Chittoor Road Accident: ఘోర రోడ్డు ప్రమాదాలు, ఎనిమిది మంది మృతి, చిత్తూరు జిల్లాలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు, నలుగురు అక్కడికక్కడే మృతి, అదిలాబాద్, నాగర్ కర్నూల్ జిల్లా రోడ్డు ప్రమాదాల్లో మరో నలుగురు మృతి
ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి కాణిపాకం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
Chittoor, Feb 18: ఏపీలో చిత్తూరు జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం (Chittoor Road Accident) చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి కాణిపాకం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో రెండేళ్ల చిన్నారి, ఓ మహిళ ఉన్నారు. విశాఖపట్నం నుంచి కాణిపాకం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు విశాఖ వాసులుగా గుర్తించారు. ఘటనలో తీవ్రంగా గాయపడ్డ కారు డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు.
ఇక తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకు వచ్చిన కారు మార్చాల సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు యువతులు ఉన్నారు. మృతులు మహబూబాబాద్‌కు చెందిన కిరణ్మయి (22), పిఎ పల్లికి చెందిన శిరీష (20), కొండమల్లే పల్లి అన్నేపక అరవింద్ (23) గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తిని ఆసుప్రతికి తరలించారు.
ఇంకో ఘటనలో...ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బైక్‌ను ట్రక్కు ఢీ కొట్టడంతో ఓ ఉపాధ్యాయురాలు అక్కడికక్కడే మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే..జైనథ్ మండలం చెక్‌పోస్ట్ వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు పద్మ మరణించారు. కాగా,వరుసగా మూడు రోజులుగా అక్కడ జరుగుతున్న ప్రమాదంలో ముగ్గురు మరణించారు.
జైనథ్‌లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న పద్మ ఈ రోజు ఉదయం ఆదిలాబాద్ నుంచి తన ద్విచక్రవాహనంపై విధులకు హాజరు కావడానికి వెళ్లారు. చెక్ పోస్ట్ వద్ద బారికేడ్లు ఉండడంతో అటువైపు నుంచి వస్తున్న ట్రక్కు టూవీలర్‌ను ఢీకొంది. దీంతో పద్మ అక్కడికక్కడే మృతి చెందింది. వరుస ప్రమాదాలు జరుగుతుండటంతో ఆగ్రహించిన స్థానికులు రోడ్డుపై బైఠాయించారు. ప్రమాదాలకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేశారు. పోలీసులు స్థానికులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపచేశారు.