Heavy Rain Alert For AP: ఏపీకి భారీ వర్ష సూచన, రాబోయే నాలుగు రోజులు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ జిల్లాలకు అలర్ట్
దీని ప్రభావంతో ఈ నెల 14వ తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు
Vijayawada, OCT 12: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం (Air circulation) కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈ నెల 14వ తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 14 నుంచి 17 వరకు కొన్ని చోట్ల భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని తెలిపారు. భారీ వర్షసూచన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లకూ హోం మంత్రి అనిత (Anitha) ఆదేశాలు జారీ చేశారు. పోలీసు వ్యవస్థ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్‌లు ఏర్పాటు చేయాల్సిందిగా అధికార యంత్రాంగానికి ఆమె సూచనలు చేశారు. దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లా ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా బలహీనంగా ఉన్న కాలువ, చెరువు గట్లను పటిష్టం చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఏలూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, పల్నాడు, సత్యసాయి జిల్లాల కలెక్టర్లు కూడా అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
వాగులు పొంగే అవకాశమున్న ప్రాంతాల్లో రైతులు, గొర్రెల కాపరులు, మత్స్యకారులకు హెచ్చరిక జారీ చేయాలన్నారు. రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల శాఖ, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సమన్వయంతో ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఏదైనా సమస్య ఉంటే కంట్రోల్ రూమ్‌లోని టోల్ ఫ్రీ నంబర్లు 1070, 112, 1800-425-0101 ను సంప్రదించాలని సూచించారు.