Justice Chandru’s Remarks Row: ఏపీలో కలకలం రేపుతున్న జస్టిస్ కె.చంద్రు వ్యాఖ్యలు, హైకోర్టుకు ఫిర్యాదు చేసిన రెబల్ ఎంపీ రఘురామ, చంద్రు వ్యాఖ్యలను ఖండించిన ఏపీ హైకోర్ట్
Amaravati, Dec 16: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిధులను, అధికారాలను దాటి వెళుతోందంటూ మద్రాసు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కె.చంద్రు చేసిన వ్యాఖ్యలు (Justice Chandru’s Remarks Row) చేసిన సంగతి విదితమే. ఈ వ్యాఖ్యలు ఏపీలో సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా (Chief Justice Prashant Kumar Mishra) నేతృత్వంలోని ధర్మాసనంతో పాటు మరో న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ అభ్యంతరం తెలిపారు.
జస్టిస్ చంద్రు పేరు ప్రస్తావించకుండా సీజే ధర్మాసనం, జస్టిస్ చంద్రు పేరును ప్రస్తావిస్తూ జస్టిస్ దేవానంద్ (Justice Devanand) సోమవారం పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. లైమ్‌లైట్‌లో ఉండేందుకు కొందరు జ్యుడిషియల్ సెలబ్రిటీలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని సీజే జస్టిస్ మిశ్రా వ్యాఖ్యానించారు. అలాంటి లైట్‌ను తాము ఆర్పివేస్తామన్నారు. న్యాయమూర్తులు కూడా మానవ మాత్రులేనని, వారూ తప్పులు చేస్తుంటారని ఆయన తెలిపారు.
మానవ హక్కుల గురించి మాట్లాడేందుకు వచ్చిన ఆయన దాని గురించే మాట్లాడి ఉండాల్సిందన్నారు. వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఏ పని మీద వచ్చారో ఆ పరిధిని మర్చిపోయి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిధి గురించి మాట్లాడటమేమిటని సీజే ఆక్షేపించారు. న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలపై దాఖలైన వ్యాజ్యం విచారణ సందర్భంగా సీజే ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై నమోదు చేసిన కేసులో పురోగతిపై అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని ధర్మాసనం ఆదేశించింది.
గ్రామ సచివాలయాలకు ఫర్నిచర్, స్టేషనరీ సరఫరా చేసిన వారికి బిల్లులు చెల్లించకపోవడంపై దాఖలైన వ్యాజ్యాల విచారణ సందర్భంగా జస్టిస్ దేవానంద్.. జస్టిస్ చంద్రు వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. జస్టిస్ చంద్రు వ్యాఖ్యలు హైకోర్టు ప్రతిష్టను దిగజార్చేవిగా ఉన్నాయన్నారు. హైకోర్టు మొత్తాన్ని ఒకే గాటన కట్టి మాట్లాడటం అభ్యంతరకరమన్నారు. ఆయనకు ఎవరిపైనైనా అభ్యంతరం ఉండి ఉంటే వారి గురించి మాట్లాడితే సరిపోయేదన్నారు. మొత్తం హైకోర్టును ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని తెలిపారు.
జస్టిస్ చంద్రుపై ఉన్న గౌరవం పోయిందన్నారు. గౌరవానికి ఆయన ఏమాత్రం అర్హులు కారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుతో పోరాడుతోందన్న వ్యాఖ్యలు ఎంత మాత్రం సమంజసం కాదని తెలిపారు. పౌరుల హక్కుల పరిరక్షణకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేస్తున్న విషయం ఆయనకు తెలిసినట్లు లేదని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులపై పెట్టిన అనుచిత పోస్టులపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం తప్పెలా అవుతుందన్నారు.
హైకోర్టును ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినందుకు జస్టిస్ చంద్రుపై క్రిమినల్ కోర్టు ధిక్కార చర్యలు ప్రారంభించాలని ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయాలని భావించానని, అయితే జస్టిస్ చంద్రు వయస్సు, న్యాయవాదిగా ఆయన అందించిన సేవలను దృష్టిలో పెట్టుకుని ఆ ఆలోచనను విరమించుకున్నానని జస్టిస్ దేవానంద్ తెలిపారు. న్యాయమూర్తిగా తాను చేసిన రాజ్యాంగ ప్రమాణానికి విరుద్ధంగా వ్యవహరించినట్లు నిరూపిస్తే తక్షణమే బాధ్యతల నుంచి తప్పుకుంటానన్నారు. దేశంలో ఉన్న 25 హైకోర్టుల్లో కనీస మౌలిక సదుపాయాలు లేని హైకోర్టు ఏపీ హైకోర్టు మాత్రమేనన్నారు. కనీస సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు.
ఫర్నిచర్, స్టేషనరీ సరఫరా బిల్లులు చెల్లించకపోవడంపై వివరణ ఇచ్చేందుకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శంషేర్ సింగ్ రావత్ కోర్టు ముందు హాజరయ్యారు. శాఖల అంతర్గత విషయాల వల్ల సకాలంలో బిల్లులు చెల్లించలేకపోయామని రావత్ చెప్పారు. నిధులు విడుదల చేశామని, కొద్ది రోజుల్లో చెల్లింపు పూర్తవుతుందన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ దేవానంద్, విచారణను ఈ నెల 22కు వాయిదా వేశారు. ఆలోపు బిల్లుల మొత్తాలు అందాయో లేదో చెప్పాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులకు స్పష్టం చేశారు. వ్యక్తిగత హాజరు నుంచి రావత్‌కు మినహాయింపునిచ్చారు.
ఈ పరిస్థితులు ఇలా ఉంటే జస్టిస్ చంద్రుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఫిర్యాదు చేశారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు.
కొద్ది రోజుల క్రితం ఓ ఆంగ్ల దినపత్రికలో ఏపీ హైకోర్టు విషయమై జస్టిస్ చంద్రు ఆర్టికల్ రాశారని.. బాధ్యతారాహిత్యమైన ఆయన వ్యాఖ్యలను తమ దృష్టికి తీసుకొస్తున్నట్లు ఎంపీ రఘురామ లేఖలో పేర్కొన్నారు. గతంలో తమ పార్టీకి చెందిన ఓ పార్లమెంట్ సభ్యుడు కూడా ఇలాంటి ప్రకటనలు చేశారని.. ఇప్పుడు జస్టిస్ చంద్రు వ్యాఖ్యలు చేయడంలోనూ ఆయన కీలకపాత్ర పోషించారని ఎంపీ రఘురామ ఆరోపించారు. దీని ద్వారా వ్యూహాత్మకంగా మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నారు.
వాస్తవానికి న్యాయ వ్యవస్థపై దూషణలు చేసిన వారి జాబితాలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆ ఎంపీ పేరు కూడా ఉందని.. అయితే ఇప్పటివ రకు ఆయనపై చర్యలు తీసుకోలేదని లేఖలో ఎంపీ రఘురామ పేర్కొన్నారు. జస్టిస్ చంద్రు లాంటి వారి వ్యాఖ్యలు.. గౌరవనీయ స్థానాల్లో ఉన్న సంస్థలపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తాయని రఘురామ ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ హైకోర్టుతో పాటు భారత న్యాయవ్యవస్థ గౌరవాన్ని కించపరిచేలా జరుగుతున్న ఈ కుట్రపై సుమోటోగా విచారణ ప్రారంభించాలని అభ్యర్థిస్తున్నట్లు లేఖలో రఘురామ కోరారు.
జస్టిస్ చంద్రు వ్యాఖ్యలపై ఏపీ మాజీ సీఎం, టీపీడీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. పొరుగు రాష్ట్రానికి చెందిన హైకోర్టు మాజీ న్యాయమూర్తికి ఇక్కడకొచ్చి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరమేముందని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీ జగన్ సర్కార్ ను మెచ్చుకుంటూ.. ఏపీ హైకోర్టుపై బహిరంగ వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఇది రాజ్యాంగ ఉల్లంఘన అంటున్నారు. రిటైర్ అయిన తర్వాత వీళ్లకు పదవులు కావాలి. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఏపీలో ఉన్న దారుణ పరిస్థితులు వీళ్లకు పట్టవా..? రాష్ట్రంలో కొందరు పేటీఎమ్ బ్యాచ్‌లుగా తయారయ్యారని.. ఏపీలో ఆత్మహత్యలు, అల్లకల్లోలం ఆ జడ్జీలకు కనపడదా..! అని విమర్శించారు. ఒక నేరస్థుడికి ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేయ వచ్చా..? అని ఆగ్రహాం వ్యక్తం చేశారు.
జస్టిస్ చంద్రు ఏమన్నారంటే..
ఆంధ్రప్రదేశ్ హై కోర్టు తన పరిధి దాటి వ్యవహరిస్తోందని, ప్రభుత్వం శత్రువులు, ప్రత్యర్థులతో కాదు న్యాయవ్యవస్థతో వార్ చేస్తోందని అన్నారు. అంతేకాదు.. అమరావతి భూస్కామ్‌లో ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేస్తే హైకోర్టు స్టే ఇచ్చిందని, కోర్టులు న్యాయం చేయాల్సిందిపోయి ఏదో చేయడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపణలు చేశారు.