Polavaram Reverse Tendering: జగన్ సర్కార్ కొత్త రికార్డ్, పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 628 కోట్లు ఆదా, తక్కువ మొత్తానికి దక్కించుకున్న మేఘా కంపెనీ, టీడీపీ విమర్శల దాడి

పోలవరం రివర్స్ టెండరింగ్‌తో జగన్ సర్కార్ కొత్త అధ్యాయానికి తెరతీసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది.

Jagan govt to save Rs 628 crore from reverse tendering of Polavaram ( Photo Wikimedia Commons facebook)

Amaravathi, September 23:  పోలవరం రివర్స్ టెండరింగ్‌తో జగన్ సర్కార్ కొత్త అధ్యాయానికి తెరతీసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. గత వారం 65 వ ప్యాకేజీ పనులకు రివర్స్ టెండర్లు పిలిచిన ప్రభుత్వం.. సోమవారం పోలవరం ప్రాజెక్ట్ హెడ్‌వర్క్స్, జలవిద్యుత్ కేంద్రం నిర్మాణ పనులకు రివర్స్ టెండర్లు నిర్వహించింది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు ప్రధాన ప్రాజెక్ట్‌ రీ-టెండరింగ్‌ ద్వారా సర్కార్‌ రూ.628 కోట్లు ఆదా చేసింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం టెండర్లు రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పోలవరం టెండర్లలో భారీగా అవినీతి జరిగిందని, రివర్స్ టెండరింగ్ విధానంలో టెండర్లు పిలిచి పనులు అప్పగిస్తామని జగన్ సర్కార్ తెలిపింది. అందులో భాగంగానే పోలవరం ప్రాజెక్ట్ పనులకు సంబంధించి రివర్స్ టెండరింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.

గత వారం 65 వ ప్యాకేజీ పనులకు రివర్స్‌ టెండర్లు నిర్వహించగా సుమారు రూ.58 కోట్లు ఆదా అయ్యాయి. అవే పనులకు గత ప్రభుత్వ హయాంలో వేసిన బిడ్ కంటే 15.6 శాతం తక్కువకు అదే కంపెనీ టెండర్ వేయడం తెలిసిందే. ఈ రోజు పోలవరం హెడ్‌వర్క్స్‌, జలవిద్యుత్ కేంద్రాలకి ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండర్లు నిర్వహించింది. అంచనా వ్యయం కంటే 12.6 శాతం తక్కువకు బిడ్ ఖరారైంది. వ్యయం అంచనా రూ.4987 కోట్లు కాగా రూ.4,358 కోట్లకు మేఘా సంస్థ బిడ్ దాఖలు చేసింది. గతంలో వివిధ సంస్థలు చేపట్టిన ధర కంటే తక్కువకు పనులు చేపట్టేందుకు మేఘా సంస్థ ముందుకొచ్చింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి రూ.628 కోట్లు ఆదా అయ్యాయి.

దేశంలో ఇంతవరకు ఎక్కడా లేని విధంగా ఎల్-1గా వచ్చిన సంస్థ కోట్ చేసిన ధరను ప్రాథమిక అంచనా వ్యయాంగా పరిగణలోకి తీసుకుని దాని ఆధారంగా బిడ్డింగ్ నిర్వహించారు. జల విద్యుత్ కేంద్రంతో పాటు ప్రధాన కాంక్రీట్ నిర్మాణ పనికి రూ.4,987 కోట్లకు ప్రభుత్వం టెండర్ పిలవగా మేఘా సంస్థ ఒక్కటే టెండర్ దాఖలు చేసింది. దీంతో టెండర్ మేఘా సంస్థకు ఖరారైంది. కోర్టు అనుమతులు లభించిన వెంటనే సంస్థ నిర్మాణ పనులు ప్రారంభించనుంది. ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని సర్కార్ కాంట్రాక్ట్ సంస్థను ఆదేశించింది.

మేఘా కంపెనీ ట్రాక్ రికార్డు

ఇప్పటికే రికార్డు సమయంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని పూర్తి చేయటంతో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద‌దైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని మేఘా సంస్థ శరవేగంగా నిర్మించింది. అవసరమైన ప్రక్రియను పూర్తిచేసిన వెంటనే పోలవరం నిర్మాణ పనులు చేపట్టేందుకు మేఘా ఇంజనీరింగ్ సిద్ధమౌతోంది. ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోగా ఈ బహుళార్ధ సాధక ప్రాజెక్టును పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో మేఘా సంస్థ ఉంది.

గత ప్రభుత్వం ద్వారా ఖజానాకు రూ. 154 కోట్ల అదనపు భారం

గతంలో హైడల్‌ ప్రాజెక్టు పనులను 4.8శాతం అధిక ధరకు నవయుగ సంస్థకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అప్పగించింది. ఎక్సెస్‌ రేటుకు కట్టబెట్టడం వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ. 154 కోట్ల అదనపు భారం పడింది. ఈ భారాన్ని కూడా కలుపుకుంటే ప్రస్తుతం ఖజానాకు రూ. 782 కోట్లు ఆదా అయినట్టు అయిందని ఏపీ సర్కారు తెలిపింది. పోలవరం టెండర్లను గత ప్రభుత్వం కావాలనే అధిక మొత్తానికి కటబెట్టినట్టు నిపుణల కమిటీ నిర్ధారించింది. ఒకే సంస్థకు నామినేటెడ్‌ పద్ధతిలో గత చంద్రబాబు సర్కారు పోలవరం పనులను కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని చేపట్టింది.

ఫైర్ అయిన మాజీ మంత్రి దేవినేని ఉమ

పోలవరం భద్రతను ఏపీ సీఎం జగన్ తాకట్టు పెట్టారని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ ఆరోపించారు. తమ వాళ్లకు పనులు అప్పగించేందుకు పోలవరం రివర్స్ టెండర్ల విధానాన్ని తీసుకువచ్చారని మండిపడ్డారు. గతంలో ఆరోపణలు చేసిన సంస్థలను పనులు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. వారికి వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పి ఈ టెండర్ దాఖలు చేయించారని ఆరోపణలు చేసారు. గత ప్రభుత్వంపై బురదజల్లాలని డ్యామ్‌ భద్రతను సీఎం జగన్‌ తాకట్టుపెట్టాడని, కుట్రపూరిత రాజకీయాలతో కాంట్రాక్టర్లను లొంగదీసుకుంటున్నారని ఉమ మండిపడ్డారు. రివర్స్‌ టెండరింగ్‌ డ్రామాను నడపడానికి.. గతంలో జీవో నెం.67 జారీ చేశారని దేవినేని ఉమా గుర్తు చేసారు. ఒకటి కంటే ఎక్కువ సంస్థలు పాల్గొంటేనే.. రివర్స్‌ టెండరింగ్‌ ఉంటుందని జీవోలో పేర్కొన్నారని తెలిపారు.

రివర్స్ పంచ్ వేసిన మంత్రి కన్నబాబు

దేవినేని ఉమ వ్యాఖ్యలకు మంత్రి కన్నబాబు కౌంటర్ వేశారు. ముందు నుండి చెబుతున్నట్లుగా జగన్ తన సత్తా ఏంటో నిరూపించుకున్నారని చెప్పుకొచ్చారు. ఒక్క పోలవరం విషయంలోనే దాదాపు 900 కోట్లకు పైగా ఆదా అయిదంటే మిగిలిన ప్రాజెక్టులో ఎంత మేర దోచుకున్నారో తెలుస్తుందని ఆరోపించారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని నిలదీసారు. మిగిలిన ప్రాజెక్టుల విషయం లోనూ రివర్స్ టెండరింగ్ కు వెళ్తామని మంత్రి స్పష్టం చేసారు. ఇప్పటికైనా చంద్రబాబు ఏ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారో గుర్తించాలని టీడీపీ నేతలకు మంత్రి కన్నబాబు సూచించారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now