VJY Dussehra Celebrations: భక్తిజన సంద్రమైన ఇంద్ర కీలాద్రి, విజయవాడలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు, వివిధ రూపాలలో దర్శనమివ్వనున్న అమ్మవారు, భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు
భక్తులతో ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. విజయవాడ దుర్గ గుడి సహా... అంతటా దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమయ్యీయి. ప్రత్యేక పూజలు, అభిషేకాలూ నిర్వహిస్తున్నారు. అమ్మవారికి కుంకుమ పూజ అంటే చాలా ఇష్టం. అందువల్ల అమ్మవారికి చాలా ఆలయాల్లో కుంకుమ పూజలు కూడా జరుపుతున్నారు.
Vijayawada, September 30: ఏపీలో దసర ఉత్సవాలు వైభవంగా ప్రారంభం అయ్యాయి. భక్తులతో ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. విజయవాడ దుర్గ గుడి సహా... అంతటా దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమయ్యీయి. ప్రత్యేక పూజలు, అభిషేకాలూ నిర్వహిస్తున్నారు. అమ్మవారికి కుంకుమ పూజ అంటే చాలా ఇష్టం. అందువల్ల అమ్మవారికి చాలా ఆలయాల్లో కుంకుమ పూజలు కూడా జరుపుతున్నారు. అమ్మవారి అన్ని రూపాలకూ ఈ కుంకుమ పూజ నిర్వహించడం ఆనవాయితీ. ఈ తొమ్మిది రోజులూ... అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు పెట్టిన తర్వాత... భక్తులకు ప్రసాదంగా పంచిపెడతారు. ఇక దసరా అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది విజయవాడలో ఇంద్రకీలాద్రి మీద వెలసిన అమ్మవారే.. ఈ గుడిలోని అమ్మవారు 10 రోజులు 10 అలంకారాలతో దర్శనమివ్వనున్నారు. ఇప్పటికే ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభోపేతంగా మొదలయ్యాయి. ఇంద్రకీలాద్రి పర్వతంపై దేవీ నవరాత్రి శోభ దేదీప్యమానంగా కనిపిస్తోంది.
ఇంద్రకీలాద్రిపై అమ్మవారు
స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి రూపంలో అమ్మవారు తొలిరోజు దర్శనమీయనున్నారు. శరన్నవరాత్రులలో భాగంగా అమ్మవారు తొలిరోజు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా, 30న బాలత్రిపురసుందరీదేవి, అక్టోబర్ 1న గాయత్రీ దేవి, 2న అన్నపూర్ణాదేవి, 3న లలితా త్రిపుర సుందరీ దేవి, 4న మహాలక్ష్మిదేవి, 5న సరస్వతీదేవి, 6న దుర్గాదేవి, 7న మహిషాసుర మర్ధినీదేవిగా చివరిరోజు రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు దర్శనమివ్వనున్నారు. తొలిరోజు కావడంతో తెల్లవారుజామునుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తొమ్మిదిరోజులపాటు భక్తులు నవరత్నమాలను వేసుకుంటారు. దీనినే భవానీ దీక్ష అంటారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసారు. ప్రతిరోజు ఉదయం 3గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం కొనసాగనుంది. కాగా అమ్మవారి దర్శనం విషయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు అధికారులు గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
రెండోరోజు నుంచి తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు. అక్టోబర్ 5 మూలా నక్షత్రం రోజున ఉదయం రెండు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం చేసుకునే అవకాశం ఉంది. మూలా నక్షత్రం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు సమర్పిస్తారు. కనకదుర్గానగర్‌లో ప్రసాదాల కౌంటర్లు, అర్జున వీధిలోని అన్నదాన భవనం వద్ద అన్నప్రసాద వితరణ, సీతమ్మవారి పాదాలు వద్ద కేశఖండనశాలను ఏర్పాటుచేశారు. వృద్ధులు, వికలాంగులకు ఉచిత వాహనాలను ఏర్పాటుచేశారు. కొండ దిగువన చెప్పుల స్టాండ్, క్లోక్ రూమ్ ఏర్పాటుచేశారు.
శ్రీశైలంలో దసరా ఉత్సవాలు
శ్రీశైలంలో శ్రీభ్రమరాంభికా మల్లికార్జునస్వామివారి ఆలయంలోనూ దసరా ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేషార్చనలు, ప్రత్యేక నవావరణార్చనలు, రుద్ర, చండీయాగాలు, అలంకారాలు, వాహన సేవలు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 7న రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి మంత్రులు పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. ఉత్సవాల చివరి రోజు విజయ దశమి నాడు సాయంత్రం ఆలయ పుష్కరిణిలో స్వామి, అమ్మవార్లకు తెప్పోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ కేఎస్ రామారావు తెలిపారు. ఆ తరువాత శమీ పూజతో ఉత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటుచేశారు. భక్తులు, యాత్రికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ప్రమాదాకు తావులేకుండా చూడాలని అధికారులు ఆదేశించారు.