక్తులను అనుమతించలేదు. బాపట్ల జిల్లా చీరాల వాడరేవుకు చెందిన ఏడుగురు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకుపోయారు.
తుపాను వల్ల పలు జిల్లాల్లోని వరి, అరటి, పత్తి, వేరుశనగ, మినుము, బొప్పాయి, మిరప సహా వేలాది ఎకరాల్లోని పంటలు ధ్వంసమయ్యాయి. కోస్తాలో ఇంకా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మాండౌస్ తుపాను నిన్న సాయంత్రానికి అల్పపీడనంగా బలహీనపడింది. దీని ప్రభావంతో నేడు కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తమిళనాడును తుపాను అతలాకుతలం చేసింది. పలు జిల్లాలో కురిసిన భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి.