Monsoon Forecast 2022: ఏపీకి వాతావరణ శాఖ చల్లని కబురు, ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణానికి మించి వర్షాలు, సమృద్ధిగా వానలు కురుస్తాయని తెలిపిన వాతావరణశాఖ
ఏటా జూన్ నుంచి మొదలయ్యే నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) సీజన్.. ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణానికి మించి వర్షాలను కురిపిస్తుందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది.
ఏపీకి ఐఎండీ చల్లని కబురు అందించింది. ఏటా జూన్ నుంచి మొదలయ్యే నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) సీజన్.. ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణానికి మించి వర్షాలను కురిపిస్తుందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది సాధారణ వర్షాలే ( adequate rainfall) కురుస్తాయని తాజాగా వెల్లడించినా.. రాష్ట్రానికి మాత్రం సమృద్ధిగా వానలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఐఎండీ ఇటు రైతాంగానికి, ప్రభుత్వానికి ఎంతో ఊరట కలిగిస్తోంది.
కాగా గడచిన మూడేళ్లుగా రాష్ట్రంలో ఇటు నైరుతి, అటు ఈశాన్య రుతుపవనాలు మంచి వర్షాలే కురిపిస్తున్నాయి. ఫలితంగా పంటల దిగుబడులు ఆశాజనకంగా ఉంటున్నాయి. గత ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో రాష్ట్రంలో సాధారణం కంటే 19 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఇక రాష్ట్రంలో నైరుతి సీజనులో సగటు సాధారణ వర్షపాతం 514 మిల్లీమీటర్లు కాగా.. 2021లో (జూన్–సెపె్టంబర్) 613.3 మిల్లీమీటర్లు (+19 శాతం) కురిసింది.
కడప, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదైంది. అనంతపురం, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో సాధారణ వర్షపాతం రికార్డయింది.