Heavy Rains Hits Telugu States: భయపెడుతున్న భారీ వరదలు, రెండు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన భారీ వర్షాలు, నాగార్జునసాగర్ 10 గేట్లు ఎత్తివేత, పలుచోట్ల ప్రమాదకర స్థాయిలో నదులు
గత రెండు రోజుల నుండి విస్తారంగా కురుస్తున్న వర్షాలకు (Heavy Rains Hits Telugu States) నదులు, డ్యాములు నిండిపోయాయి. పలు చోట్ల వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. రాగల నాలుగైదు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశ ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ నిర్వాహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు (Minister K Kannababu) తెలిపారు.
Amaravati, Sep 26: తెలుగు రాష్ట్రాల్లో వానలు విస్తారంగా కురుస్తున్నాయి. గత రెండు రోజుల నుండి విస్తారంగా కురుస్తున్న వర్షాలకు (Heavy Rains Hits Telugu States) నదులు, డ్యాములు నిండిపోయాయి. పలు చోట్ల వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. రాగల నాలుగైదు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశ ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ నిర్వాహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు (Minister K Kannababu) తెలిపారు.
పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం , తూర్పు గోదావరి జిల్లాలలో ఒంటరి ప్రదేశాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కె. కన్నబాబు హెచ్చరించారు.
తెలంగాణను (Telangana) ఆనుకొని ఇంటీరియర్ కర్ణాటక మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడిన విషయం తెలిసిందే. ద్రోణి ప్రభావం కారణంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి అన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం దంచికొడుతోంది. రానున్న 24 గంటలు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తెలంగాణలో నిన్న సాయంత్రం ప్రారంభమైన వర్షం ఎడతెరపిలేకుండా పడుతున్నది. రంగారెడ్డి జిల్లా నందిగామలో అత్యధికంగా 18.3 సెం.మీ. వర్షపాతం నమోదయ్యింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో 17.9 సెం.మీ., రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో 15.5 సెం.మీ., రంగారెడ్డిలోని కోతూర్‌లో 14.3 సెం.మీ., ఫరూక్‌నగర్‌లో 14.3 సెం.మీ., వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరిలో 13.9 సెం.మీ., సూర్యాపేట జిల్లా నడిగూడెంలో 13.8 సెం.మీ., సిద్దిపేట జిల్లా వర్గల్‌లో 13.4 సెం.మీ., వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేటలో 13.3 సెం.మీ. వర్షపాతం నమోదయ్యింది.
ఇక రాజధాని హైదరాబాద్ మహానగరంలో శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన వాన ఇంకా కొనసాగుతూనే ఉన్నది. హయత్‌నగర్, రాజేంద్రనగర్, అత్తాపూర్, హిమాయత్‌సాగర్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, బాలానగర్, దుండిగల్, కొంపల్లి, ఎల్బీనగర్, ఉప్పల్, సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్, గండిపేట్, శంషాబాద్ విమానాశ్రయం ప్రాంతాల్లో ఎడతెరపిలేకుండా కురుస్తున్నది.
జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసిన తెలంగాణ సీఎం
భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ (TS CM KCR) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో పాటు జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం చెప్పారు. అధికారులెవరూ సెలవు తీసుకోవద్దని, లోతట్టు ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో అధికారులంతా హెడ్ క్వార్టర్స్‌లోనే ఉండాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులిచ్చారు.
వర్షాలు, వరదలు దృష్ట్యా అధికారులకు ప్రభుత్వం సెలవులు రద్దు చేస్తున్నట్లు సీఎస్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సీఎస్ సోమేశ్ కుమార్ సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. రానున్న 24 గంటలు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
అప్రమత్తంగా ఉండాలని కోరిన ఏపీ హోం మంత్రి
వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హోం, విపత్తు నిర్వహణ శాఖా మంత్రి మేకతోటి సుచరిత (Home minister sucharitha) సూచించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ రాగల రెండు రోజుల్లో పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపారు. అదే విధంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఈ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి సుచరిత సూచనలు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో జిల్లాల వారీగా వరదలను ఓ సారి చూస్తే...
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. చీరాల, కనిగిరి, అద్దంకిలో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. గిద్దలూరులో కురిసిన భారీ వర్షానికి పట్టణం సమీపం నుండి ప్రవహించే సగిలేరు వాగుకు ఉధృతంగా నీరు వచ్చి చేరుతోంది. వర్షపు నీటికి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణ రోడ్లు వాగులను తలపిస్తున్నాయి. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని రాచర్లలో అత్యధికంగా 20సెంటీమీటర్, గిద్దలూరులో 15.3 సెంటీమీటర్, అద్దంకిలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.
Updated by ANI
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడలో భారీ వర్షానికి చెరువ కట్ట తెగిపోయింది. దీంతో ఎస్టీ కాలనీలోని ఇళ్లలోకి చెరువు నీరు వచ్చి చేరుతోంది. అలాగే వాగు ఉధృతికి ఆర్టీసీ బస్సు ఒరిగింది. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రయాణికులను కాపాడారు. స్థానికులను అప్రమత్తం చేసిన పోలీసులు వాహనదారులకు అంతరాయం లేకుండా సహాయక చర్యలు చేపట్టారు.
బల్లికురవ మండలం అంబడిపూడి వద్ద రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి తూర్పు వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. వాగు ఉధృతికి ఇద్దరు విద్యార్థులు కొట్టుకుపోగా.. స్థానికులు ఒకరిని కాపాడారు. మరొకరు మృతి చెందారు. అంబడపూడి గ్రామానికి చెందిన 6వ తరగతి విద్యార్థి శ్రావణ్ కుమార్ మృతి చెందాడు. కంభం మండలంలోని రావిపాడు వద్ద గండ్లకమ్మవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాగులో ఒక ట్రాక్టర్ కొట్టుకుపోయింది. పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో ఏడుగురు ఉన్నట్టు సమాచారం.
గుంటూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. వినుకొండ, సీతయ్య నగర్‌లో వర్షానికి ఓ పెంకుటిల్లు కూలిపోయింది. రాజుపాలెం మండలం బలిజేపల్లి వద్ద ఎద్దు వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
కడప జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కడప నగరంలోని ఆర్టీసీ గ్యారేజిలో భారీగా వర్షపు నీరు వచ్చి చేరుకుంటోంది. అలాగే జిల్లాలోని కమలాపురం - ఖాజీపేట ప్రధాన రహదారిలో ఉన్న బ్రిడ్జిపై పాగేరు వంక పొంగి పొర్లుతోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రమాదకర స్థాయిలో బుగ్గ ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది. నాలుగు గేట్ల ద్వారా నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. బుగ్గవంక పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గత రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. బుగ్గవంక కాలువ పరివాహక, లోతట్టు ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పర్యటించారు.
ఏపీ రాజధాని గ్రామాల్లో శుక్రవారం రాత్రి ఎడతెరిపి లేని వర్షం కురిసింది. తుళ్లూరు మండలం పెదపరిమి వద్ద వాగు పొంగి పొర్లుతుండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. డెల్టా ప్రాంతంలో కుండపోత వాన కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పంట పొలాలు నీట మునిగాయి.
శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద
శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు మూడు గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 1,53,607 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,14,542 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 884.70 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలకు గాను.. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 213.8824 టీఎంసీలుగా నమోదు అయ్యింది. మరోవైపు కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
నాగార్జునసాగర్ 10 గేట్లు ఎత్తివేత
నాగార్జునసాగర్‌కు ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. ఎడతెరపి లేని వర్షాల కారణంగా ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలోని ప్రాజెక్టులన్నీ నిండు కుండల్లా మారాయి. దీంతో దిగువకు నీటిని వదులుతున్నారు. ఎగువ ప్రాజెక్టుల నుంచి విడుదల చేసే నీటికి తోడు వరద నీరు కూడా భారీగా వచ్చి చేరుతుండటంతో నాగార్జున సాగర్ కూడా నిండు కుండలా మారింది.
Updated by ANI
నాగార్జున సాగర్ మొత్తం పూర్తి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 589.30 అడుగులకు చేరింది. అదేవిధంగా సాగర్ మొత్తం నీటి నిలువ సామర్థ్యం కూడా 312.05 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిలువ 309.95 టీఎంసీలకు చేరుకున్నది. ఈ నేపథ్యంలో అధికారులు శనివారం డ్యామ్‌లోని 10 క్రస్ట్ గేట్లను ఐదు అడుగుల మేర పైకిఎత్తారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ దిగువకు పరుగులు తీస్తున్నది.
తెలంగాణ తాండూర్ నియోజకవర్గం పరిధిలో ఉన్న కాగ్నా నది ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. రహదారిపై నుంచి వరద నీరు పొంగిపొర్లుతోంది. ఈ క్రమంలో తాండూర్ - మహబూబ్‌నగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో వికారబాద్ జిల్లాలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షం నమోదయ్యింది. దీంతో కోట్‌పల్లి, శివసాగర్ చెరువు, సర్పంపల్లి, లక్నాపూర్ ప్రాజెక్టులు అలుగుపోస్తున్నాయి. దీంతో దిగువ గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఓ నిండు గర్భిణి ప్రసవం కోపం పడరాని పాట్లు పడింది.
రాష్ర్ట రాజధాని హైదరాబాద్‌ను వానలు ముంచెత్తాయి. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి భాగ్యనగరం తడిసి ముద్దైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. టోలిచౌకీ, మెహిదీపట్నం, గొల్కోండ ప్రాంతాల్లోని నివాసాల్లోకి వర్షపు నీరు చేరింది. ఈ క్రమంలో స్థానికులు అవస్థలు పడుతున్నారు. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హుస్సేన్ సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ట్యాంక్‌బండ్ ఎన్టీఆర్ మార్గ్ లో వర్షపు నీరు నిలవడంతో.. ప్రమాదవశాత్తు ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి కారులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. నగర వ్యాప్తంగా జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. భారీ వర్షాలతో సాగునీటి ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. దీంతో జలాశయాలన్నీ నీటితో తొణికిసలాడుతున్నాయి. మక్తల్ మండలం సంగంబండ చిట్టెం నర్సిరెడ్డి భీమా ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు అధికారులు.. 10 గేట్లు పూర్తిగా ఎత్తివేత దిగువన ఉన్న జూరాల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు.
భారీ వర్షాలతో రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వాగులు, కుంటలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. నందిగామ మండలంలోని అప్పరెడ్డి గూడ, నర్సప్పగూడ గ్రామాల్లో వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో సింబయాసిస్ యూనివర్సీటీతో పాటు పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా 50.3 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నందిగామ మండలంలో 189.0 మిల్లీమీటర్లు, ఫరూఖ్‌నగర్‌లో 150.0 మి.మీ.,కొత్తూరులో 148.0 మి.మీ., షాబాద్‌లో 135.5 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదయ్యింది. నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్న వానలతో రాష్ట్రంలోనే అత్యధికంగా నందిగామ మండలంలో 18.9 సెం.మీ. వర్షపాతం నమోదయ్యింది.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా చోట్ల రహదారుల నీళ్లు ప్రవహిస్తున్నాయి. రాకపోకలు ఆగిపోయాయి. మహబూబ్ నగర్- నవాబ్ పేట, వనపర్తి జిల్లా కొత్తకోట- ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబ్ నగర్ రాయచూరు ప్రధాన రహదారిపై భారీగా వర్షం నీరు నిలిచిపోవడం కొద్ది సేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో 13 గేట్లు ఎత్తి దిగువనకు 1.26లక్షల క్యూసెక్కుల నీటిని దిగువనకు వదులుతున్నారు. చిట్టెం నర్సిరెడ్డి సంగంబండ రిజర్వాయర్ నిండటంతో 10 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. మరోసారి కోయిల్ సాగర్ ప్రాజెక్టు నిండిపోవడంతో 5 గేట్లు ఎత్తి దిగువనకు నీటిని విడుదల చేస్తున్నారు. వనపర్తి జిల్లా మదనాపురం మండలం సరళాసాగర్ ప్రాజెక్టు 2ఉడ్ సైఫన్లు, 2ప్రైమరీ సైఫన్లు తెరుచుకోవడంతో భారీగా వరద నీరు దిగువనకు వెళ్తోంది.
మదనాపురం మారెడ్డిపల్లి వాగు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో మదనాపురం-ఆత్మకూరు పట్టణాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ధన్వాడ మండల కేంద్రంలో ఓ మట్టి మిద్దె కూలింది. వనపర్తి, కోస్గి, గద్వాల పట్టణాల్లో వర్షం ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లా కోయిల్ కొండ, నవాబ్ పేట, గండీడ్, హన్వాడ మండలంలోని వాగులు, వంకలు ఉధృతంగా పారుతుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దేవరకద్ర మండలం కౌకుంట్ల పెద్ద చెరువు పూర్తిగా నిండి అలుగు పారుతుండడంతో వాగు రోడ్డు పైకి ఎక్కి పాడుతుండగా కౌకుంట్ల,ఇస్సరం పల్లి గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జోగులాంబ గద్వాల జిల్లా నుంచి కర్ణాటకలోని రాయచూరు పట్టణానికి మళ్లీ రాకపోకలు నిలిచిపోయాయి. నందిన్నె వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టిరోడ్డు కొట్టుకుపోవడంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు ఆగిపోయాయి.
అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా వనపర్తి జిల్లాలో రాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో సరళా సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. అధికారులు ఈ ఉదయం నుంచి 2 ప్రైమింగ్, 4 హుడ్ సైఫన్ల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆటోమెటిక్ సైఫన్ సిస్టమ్ గేట్లు కలిగి ఉండటం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. అరుదైన ఈ వ్యవస్థ కలిగిన ప్రాజెక్టులలో సరళా సాగర్ ప్రపంచంలో రెండోది కాగా ఆసియా ఖండంలోనే మొట్టమొదటిది. సైఫన్లు తెరుచుకోవడంతో జలదృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు.