Amaravati, Sep 26: ఏపీలో ఈ నెలాఖరుతో మద్యం పాలసీ ముగుస్తున్నందున ప్రస్తుతమున్న 2,934 ప్రభుత్వ మద్యం దుకాణాలకు ఏడాది పాటు లైసెన్సు రెన్యువల్ (Excise Policy in Andhra Pradesh) చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నూతన ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది. ఈ పాలసీ అక్టోబర్ 1 నుంచి అమల్లోకి (New Excise Policy in AP) రానున్నది. ప్రస్తుతం ఏపీలో 2934 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాలన్నింటినీ మరో ఏడాది పాటు కొనసాగించాలని ప్రభుత్వం (AP Govt) నిర్ణయించింది.
ప్రతి ఏడాది 20 శాతం మద్యం దుకాణాలను తగ్గించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, లాక్ డౌన్ తర్వాత 13 శాతం దుకాణాలను తగ్గించడంతో... కొత్త పాలసీలో దుకాణాల ప్రస్తావనను తీసుకురాలేదు. ఆర్టీసీ బస్టాండ్, నంది సర్కిల్, లీలా మహల్ సెంటర్, విష్ణు నివాసం, శ్రీనివాసం తదితర ప్రాంతాల్లో కూడా లిక్కర్ అమ్మకాలపై నిషేధం విధించింది. మరోవైపు ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో రైల్వే స్టేషన్ నుంచి అలిపిరికి వెళ్లే మార్గంలో వైన్ షాపులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.
అదే సమయంలో మద్యపానంతో కలిగే దుష్పరిణామాలపై విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ శుక్రవారం జీవో జారీ చేశారు. గతేడాది అక్టోబర్ 1న ప్రకటించిన పాలసీలో ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రభుత్వమే రిటైల్ మద్యం దుకాణాలను నిర్వహించేలా ఏడాదికి లైసెన్సు జారీ చేశారు.
అప్పట్లో ఉన్న 4,380 షాపులను 33 శాతం తగ్గించడంతో ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలో 2,934 షాపులు నడుస్తున్నాయి. వీటికి వచ్చే ఏడాది సెప్టెంబర్ నెలాఖరు వరకు లైసెన్సులను జారీ చేస్తారు. ఏపీఎస్‌బీసీఎల్ ఆధ్వర్యంలో ఈ మద్యం షాపులు నడుస్తాయి. మద్యం షాపుల్లో ట్రాక్ అండ్ ట్రేస్ విధానం అమలయ్యేలా చూడాలి. దీనివల్ల అవకతవకలు జరగడానికి అవకాశం ఉండదు.