Chandrababu Arrest Row: చంద్రబాబు అరెస్టు, జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంపై ఎమ్మెల్యే బాలకృష్ణ రియాక్షన్ ఇదిగో
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీడీపీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై సినిమా వాళ్లు స్పందించకపోవడాన్ని తాను పట్టించుకోనని హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత, హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీడీపీ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌లో సైకో పాలన సాగుతోందన్నారు. ప్రజా సంక్షేమం వదిలి ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టే రాజకీయం కనిపిస్తోందన్నారు.
17ఏ సెక్షన్ పాటించకుండా చంద్రబాబును ఎలా అరెస్ట్ చేశారనేదే తమ ప్రశ్న అన్నారు. ఈ అరెస్ట్‌లో కేంద్రం పాత్ర ఉందో? లేదో? తమకు అవగాహన లేదన్నారు. అనవసరంగా నిందలు వేయలేమని, కానీ కేంద్రం కల్పించుకోవాల్సిన అవసరం ఉన్న సమయంలో వారు మాట్లాడకపోవడం మాత్రం వారి విజ్ఞతకు వదిలేస్తున్నామన్నారు.
రాళ్ల దాడి ప్లాన్ ఆధారాలు చూపించు, పవన్ కళ్యాణ్‌కు నోటీసులు ఇచ్చిన కృష్ణా జిల్లా పోలీసులు
తమ అక్క పురందేశ్వరి బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా ఉన్నారని, ఆమెతో టచ్‌లో ఉన్నామన్నారు. ఈ విషయమై తాము తప్పకుండా కేంద్రాన్ని కలుస్తామన్నారు. సినిమా వాళ్లు స్పందించకుంటే పట్టించుకోనని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జూనియర్ స్పందించకుంటే ఐ డోంట్ కేర్ అన్నారు. రోజా లాంటి వారి స్పందనపై మౌనంగా ఉండటమే మేలని, బురదమీద రాయి వేస్తే మనమీదే పడుతుందన్నారు. తాము కేసులకు, అరెస్టులకు భయపడేది లేదన్నారు. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందని చెప్పారు. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామన్నారు.