'Hidden Cameras' in Girls' Washroom: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటన, విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు, మరింత ఉధృతంగా మారిన విద్యార్థుల ఆందోళన

Cm Chandrababu on Gudlavalleru engineering college Hidden Camera Incident (photo/X/FB)

Vjy, August 30: కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కాలేజీలో రహస్య కెమెరాలు పెట్టారనే అంశం ఏపీలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. జిల్లా అధికారులు, మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా ఎమ్మెల్యేలలను కళాశాలకు వెళ్లాలని ఆదేశించిన సీఎం.. అక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. కలెక్టర్‌, ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడి విచారణ సాగుతున్న విధానంపై ఆరా తీశారు.

విద్యార్థినుల ఆందోళన, ఆవేదనను పరిగణనలోకి తీసుకుని పటిష్ట దర్యాప్తు జరపాలని ఆదేశించారు. రహస్య కెమెరాల ద్వారా వీడియోల చిత్రీకరణ జరిగిందన్న విషయంలో.. నేరం రుజువైతే కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.విద్యార్థుల ఫిర్యాదును యాజమాన్యం నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణపైనా విచారణ జరపాలన్నారు. కాలేజీ యాజమాన్యం, అధికారుల అలసత్వం ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులు ఎవరూ అధైర్య పడొద్దని, తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఘటనపై విచారణకు సంబంధించి ప్రతి 3 గంటలకు ఒకసారి తనకు రిపోర్ట్ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

గుడివాడలో దారుణం, గర్ల్స్ హాస్టల్ వాష్‌ రూమ్‌లలో సీక్రెట్ కెమెరాలు, 100 వీడియోలను అమ్మిన దుర్మార్గులు!,లాంటి కెమెరాలు లేవని పోలీసుల వెల్లడి

గుడివాడలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వద్ద విద్యార్థుల ఆందోళన మరింత ఉధృతంగా మారింది. కాలేజీలోని బాలికల హాస్టల్‌లో వాష్ రూమ్స్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టారంటూ విద్యార్థులు రాత్రి నుంచి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. పోలీసుల జోక్యంతో కాస్త సద్దుమణిగినా.. తిరిగి ఇవాళ ఉదయం ఆందోళన ప్రారంభమైంది. తమకు న్యాయం చేయాలంటూ విద్యా్ర్థులు నినాదాలు చేస్తున్నారు.

వి వాంట్ జస్టిస్ అంటూ అంటూ ధర్నా చేస్తున్న విద్యార్థిని విద్యార్థులు స్లోగన్స్ ఇస్తున్నారు. అయితే గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో సీసీ కెమెరాలు ఎక్కడా కనిపించలేదంటూ ఇవాళ ఉదయం జిల్లా ఎస్పీ ఒక ప్రకటన జారీ చేశారు. దీనిపై విద్యార్థులే కాకుండా ఉపాధ్యాయ సంఘాలు సైతం మండిపడుతున్నాయి.

ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సైతం స్పందించారు. ఈ ఘటనను ఆయన ఖండించారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందవద్దని.. అన్ని విధాలుగా అండగా ఉంటానని ఎమ్మెల్యే రాము భరోసా ఇచ్చారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాము గురువారం రాత్రి కళాశాలలో జరిగి పరిణామాలపై తాజాగా స్పందించారు. కళాశాలలో విద్యార్థులు చేస్తున్న ఆరోపణలపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని ఆదేశించినట్లు ఎమ్మెల్యే రాము తెలిపారు.

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో అర్ధరాత్రి విద్యార్థినుల ఆందోళనపై మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) స్పందించారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. విద్యార్థినుల ఆందోళనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నానని... హిడెన్ కెమెరాల ఆరోపణలపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.‌ ఇటువంటి ఘటనలు కాలేజీల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చానన్నారు. కళాశాలల్లో ర్యాగింగ్, వేధింపులు లేకుండా యాజమాన్యాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని లోకేష్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు



సంబంధిత వార్తలు

CM Revanth Reddy: తెలంగాణలో ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవు..సినీ పెద్దలతో తేల్చిచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరోగా ఉండాలని సూచించిన తెలంగాణ సీఎం

CM Revanth Reddy: రూ.192 కోట్లతో మెదక్‌ జిల్లాలో అభివృద్ధి పనులు, ఏడుపాయల దుర్గా భవాని అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి, పలు శంకుస్థాపనలు

Tollywood Celebrities To Meet CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని క‌లువ‌నున్న అల్లు అర‌వింద్, చిరంజీవి ప‌లువురు ప్ర‌ముఖులు, అల్లు అర్జున్ వ్య‌వ‌హారం త‌ర్వాత తొలి భేటీ

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి