Fire (Representational image) Photo Credits: Flickr)

Kadapa, April 18: ఏపీలో వైఎస్‌ఆర్‌ జిల్లా బి.కోడూరు మండలంలోని మేకవారి పల్లెలో ల్యాప్‌టాప్‌ పేలి ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సుమలత (22) అనే టెక్కీ సోమవారం ఉదయం వర్క్‌ ఫ్రం హోమ్‌ చేస్తున్న సమయంలో షార్ట్‌ సర్క్యూట్‌తో ల్యాప్‌టాప్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బెడ్‌పైన కూర్చొని వర్క్‌ చేస్తున్న సుమలత విద్యుత్‌ షాక్‌కు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. బెడ్‌కు సైతం మంటలు అంటుకున్నాయి.

గదిలో నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు అప్పడికే తీవ్రంగా గాయపడిన సుమలతను చికిత్స నిమిత్తం కడప సన్‌రైజ్‌ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో రిమ్స్‌ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. దాదాపు 80 శాతం కాలిన గాయాలవ్వడంతో యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా సుమలత బెంగుళూరుకు చెందిన మ్యాజిక్ టెక్ సొల్యూషన్‌లో పనిచేస్తోంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటన జరగకపోవడంతో ల్యాప్‌ట్యాప్‌ పేలిన విషయం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.